Wednesday, May 8, 2024

భారీగా పెరిగిన విమాన ఛార్జీలు

గో ఫస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ దివాళా తీయడంతో దాని సర్వీస్‌లను ఈ నెల 12 వరకు రద్దు చేసింది. 53 విమానాలు 34 ప్రాంతాలకు ఈ సంస్థ సర్వీస్‌లు నడుపుతోంది. రోజుకు 200 విమాన సర్వీస్‌లు దీని వల్ల రద్దయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఆయా రూట్లలో విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. ప్రధానంగా గో ఫస్ట్‌ సర్వీస్‌లు నిర్వహిస్తున్న రూట్స్‌లో ఈ ఛార్జీలు ఎక్కువగా పెరిగాయి. ఎన్‌సీఎల్‌టీ ముందు దివాళా పిటిషన్‌ ఉన్నందున మరికొన్ని రోజుల పాటు గో ఫస్ట్‌ విమాన సర్వీస్‌లు నడిచే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మన దేశ విమానయాన రంగంలో గో ఫస్ట్‌కు 6.9 శాతం వాటా ఉంది. ఇండిగో కంటే కొద్దిగానే వెనుకబడి ఉంది. ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఆసియా, విస్టారా ఎయిర్స్‌లైన్స్‌ విమానాలను ఆపరేట్‌ చేస్తున్నాయి.

గోఫస్ట్‌ దివాళా ప్రక్రియలో జరిగే పరిణామాలు ఏవియేషన్‌ రంగంలో కస్టమర్లకు అనుకూలంగా ఉండవని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పరిశ్రమ నుంచి గో ఫస్ట్‌ వెళ్లిపోతే రెండు సంస్థలే ప్రధానంగా ఉంటాయని పరిశ్రమ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు మార్కెట్లో ఇండిగో, ఎయిర్‌ ఇండియా రెండు సంస్థలే ప్రధానంగా ఉంటాయని చెబుతున్నారు. ఇదే జరిగితే విమాన ప్రయాణికులకు ఏమాత్రం ప్రయోజనం ఉండదని, విమాన ప్రయాణ ధరలు ఇప్పటి కంటే భారీగా పెరిగే అవకాశం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -

గో ఫస్ట్‌ విమానాలు రద్దు కావడంతో న్యూఢిల్లి-ముంబై రూట్‌లో 3వ తేదీన విమాన ఛార్జీలు 37 శాతం పెరిగాయి. అనేక రూట్స్‌లోనూ ఛార్జీలు 4-6 రెట్లు పెరిగాయి. ఈ నెల 5న ఢిల్లిd- లేహ్‌ రూట్‌లో అంతకు ముందు 4,772 రూపాయలు ఉన్న ఛార్జీ ఒక్కసారిగా 26,819 రూపాయలకు పెరిగింది. ఛండీఘర్‌- శ్రీనగర్‌ రూట్‌లోనూ అంతకు ముందు 4,047 రూపాయలు ఉన్న విమాన ఛార్జీ 24,418 రూపాయలకు చేరింది. మే 6వ తేదీన శ్రీనగర్‌- ఛండీఘర్‌ రూట్‌లో 4,745 రూపాయలు ఉన్న ఛార్జీ 26,148కి పెరిగింది.

విమానయాన సంస్థలు ఒక్కసారిగా ఇంత భారీగా ఛార్జీలు పెంచడానికి ప్రధానంగా డిమాండ్‌ పెరగడమేనని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. విమానాల్లో అక్వుపెన్సిరేటు కూడా భారీగా పెరిగింది. అన్ని విమానయాన సంస్థల్లో అక్వుపెన్సి రేటు బాగా పెరగడంతోనే విమాన ఛార్జీలు భారీగా పెరిగాయని ఎయిర్‌ ఇండియా మాజీ డైరెక్టర్‌ జితేంద్ర భార్గవ్‌ అభిప్రాయపడ్డారు. గో ఫస్ట్‌ సర్వీస్‌ల్లో టిక్కెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులను సర్దుబాటు చేసేందుకు అన్ని ఎయిర్స్‌లకు సాధ్యంకాని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. గో ఫస్ట్‌ విమానాల రద్దుతో నడుస్తున్న అన్ని సర్వీస్‌లు 90 శాతానికిపైగా ఆక్వుపెన్సితో నడుస్తున్నాయని తెలిపారు.

ప్రస్తుతానికి గోఫస్ట్‌ మే 12 వరకు సర్వీస్‌లు రద్దు చేసనప్పటికీ, ఈ తరువాత సర్వీస్‌లు నడుస్తాయన్న నమ్మకం లేదని, ఇది మరికొంత కాలం ఇలానే ఉండే అవకాశం ఉన్నందున సమీప కాలంలో విమాన ఛార్జీలు తగ్గే అవకాశం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విమానయానానికి పెరుగుతున్న డిమాండ్‌ మూలంగా ఇంధన ధరలు కూడా రాకెట్‌ కంటే వేగంగా పెరుగుతున్నాయని, దీని వల్ల ఈ భారం ప్రయాణికులపై పడుతుందని పేర్కొంటున్నారు. ఒక వేళ గో ఫస్ట్‌ తన సర్వీస్‌లను పునరుద్ధరించినప్పటికీ, ఇంధన ధరలు పెరుగుతున్నందున విమాన ఛార్జీల్లో పెద్దగా మార్పు వచ్చే అవకాశం తక్కువగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement