Wednesday, May 1, 2024

టెస్లాకు స్వాగతం, షరతులు వర్తిస్తయ్‌.. మస్క్‌ భారత్‌ను సందర్శించండి..

ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌కు భారత్‌ ప్రభుత్వం కూడా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్‌ కార్లు తయారు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని, ఈ మేరకు టెస్లాలకు స్వాగతం పలుకుతున్నామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. ఓ సదస్సులో భాగంగా నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ.. భారత్‌లో తమ ఉత్పత్తులను తయారు చేసుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గడ్కరీ ప్రకటించారు. భారత్‌ వద్ద అన్ని సామర్థ్యాలు, వనరులు ఉన్నాయని, సాంకేతికతలో కూడా ఎంతో ముందంజలో ఉందని గుర్తు చేశారు. భారతీయ వనరులను ఉపయోగించుకుని కార్లు తయారు చేయాలని భావిస్తే.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. భారత్‌లో కార్లు తయారు చేస్తే.. ఖర్చు తగ్గుతాయని, లాభాలు పెరుగుతాయని గుర్తు చేశారు. అవకాశం ఉంటే.. భారత్‌లో పర్యటించాల్సిందిగా ఎలాన్‌ మస్క్‌ను గడ్కరీ కోరారు.

అన్ని రకాలుగా సాయం..

భారత్‌కు వస్తే.. ఇక్కడి పాలసీలు, పరిస్థితులు, వనరులు వివరిస్తామని, కార్ల తయారీని కూడా ప్రారంభించొచ్చని, కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని గడ్కరీ వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌కు భారత్‌ కేంద్ర బిందువు అని, పోర్టులు, విమానాశ్రయాలు కూడా అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. భారత్‌లో తయారు చేసిన టెస్లా కార్లను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయని వివరించారు. మేడ్‌ ఇన్‌ చైనా పేరుతో టెస్లా కార్లతో భారత్‌లోకి ప్రవేశించే అవకాశం మాత్రం లేదన్నారు. భారత్‌లో మస్క్‌కు ఘన స్వాగతం లభిస్తుందని, కానీ చైనాలో తయారు చేసిన కార్లను ఇక్కడ విక్రయించుకోవాలనుకోవడం సరైన నిర్ణయం కాదని సూచించారు. ఇది భారత్‌దేశ ప్రయోజనాలకు మంచిది కాదని వ్యాఖ్యానించారు. టెస్లా తన తయారీని దేశీయంగా చేసి విక్రయించాలని సూచించారు.

పన్ను మినహాయింపు ఉండదు..

భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్‌ కార్లను తీసుకురావాలని ఎలాన్‌ మస్క్‌ చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. దీని కోసం పన్ను మినహాయింపు ఇవ్వాలని కంపెనీ కోరుతున్నది. దీన్ని భారత్‌ ప్రభుత్వం తిరస్కరిస్తూనే వస్తున్నది. ఎందుకంటే.. మస్క్‌.. తన కార్లను చైనాలో తయారు చేసి భారత్‌లో అమ్మాలనుకుంటున్నారు. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను చట్టాల ప్రకారం.. దిగుమతి చేసుకునే విదేశీ కార్లకు భారీ పన్నులు ఉన్నాయి. అందుకోసమే టెస్లా పన్ను మినహాయింపు కోరుతున్నది. కేంద్రం మాత్రం దీనికి అంగీకరించడం లేదు. భారత్‌లోనే ప్లాంట్‌ ఏర్పాటు చేసి తయారు చేసుకోవాలని చెబుతున్నది. ఎగుమతి చేసుకునే సౌలభ్యాన్ని కూడా కల్పిస్తామని హామీ ఇస్తున్నది. ఎలక్ట్రిక్‌ కార్ల దిగుమతిపై భారత్‌ ప్రభుత్వం 100 శాతం సుంకం విధిస్తున్నది. దీంతో ధర రెండింతలు అవుతుంది. మరోవైపు ఈవీ వాహనాల విడి భాగాల దిగుమతిపై ప్రభుత్వం 15 నుంచి 30 శాతం ట్యాక్స్‌ విధిస్తున్నది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement