Tuesday, April 30, 2024

విశాఖ వైసీపీలో రగిలిన చిచ్చు

గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి దూకుడుగా ఉన్న వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. మేయర్ పదవి ఇవ్వనందుకు నిరసనగా ఆ పార్టీ నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మేయర్ పదవి ఇస్తామని నమ్మించి కార్పొరేటర్‌గా పోటీ చేయించారని, తీరా పార్టీ గెలిచాక తమ నేతను మోసం చేశారని వంశీకృష్ణ అభిమానులు మండిపడుతున్నారు.

కాగా తనకు కార్పొరేటర్‌గా అవకాశం ఇచ్చిన తన వార్డు ప్రజలకు వంశీకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు. తానొక దురదృష్టవంతుడిని అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కొన్ని దుష్ట శక్తులు తనను అడ్డుకున్నాయని ఆరోపించారు. తాను ఒక సామాన్య కార్యకర్తగా ఉంటానని చెబుతూ.. నిరసనగళం వినిపించారు. అక్కడే ఉన్న అభిమానులను వంశీ కృష్ణ శ్రీనివాస్ ఓదార్చారు. వంశీకి మేయర్ పదవి ఇవ్వకపోవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వర్గీయులు జీవీఎంసీ ఔట్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. కొందరు మహిళలు కంటతడిపెట్టుకున్నారు. సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా వంశీ అనుచరులు నినాదాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement