Monday, May 20, 2024

TS | బీజేపీకి ఓటు రిజర్వేషన్ల పై వేటు : రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : నా బలం.. బలగం… బంధువులు.. పార్టీ ఈ సీఎం కుర్చీ మీదే… ఆఖరి రక్తపు బోట్టు వరకు మీ సేవకుడిగా ఉంటాను.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మన ఓటు మన అత్మ గౌరవం నిలబెడదాం…,నేనే మీరు…మీరే నేను అని వ్యాఖ్యానించారు. బీజేపీకి పడే ప్రతి ఓటు రాజ్యాంగం, రిజర్వేషన్లపై వేటు.., అనీ, బీజేపీ గెలిస్తే మత పంచాయితీలే అని హెచ్చరించారు.

దేశంలో ప్రమాదం పొంచి ఉందనీ, ప్రజలంతా ఏకమై ప్రమాదం నుంచి బయట పడేందుకు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని కోరారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని మక్తల్‌ పట్టణంలో జరిగిన జనజాతర ఎన్నికల ప్రచార సభలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌ రెడ్డితో పాటు ఎమ్మెల్యే శ్రీహరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం భావోద్వేగంతో సాగింది.

నేను పాలమూరు బిడ్డననీ, ముఖ్యమంత్రిగా మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని , చివరి రక్తపు బొట్టువరకు సేవకుడిగా ఉంటానని వ్యాఖ్యానించారు. ఇంట గెలిచి రచ్చగెలవాలని అంటారనీ,ఈ విధంగా ఈ రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. చల్లా వంశీచంద్ మీ వృక్షాన్ని నరకాలనుకుంటున్నారు… ముఖ్యమంత్రిగా వృక్షంగా ఎదిగిన మీ బిడ్డను నరకాలని అనుకుంటున్నారు.

ఢిల్లీ నుంచి నారాయణపేటకు వచ్చారు. జడ్పీటీసీగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒక సారి ఎంపీగా గెలిపించారు. ఇంటి ముందు ఎదిగిన వృక్షాన్ని కూల్చటానికి జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పాలమూరు అనే తులసి వనాన్ని చెడగొట్టాలనుకున్న గంజాయి వనానికి బుద్ది చెప్పాలని కోరారు.

ఉత్తరప్రదేశ్‌కు పెట్టుబడులు ఎందుకు రావడంలేదో ఆలోచించండి..,

- Advertisement -

రాష్ట్రం ప్రశాంతంగా ఉందనీ, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే పొద్దున లేస్తే ప్రతిరోజూ పంచాయితీలేనని హెచ్చరించారు. తెలంగాణలో ప్రశాంత పరిస్థితులు ఉన్నందుకే పెద్దయెత్తున పెట్టుబడులు వస్తున్నాయనీ, పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. ఢిల్లీ నుంచి అర్ధ గంటలో ఉత్తరప్రదేశ్‌ కు వెళ్ల వచ్చనీ, అయినా. అక్కడ ప్రశాంత పరిస్థితులు లేనందున పెట్టుబడులు, పరిశ్రమలు రావడంలేదని హెచ్చరించారు. అక్కడ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌ సింగ్‌, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉన్నప్పటికీ పెట్టుబడులు రావటం లేదన్నారు.

రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుంది జాగ్రత్త …

బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రద్దు చేస్తుందని హెచ్చరించారు. అందుకే పార్లమెంట్‌ ఎన్నికల్లో 400 సీట్లలో గెలిపించాలని ఆ పార్టీ కోరుతోందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ రిజర్వేషన్లు ఉండాలంటే , రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకుంటే కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బీజేపీకి ఓటు వేస్తే వాటిపై వేటు పడుతుందని హెచ్చరించారు. అంతేకాదు, కులాలు,మతాల మధ్య చిచ్చుపెట్టి అభివృద్ధిని ఆగం చేస్తుందని విమర్శించారు. బీజేపీకి ఓటు వేస్తే రాష్ట్రం వందేళ్లు వెనక్కుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ చీకటి దోస్తులు …

బీజేపీ,బీఆర్‌ఎస్‌ పార్టీలు వేర్వేరు కాదనీ, రెండు కూడా చీకటి దోస్తులని చెప్పారు. ఈ రెండు పార్టీలు పగలు తిట్టుకుంటాయి కానీ, ఒక్కదగ్గర కలుస్తారని ఆరోపించారు. గడచిన పదేళ్లు రాష్ట్రాన్ని పట్టి పీడించిన పిశాచాన్ని సీసాలో వేసి ప్రజలు బంధించారని, కేంద్రంలో కూడా బీజేపీని ఓడించాలని విజ్ఞప్తి చేశారు.

మీ సమస్యల కోసం కొట్లాడేటోడు వంశీచంద్‌ రెడ్డి

వంశీచంద్‌ రెడ్డిని ఎందుకు గెలిపించాలో రేవంత్‌ రెడ్డి విశ్లేషించారు. కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యుసీ ) సభ్యుడిగా రేవంత్‌ రెడ్డి ఉన్నారనీ, మీ సమస్యల కోసం కేంద్రంతో కొట్లాడుతారనీ, పరిష్కరిస్తారని, తన వద్దకు సమస్యలు తెస్తారని అందుకే వంశీచంద్‌ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. తన జీవితాన్నే కాంగ్రెస్‌ పార్టీ కోసం అంకితం చేసిన వ్యక్తిగా వంశీచంద్‌ను అభివర్ణించారు. ఈ ప్రాంతం అభివృద్ది చెందాలన్నా, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలన్నా, ముదిరాజ్‌ లను బీసీ డీ నుంచి బీసీ ఎ గ్రూప్‌లోకి మార్చేందుకు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని కోరారు.

డీకే ఆరుణకు పార్టీ ఏం అన్యాయం చేసింది..

బీజేపీ అభ్యర్థిగా ఉన్న డీకే అరుణమ్మ అందరికీ తెలిసిన నాయకురాలు కావచ్చు…,బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఈ ప్రాంతానికి ఏమిచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆమెకు ఏం అన్యాయం చేసిందని ప్ర శ్నించారు. ఈ రోజు ఆమెను గుర్తుపడుతున్నారంటే అందుకు కాంగ్రెస్‌ పార్టీయే కారణమనీ, అలాంటి పార్టీని పొడుస్తా అని డీకే అరుణ అంటున్నారని రేవంత్‌ రెడ్డి మండి పడ్డారు.

జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా రాజకీయంగా ఎదగడానికి కాంగ్రెస్‌ పార్టీ తోడ్పడిందనీ, అలాంటి పార్టీని ఓడించేందుకు కంకణం కట్టుకుందని విమర్శించారు. మక్తల్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు పగులు తిట్టుకున్నా రాత్రి మాట్లాడుకుంటారని విమర్శించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పదవిని తెచ్చుకున్న డీకే అరుణ మన జిల్లాకు ఏమైనా చేసిందా ? పాలమూరు -రంగారెడ్డికి జాతీయ హోదా తెచ్చిందా ? అని ప్రశ్నలు కురిపించారు.

పార్టీ జెండా మోసే వారికే పదవులు..

పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ,జడ్పీటీసీ మండల, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయనీ , ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడే వారికే పదవులు వస్తాయని రేవంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. మక్తల్‌ నియోజకవర్గంలో కష్టపడే వారికి, పార్టీ జెండా మోసే వారికే అవకాశాలు ఇవ్వాలని అప్పటికప్పుడు ఎమ్మెల్యేల శ్రీహరికి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement