Friday, April 26, 2024

అప్రమత్తతే ఆయుధం..

మహబూబ్‌నగర్‌, ప్రభ న్యూస్‌: సైబర్‌ నేరగాళ్ల మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రతిఒక్కరూ ఈ నేరాలపై అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండడమే ప్రధాన ఆయుధమని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా మోసపోతే వెంటనే సంబంధిత పోర్టల్‌లో ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఫిర్యాదుతో దేశవ్యాప్తంగా ఒకేసారి వివరాలు వెళ్లి సంబంధిత నేరంపై విచారణ సులువు అవుతుంది. తక్షణ ఫిర్యాదుతో బాధితులు కోల్పోయిన డబ్బులు తిరిగి పొందే అవకాశాలు ఉంటాయి. ఇటీవల కాలంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఎక్కడో ఒకచోట ఈ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. సైబర్‌ నేరాలు జరిగిన వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాటిని రికవరీ చేసేందుకు ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.

తక్షణమే ఫిర్యాదు చేస్తే మేలు ..

ఎవరైనా ఫోన్‌, వాట్సాప్‌, మెయిల్‌, ఫేస్‌ బుక్‌ తదితర మాధ్యమాల ద్వారా మోసంచేస్తే వెంటనే సైబర్‌ క్రైం విభాగం టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్‌చేసి ఫిర్యాదు చేయాలి. సైబర్‌ క్రైం పోర్టల్‌లోనూ ఫిర్యాదు చేస్తే వెంటనే కోల్పోయిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. చాలా కేసుల్లో ఫిర్యాదు చేయడంలో జాప్యం చేస్తున్నారు. మోసపోయామని తెలిశాక స్థానిక పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో రికవరీ చేయడంలో ఆలస్యం జరుగుతోంది. అలా కాకుండా వెంటనే బాధితులు అప్రమత్తమై సైబర్‌ క్రైం పోర్టల్‌, టోల్‌ ఫ్రీం నెంబర్‌లకు ఫోన్‌లు చేసి వివరాలు ఇస్తే తిరిగి డబ్బులు పొందే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో పదుల కేసులు నమోదవుతుండగా ఇంకా చాలా కేసుల్లో కోల్పోయిన డబ్బులు తిరిగి పొందాల్సి ఉంది. అయితే పోలీసులు బాధితుల డబ్బును తిరిగి ఇప్పించేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల గుట్టును రట్టుచేసేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

సాంకేతితతో దర్యాప్తు ..

ఆన్‌లైన్‌ మోసాల్లో దర్యాప్తు చేయడంలో పోలీసు అధికారులు పూర్తిగా సాంకేతికత సాయంతో వెళ్లాల్సి ఉంటుంది. బాధితుడి నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏ బ్యాంకు నుంచి డబ్బులు కట్‌ అయ్యాయి.. ఏ బ్యాంకు వెళ్లాయి..? ఎన్నిసార్లు మోసం చేశారు.. ఎలా మోసం చేశారు.. ఏ నెంబర్ల నుంచి మెస్సేజ్‌లు, లింక్‌లు వచ్చాయి. అనేది దర్యాప్తుల్లో తేలుస్తారు. బ్యాంకు అధికారుల నుంచి కోర్టు అనుమతితో వివరాలు సేకరిస్తారు. సైబర్‌ నేరగాళ్ల డబ్బులు జమ అయిన బ్యాంకు అకౌంట్‌ ప్రీజింగ్‌/ హోల్డింగ్‌ లో పెడతారు. అంటే ఒకవేళ బాధి తుల డబ్బులు ఆ అకౌంట్‌లో ఉంటే లావాదేవీలు జరగకుండా నిలుపుదల చేయిస్తారు. అలా సైబర్‌ నేరగాళ్లకు ఎన్ని బ్యాంకు అకౌంట్లు ఉంటే అన్ని బ్యాంకుల్లో దేశంలో ఎక్కడున్నా అకౌంట్లను సీజ్‌ చేయిస్తారు. అలా నేరస్తులను ఆయా సంస్థల సహకారంతో డబ్బులు తిరిగి ఇప్పిస్తుంటారు. ఉదాహరణకు పేటీఎం, తదితర యాప్‌ల నుంచి జరిగితే 24గంటల్లోనే డబ్బులు రికవరీకి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement