Sunday, April 28, 2024

TS – వేముల‌వాడలో మ‌హాశివ‌రాత్రి – ఏర్పాట్ల‌పై మంత్రి పొన్నం స‌మీక్ష‌..

వేములవాడ – మహాశివరాత్రిని ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర బీసీ&రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ .
వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయం ఓపెన్ స్లాబ్ లో నిర్వహించిన మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లతో కలిసి మంత్రి పాల్గొన్నారు.


మార్చి 7 నుంచి మార్చి 9 వరకు 3 రోజుల పాటు మహా శివరాత్రి వేడుకలను అత్యంత వైభవోపేతంగా వేములవాడలో నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను మంత్రి శాఖల వారీగా రివ్యూ నిర్వహించారు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా జాతర నిర్వహించాల్సి ఉంటుందని, నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్ధమయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.


ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ క్షేత్రంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మికంగా, దైవికంగా నిబంధనలు పాటిస్తూ, ఎక్కడ ఎలాంటి లోపాలు జరగకుండా నిర్వహించాలని సూచించారు.


పండుగ మూడు రోజులు వేములవాడకు ఎక్కువ బస్సు సర్వీసులు నడపాలని, మహాలక్ష్మి పథకం నేపథ్యంలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉందందున అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తుల రద్దీ ఆధారంగా డిపో మేనేజర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అవసరమైన రోడ్లలో అదనపు సర్వీసులు నడపాలని మంత్రి సూచించారు.
ఈ మూడు రోజులు గతంలో అందించే ప్రత్యేక పాసులను పూర్తిస్థాయిలో రద్దు చేస్తున్నామని, వాటి స్థానంలో ప్రత్యేక దర్శనానికి రూ.300 టికెట్ ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మహాశివరాత్రి జాతరను కట్టుదిట్టంగా పని చేసే విజయవంతంగా నిర్వహించాలని, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడే విధంగా వేములవాడ పట్టణాన్ని సన్నద్ధం చేయాలని అన్నారు.వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని, ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రత దుర్వాసన ఉండకుండా చర్యలు తీసుకోవాలని, జాతర సమయంలో కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ మంత్రి , ప్రభుత్వ విప్ అందించిన సూచనలు పాటిస్తూ అధికారులు వివిధ శాఖల మధ్య ఉన్న చిన్న సమన్వయ లోపాలను పరిష్కరించుకొని పకడ్బందీగా జాతర నిర్వహించేందుకు కృషి చేయాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement