Friday, May 17, 2024

Delhi | ఢిల్లీ సర్కారుకు అండగా ఉంటాం.. కేజ్రీవాల్‌కు భరోసా ఇచ్చిన సీపీఐ అగ్రనేతలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీలో ఉన్నతాధికారుల బదిలీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ చేస్తున్న పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) మద్దతు ప్రకటించింది. ఎన్నికైన ప్రభుత్వాలకు అధికారం లేకుండా నామినేట్ చేసిన గవర్నర్లకు అధికారాలకు కట్టబెట్టే ఈ ఆర్డినెన్సును తాము విధానపరంగానే వ్యతిరేకిస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేతలు ప్రకటించారు. బుధవారం ఢిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయం అజొయ్ భవన్‌ను సందర్శించిన అరవింద్ కేజ్రీవాల్, అక్కడ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, జాతీయ కార్యదర్శి పి. నారాయణతో సమావేశమయ్యారు.

ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాలు జరిపే అధికారం ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికే ఉంటుందని, లెఫ్టినెంట్ గవర్నర్‌కు కాదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిన కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకొచ్చి లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వివిధ పార్టీల మద్ధతు కూడగట్టే క్రమంలో దేశవ్యాప్తంగా పర్యటిస్తూ వివిధ పార్టీల అధినేతలతో అరవింద్ కేజ్రీవాల్ సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో బుధవారం సీపీఐ నేతలతో ఆయన సమావేశమై మద్దతు కోరారు.

- Advertisement -

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, ప్రజలు ఓటేసి గెలిపించిన ప్రభుత్వానికి కేంద్రం అధికారం ఇవ్వడం లేదని మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పుదుచ్ఛేరిలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమాఖ్య వ్యవస్థకు విఘాతం కల్గించే ఇలాంటి ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తామని, ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఓటేస్తామని ప్రకటించారు. ఈ పోరాటంలో ఢిల్లీ ప్రభుత్వానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

అనంతరం సీపీఐ జాతీయ కార్యదర్శి పి. నారాయణ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పును కూడా కేంద్ర ప్రభుత్వం పక్కనపెట్టిందని అన్నారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని కాదని నామినేట్ చేసిన గవర్నర్ ద్వారా పాలన కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రిని కేవలం ఉత్సవ విగ్రహంగా మార్చేశారని అన్నారు. వంటింట్లో వంట మనిషి కేజ్రీవాల్‌పై చేయిచేసుకున్నా కూడా కేసు పెట్టలేరని, కేంద్ర ప్రభుత్వమే కేసు పెట్టాల్సి ఉంటుందని చెప్పారు. ఇంత ఘోరమైన పరిస్థితి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎక్కడా లేదని నారాయణ అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు మర్యాద లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. పాట్నాలో ఈ నెల 23న తలపెట్టిన ప్రతిపక్షాల సమావేశంలో సీపీఐ తరఫున జనరల్ సెక్రటరీ రాజా హాజరవుతారని తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీకి, మోడీకి వ్యతిరేకత పెరుగుతోందని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీలపై ఐటీ దాడులు, దర్యాప్తు సంస్థలతో కేసులు పెడుతున్నారని నారాయణ ఆరోపించారు. కర్ణాటక ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు. కేసీఆర్, చంద్రబాబు భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీలకు తాము మద్దతివ్వబోమని ప్రకటించారు.

ఆర్డినెన్స్ అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది: కేజ్రీవాల్

ఢిల్లీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ ఆర్డినెన్స్ వ్యతిరేక పోరాటంలో మద్దతు ప్రకటించిన సీపీఐ నేతలకు కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి అజొయ్ భవన్‌కు వచ్చానని అన్నారు. బీజేపీయేతర పార్టీలు ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ ఈ ఆర్డినెన్సును తీసుకొస్తారని కేజ్రీవాల్ అన్నారు. అధికారులకు పోస్టింగులు, బదిలీలు జరిపే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా చేస్తోందని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement