Sunday, May 5, 2024

అన్ బ్రేక‌బుల్: వన్డే క్రికెట్‌లో టీమిండియా క‌ప్టెన్ గా చెక్కు చెద‌ర‌ని ధోనీ రికార్డ్..

1974లో అజిత్‌ వాడేకర్‌ సారథ్యంలో భారతజట్టు తొలి వన్డే ఇంగ్లండ్‌తో ఆడింది. అజిత్‌ వాడేకర్‌ కేవలం 2మ్యాచ్‌లకే సారథిగా వ్యవహరించాడు. ఆ తర్వాత 1975 నుంచి 79వరకు వెంకటరాఘవన్‌ 7మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మధ్య కాలంలోనే 1975 నుంచి 1978 వరకు బీషన్‌సింగ్‌ బేడీ 4మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. అనంతరం 1980 నుంచి 1985వరకు 37మ్యాచ్‌లకు సునీల్‌ గవాస్కర్‌ కెప్టెన్సీ బాధ్యతలు నెరవేర్చాడు. అదేవిధంగా 1980లో గుండప్ప విశ్వనాథ్‌ ఒక మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

ఈక్రమంలో భారత వన్డేజట్టుకు 6వ కెప్టెన్‌గా 1982నుంచి 1992వరకు కపిల్‌దేవ్‌ కెప్టెన్‌గా వ్యవహరించగా కపిల్‌ సారథ్యంలో భారతజట్టు తొలిసారి 1983లో ప్రపంచ విజేతగా అవతరించింది. 1983లో ఒక మ్యాచ్‌కు సయ్యద్‌ కిర్మాణీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. మొహిందర్‌ అమర్‌నాథ్‌ కూడా 1984లో ఒక మ్యాచ్‌కు సారధ్యం వహించాడు. టీమిండియా తాజా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి 1986నుంచి 1991వరకు 11మ్యాచ్‌లకు కెప్టెన్‌గా బాధ్యతలు నెరవేర్చాడు. ఆ తర్వాత 10వ కెప్టెన్‌ దిలిప్‌ వెంగ్‌సర్కార్‌ 1987-1988వరకు 18 మ్యాచ్‌లు, శ్రీకాంత్‌ 1989లోనే 13మ్యాచ్‌లకు సారథ్యం వహించారు. హైదరాబాద్‌కు చెందిన అజహరుద్దీన్‌ 1989 నుంచి 1999వరకు అత్యధికంగా 174మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి రికార్డు నమోదు చేశాడు. అజ్జూబాయ్‌నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన సచిన్‌ టెండూల్కర్‌ 1996నుంచి 1999వరకు 73మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. సచిన్‌ తర్వాత అజయ్‌ జడేజా 1998నుంచి 1999వరకు 13మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. 15వ కెప్టెన్‌గా 1999నుంచి 2005వరకు సౌరవ్‌ గంగూలీ 146మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి టీమిండియాకు దూకుడును నేర్పాడు. సౌరవ్‌ తర్వాత మిస్టర్‌ వాల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ 2000నుంచి 2007వరకు 79మ్యాచ్‌లకు సారథ్యం వహిస్తే జంబో కుంబ్లే 2001లో ఒక మ్యాచ్‌కు మాత్రమే కెప్టెన్సీ నిర్వహించాడు. కుంబ్లే తర్వాత వీరేంద్ర సెహ్వాగ్‌ 2003 నుంచి 2011వరకు 12వన్డేలు సారథ్యం వహించాడు.

చెక్కు చెద‌ర‌ని ధోనీ రికార్డ్..

మిస్టర్‌కూల్‌ మహేంద్రసింగ్‌ ధోనీ 2007నుంచి 2018వరకు అందరికంటే అత్యధికంగా 200వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించి భారత్‌ను అన్నిఫార్మాట్లలోనూ ఛాంపియన్‌గా నిలిపాడు. 2011లో వన్డే ప్రపంచకప్‌ను భారత్‌కు అందించాడు. ఇప్పటికీ కెప్టెన్‌గా రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీ రికార్డును మరో కెప్టెన్‌ బ్రేక్‌ చేయలేదు. సురేశ్‌రైనా 2010లో 12వన్డేలకు, గౌతమ్‌ గంభీర్‌ 2010-11లో 6వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తాజా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 2013నుంచి 2021వరకు 95వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించి భారతజట్టును ప్రపంచ క్రికెట్‌లో దీటైన జట్టుగా నిలిపాడు. రహానె 2015లో 3వన్డేలకు సారథ్యం వహించాడు. టీమిండియా ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌శర్మ అంతకుముందు 2017-18లో 10మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా 2021లో శిఖర్‌ధావన్‌ 3వన్డేలకు శ్రీలంక టూర్‌కు కెప్టెన్‌గా ఆడాడు.

కాగా కోహ్లీ వైదొలిగిన తర్వాత ప్రస్తుతం పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా జట్టు పగ్గాలు స్వీకరించిన హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వెస్టిండీస్‌తో భారతజట్టు ఆడిన 1000వ వన్డేకు కెప్టెన్‌గా వ్యవహరించడంతోపాటు కెప్టెన్‌ఇన్నింగ్స్‌తో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇప్పటివరకు మొత్తం 25మంది భారత వన్డే జట్టు కెప్టెన్‌లుగా వ్యవహరించాడు. భారతజట్టు ఆడిన 100వ వన్డేకు కపిల్‌దేవ్‌ కెప్టెన్‌గా వ్యవహరించగా..500వ వన్డేకు టీమిండియా మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ…1000వ వన్డేకు కెప్టెన్‌గా రోహిత్‌శర్మ వ్యవహరించడం విశేషం. భారతజట్టు 1983, 2011లో ఐసీసీ ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా నిలిచింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement