Tuesday, May 21, 2024

Delhi | మణిపూర్ ఘటన అందరికీ కనువిప్పు.. కొత్త చట్టాలను స్వాగతిస్తున్నా : వి.హనుమంత రావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లను రద్దుచేస్తూ కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మూడు ప్రత్యామ్నాయ చట్టాలను స్వాగతిస్తున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంత రావు తెలిపారు. శనివారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కొత్త చట్టాల్లో రాజద్రోహాన్ని తొలగించడంతో పాటు మహిళలపై పాల్పడే నేరాలకు, మూకదాడులకు మరణశిక్ష విధించడాన్ని స్వాగతించారు.

మణిపూర్‌ హింస, మహిళలను వివస్త్రగా మార్చి ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘోరాలు దేశానికి కనువిప్పు కల్గించాయని కాంగ్రెస్ నేత వి. హనుమంత రావు అన్నారు. ఈ అంశంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయని, ప్రధాన మంత్రితో మాట్లాడించేందుకు ఏకంగా అవిశ్వాస తీర్మానాన్నే ప్రవేశపెట్టాల్సి వచ్చిందని తెలిపారు. మొత్తానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. కొత్త చట్టాల రూపకల్పన ఆహ్వానించదగ్గ పరిణామంగా పేర్కొన్నారు.

తెలంగాణలో హాజిపూర్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి హతమార్చిన సైకో ఘటన విషయంలో తాను పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చానని గుర్తుచేశారు. అక్కడికి 7 సార్లు వెళ్లి బాధిత కుటుంబాలతో మాట్లాడానని చెప్పారు. పోలీసులు కూడా తగిన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకు ఇవ్వడంతో నిందితులకు కోర్టు శిక్ష ఖరారు చేసిందని, అయితే ఆ శిక్ష ఇంకా అమలు కావడం లేదని తెలిపారు. విధించిన శిక్ష అమలు కాకుండా జరుగుతున్న జాప్యానికి చట్టాల్లోని లొసుగులే కారణమని అన్నారు.

మరోవైపు తెలంగాణలో మహిళలు, చిన్నారులపై పెరిగిపోతున్న నేరాలకు మద్యం, గంజాయి కారణమని ఆరోపించారు. పాన్ షాప్‌ల మాదిరిగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ మద్యం దుకాణాలు తెరిచారని, వాటిలో సిట్టింగ్ సదుపాయాన్ని కూడా కల్పించారని వీహెచ్ అన్నారు. కేంద్రం తెచ్చే కొత్త చట్టం త్వరగా రావాలని, చట్టాలు కఠినంగా ఉంటేనే మహిళలకు రక్షణ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement