Friday, May 3, 2024

Telangana | ఒడిశాకు టీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీసులు.. ముందుగా 10 నడపాలని నిర్ణయం

ఒడిశాకు బస్‌ సర్వీసులను నడపాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాలలో ముందుగా 10 బస్సులను నడుపనుంది. ఆ తరువాత ప్రయాణికుల రద్దీని బట్టి ఈ సర్వీసుల సంఖ్యను పెంచనుంది. ఈమేరకు ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర బస్‌ సర్వీసుల నిర్వహణపై ఒడిశా రాష్ట్ర్ర రోడ్డు రవాణా సంస్థ (ఒఎస్‌ఆర్టీసీ)తో టీఎస్‌ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ బస్‌భవన్‌లో బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ సమక్షంలో సంస్థ ఎండీ వీపీ సజ్జన్నార్‌, ఒఎస్‌ఆర్టీసీ ఎండీ దిప్తేష్‌ కుమార్‌ పట్నాయక్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం టీఎస్‌ఆర్టీసీ 10 బస్సులను ఒడిశాకు, ఒఎస్‌ఆర్టీసీ 13 సర్వీసులను తెలంగాణలో నడుపనుంది. హైదరాబాద్‌- జైపూర్‌ 2, ఖమ్మం- రాయఘడ 2, భవానిపట్న- విజయవాడ (వయా భద్రాచలం), భద్రాచలం- జైపూర్‌ 4 బస్‌ సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ నడుపనుంది. కాగా, నవరంగ్‌పూర్‌- హైదరాబాద్‌ 4, జైపూర్‌- హైదరాబాద్‌ 2, భవానిపట్న- విజయవాడ (వయా భద్రాచలం) 2, రాయఘడ- కరీంనగర్‌ 2, జైపూర్‌- భద్రాచలం 3 బస్సులను ఓఎస్‌ఆర్టీసీ నడుపనుంది.

- Advertisement -

ఈ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ మాట్లాడుతూ తెలంగాణ- ఒడిశా రాష్ట్రాల మధ్య ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారనీ, డిమాండ్‌ నేపథ్యంలో ఒఎస్‌ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించామనీ, ఆయా మార్గాలలో ఒడిశాలో 3378 కి.మీ.ల మేర నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ తీసుకువచ్చిన పలు కార్యక్రమాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఓఎస్‌ ఆర్టీసీ అధికారులకు వివరించారు. ఒఎస్‌ఆర్టీసీ ఎండీ దిప్తేష్‌ గుప్తా మాట్లాడుతూ టీఎస్‌ ఆర్టీసీ ప్రయాణికులకు కల్పిస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.

తమ రాష్ట్రంలోనూ వాటిని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ ఒప్పందం ప్రకారం 13 బస్‌ సర్వీసులతో తెలంగాణలో 2896 కి.మీ. మేర నడుపుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సీవోవో డా.వి.రవీందర్‌, జేడీ సంగ్రామ్‌సింగ్‌ జి. పాటిల్‌, ఈడీలు మునిశేఖర్‌, వినోద్‌కుమార్‌, సీటీఎంజీవన్‌ప్రసాద్‌, సీఎంఈ రఘునాథరావు, చీఫ్‌ మేనేజర్‌ (ఫైనాన్స్‌) విజయపుష్పతో పాటు ఒఎస్‌ఆర్టీసీ ఓఎస్డీ దీప్తి మహాపాత్రో, ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానర్‌ సందీప్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement