Saturday, December 7, 2024

Delhi | విభజనతో నష్టపోయింది మేమే.. నీళ్లు, నిధులు, నియామకాలు కావాలి: బైరెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాష్ట్ర విభజన వల్ల అన్నివిధాలుగా అత్యంత ఎక్కువ నష్టపోయింది తమ ప్రాంతమేనని రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ… రాయలసీమ సమస్యలు, ఇబ్బందులపై పది వేల మందితో ఈనెల 28న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. నిరసన తెలపడానికి నాలుగు ట్రైన్లలో రావాలని తాము భావించినా రైల్వే శాఖ ఇప్పటివరకు ఒక్క రైలుకు మాత్రమే అనుమతిచ్చిందని తెలిపారు. ఎలాగైనా సరే పెద్దసంఖ్యలో ఢిల్లీ చేరుకుని రాయలసీమ సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి తమ గళం వినిపిస్తామని స్పష్టం చేశారు.

దేశ రాజధాని నడిబొడ్డున ధర్నా నిర్వహించి తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. పార్లమెంట్‌ను ముట్టడించే ప్రయత్నం చేస్తామన్నారు. రాయలసీమ హక్కుల పోరాటంలో పాల్గొనవలసినదిగా అన్నిపార్టీల నాయకులను ఆహ్వానిస్తామని, అలాగే కేంద్ర పెద్దలకు వినతి పత్రాలు సమర్పిస్తామని రాజశేఖర్‌రెడ్డి వెల్లడించారు. కరవు నేల రాయలసీమకు రాయలసీమ నేతలే మొదటి శత్రువులని విమర్శించారు. తమ ప్రాంతం నేతలే పాలకులుగా ఉన్నప్పటికీ రాయలసీమ బాగు కోసం చేసిందేమీ లేదని ఆరోపించారు.

- Advertisement -

సీమకు రెండవ శత్రువు కర్ణాటక అన్న ఆయన, అప్పర్ భద్ర డ్యాం కట్టి ఆ రాష్ట్రం సీమకు నీరు రాకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు. సీమకు మూడో శత్రువు సినిమా పరిశ్రమ అని రాజశేఖర్‌రెడ్డి దుయ్యబట్టారు. సినిమాల్లో కొండారెడ్డి బురుజు దగ్గర హత్యలు, రక్తపాతం చూపించి సీమ అంటే భయపడేలా చేస్తున్నారని అన్నారు. వర్షపు నీటి మీద మాత్రమే ఆధారపడి పంటలు వేయండంటూ రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. అప్పర్ భద్ర కడితే పులివెందులకు కూడా నీళ్ళు రావని చెబుతున్నా సరే సీఎం జగన్ పట్టించుకోవడం లేదని వాపోయారు. తీగల వంతెన వచ్చిందంటూ కొంతమంది నేతలు ఘనంగా చెప్పుకుంటున్నా… దానివల్ల సీమకు ఒరిగేదేమీ లేదని చెప్పుకొచ్చారు.

ఆ స్థానంలో బ్రిడ్జి కమ్ బ్యారేజ్ కట్టాలని రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమను ఇలాగే వడిలిపెడితే దేశ చిత్రపటం నుంచే మాయం అయ్యేలా ప్రమాదం ఉందని, ఆ స్థాయిలో తిండి లేక, ఉపాధి లేక వలసలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో సీమ బండి వెనక్కి పోతోందే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు సాగడం లేదని ఎద్దేవా చేశారు. ఆయన ఆస్తిపాస్తులు కర్ణాటకలో ఉన్నాయి కాబట్టి, ఆ రాష్ట్రం ఎంత అన్యాయం చేస్తున్నా మాట్లాడడం లేదని ఆరోపించారు. దేశంలో అందరూ యాక్టివ్ సీఎంలు ఉంటే, ఏపీలో మాత్రం స్లీపింగ్ సీఎం ఉన్నారని, జగన్ నిద్రావస్థలో ఉన్నారని రాజశేఖర్ దుయ్యబట్టారు.

అసలు రాజధానే లేకుండా ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. జగన్ తన కుటుంబంలో ఆయన నంబర్ వన్ కావొచ్చు కానీ రాష్ట్రాభివృద్ధి విషయంలో మాత్రం కాదని తేల్చి చెప్పారు. ఏపీ ఇసుక దోపిడీలో నంబర్ వన్, లిక్కర్ దందాలో నంబర్ వన్, అప్పుల్లో నంబర్ అంటూ విమశ్రించారు. విశాఖలో ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే చర్యల్లేవని రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement