Thursday, May 16, 2024

‘ది స్ట్రగుల్ ఫర్ పోలీస్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి.. పోలీస్ శాఖల్లో ఖాళీల భర్తీకి పిలుపు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రగతిశీల, ఆధునిక భారతదేశంలో ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసు బలగాలు సంసిద్ధం కావాలని, ఇందుకోసం పోలీసు బలగాల సంస్కరణలను అమలు చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. మాజీ పోలీస్ అధికారి ప్రకాష్ సింగ్ రచించిన ‘ది స్ట్రగుల్ ఫర్ పోలీస్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా’ పుస్తకాన్ని ఆదివారం న్యూఢిల్లీలో ఆయన ఆవిష్కరించారు. 21 శతాబ్దపు సైబర్ క్రైమ్ వంటి నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, ఈ తరం సవాళ్ళకు అనుగుణంగా పోలీసుల నైపుణ్యాలను మెరుగు పరచాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఖాళీల భర్తీ మొదలుకుని ఆధునిక పోలీసింగ్ అవసరాలకు అనుగుణంగా పోలీసు శాఖలో మౌలిక సదుపాయాల కల్పన సహా యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాల్సిన అంశాలను నొక్కిచెప్పిన వెంకయ్య, ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో పోలీసుల నివాస సముదాయాలతో సహా ప్రతి అంశంలోనూ ఈ మార్పులు జరగాలని సూచించారు. సామాన్య ప్రజల పట్ల పోలీసుల స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించిన ఉపరాష్ట్రపతి, అనేక మంది పోలీసు అధికారులు ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందు కోసం పోలీసుల వైఖరిలో స్పష్టమైన మార్పు రావలసిన అవసరం ఉందన్న ఆయన, ప్రతి ఒక్కరి సమస్యను విని అర్ధం చేసుకునే ఓపికను పోలీసులు కలిగి ఉండాలని పేర్కొన్నారు. పోలీస్ రంగంలో సంస్కరణల కోసం అనేక సంవత్సరాలుగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదని, సుప్రీం కోర్టు మార్గదర్శకాలను సక్రమంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ సంకల్పం అవసరమని పేర్కొన్నారు. 1857 తర్వాత బ్రిటిష్ పాలకులు తమ సామ్రాజ్య ప్రయోజనాలను నిలబెట్టుకోవడమే ప్రధాన అజెండాగా పోలీసు బలగాలకు రూపకల్పన చేశారన్న ఉపరాష్ట్రపతి, స్వరాజ్య సముపార్జన తర్వాత కూడా ఈ విషయంలో ఆశించిన మేర సంస్కరణలు రాకపోవడం బాధాకరమని, వీలైనంత త్వరగా పోలీసింగ్ లో విస్తృతమైన సంస్కరణలు తీసుకురావాలని సూచించారు.

ఎమర్జెన్సీ సమయంలో మానవ హక్కుల అణచివేత విషయంలో నాటి పాలకులు పోలీసు బలగాలను దుర్వినియోగం చేసిన విషయాన్ని వెంకయ్య నాయుడు ప్రస్తావించారు. 2006 నాటి పోలీసు సంస్కరణలపై సుప్రీం కోర్టు ఆదేశాల అమలు కార్యరూపం దాల్చకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, పోలీసింగ్ అనేది రాష్ట్రాల పరిధిలో ఉన్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బృంద స్పూర్తితో ఈ సంస్కరణలను అమలు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఖైదీల గుర్తింపు చట్టం 1920 సహా మెరుగైన పోలీసింగ్ కోసం భారత ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నూతన శతాబ్ధపు సవాళ్ళను అధిగమించడంలో స్మార్ట్ ఫోర్స్ సంస్కరణలు ఎంతగానో తోడ్పడతాయంటూ ఇండియన్ పోలీస్ ఫాండేషన్ కృషిని ప్రత్యేకంగా అభినందించారు. పోలీసు సంస్కరణలను సమర్ధించిన పుస్తక రచయిత ప్రకాష్ సింగ్‌ తన ఒంటరి ప్రయత్నాలతో ఇంత సాధించారన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో నేరస్తులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, అరాచక శక్తులతో పోరాడుతూ విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసుల స్మృతికి ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు. పుస్తక రచయిత, బీఎస్ఎఫ్ మాజీ డైరక్టర్ జనరల్ ప్రకాష్ సింగ్, ఇండియా టుడే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కౌశిక్ దేకా, కామన్ కాజ్ డైరక్టర్ విపుల్ ముద్గల్, ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ అధ్యక్షులు ఎన్. రామచంద్రన్, రూపా పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరక్టర్ కపీష్ మెహ్రా సహా పలువురు రిటైర్డ్, సీనియర్ పోలీసు అధికారులు, పాత్రికేయులు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement