Monday, May 6, 2024

వర్షాలు, వరదల పై అప్రమత్తంగా ఉండాలి.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు అతలాకుతలమైన పలు ప్రాంతాల్లో తాజా పరిస్థితులు, పునరావాస చర్యలు, అంటు, సీజనల్ వ్యాధుల నివారణ వంటి పలు అంశాల పై మంత్రి జనగామ కలెక్టరేట్ లో సమీక్షించారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ వానాకాలం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త వహించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు పంపాలన్నారు. పునరావాస చర్యలు చేపట్టాలని చెప్పారు. వర్షాల తర్వాత అంటు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలన్నారు.

ఈ మేరకు అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలని, ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ శివలింగయ్యను మంత్రి అదేశించారు. వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, త్రాగునీటి సరఫరా పారిశుధ్యంపై నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు, zp సీఈఓ, డీపీఓ, డీఎం అండ్ హెచ్ఓ, drdo, police అధికారులు పాల్గొన్నారు. అనంతరం స్టేషన్ ఘన్ పూర్ మండలం సముద్రాలలో క్షేత్ర పరిశీలన చేసిన మంత్రి ప్రజలతో మాట్లాడి తాజా పరిస్థితులు తెలుసుకున్నారు. అలాగే మంత్రి, ఎమ్మెల్యే రాజయ్య ఇప్పగూడెంలో హరితహరంలో భాగంగా మొక్కలు నాటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement