Monday, May 13, 2024

వాతావరణంలో అనూహ్య మార్పులు.. 10వ తేదీ వరకు వర్షాలు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పది రోజుల క్రితం వరకు ప్రచండ భానుడి ప్రతాపాగ్నికి జనం అల్లాడిపోయారు. 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత వారం రోజులుగా జోరు వానలతో రైతాంగం అష్టకష్టాలు పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అకాల వర్షాలతో రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, అరటి , మామిడి, నిమ్మ పంటలు దెబ్బతిన్నాయి. ద్రోణి ప్రభావంతో ఈనెల 10 వతేదీ వరకు రాష్ట్రంలో జోరు వానలు కురుస్తాయని, 11వ తేదీ నుంచి సాధారణం కంటే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.అది ఇపుడు సగటు- సముద్ర మట్టానికి 1.5 కి.మీ 5.8 కి.మీ ఎత్తులో ఈరోజు అదే ప్రాంతము లో అనగా నైరుతి బంగాళాఖాతం మరియు ఉత్తర తమిళనాడు తీరంలో కొనసాగుతున్నది. ఈనెల 8వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఆగ్నేయ దిశగా కదిలి మే 9న బంగాళాఖాతం లో అదే ప్రాంతము లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అయితే ఏపీకి తుఫాన్‌ ముప్పు ఉండే అవకాశం లేదని వాతావరణ శాఖ తేల్చేసింది.

- Advertisement -

ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీకాకుళం, ఏలూరు, బాపట్ల, కాకినాడ, పల్నాడు, తిరుపతి, గుంటూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, పార్వతీపురం మన్యం, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. జోరు వానల నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తోంది. ఆదివారం నుంచి వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement