Monday, April 15, 2024

Exclusive – చికెన్​ @300..ఎపి,తెలంగాణాల‌లో భారీగా పెరిగిన ధ‌ర‌లు

ఒక‌ప్పుడు మాంసాహారం ఏ పండ‌గ‌కో.. ఫంక్ష‌న్‌కో వండేవాళ్లు. కానీ ఇప్పుడు ముక్క లేనిదే ముద్ద దిగ‌ని ప‌రిస్థితి. మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్లు వారానికి ఒక‌సారి నాన్ వెజ్ తెచ్చుకుంటుంటే.. ఉన్న‌త వ‌ర్గాల వారి ఇంట్లో రోజూ చికెనో.. మ‌ట‌నో ఉండాల్సిందే.. అలాంటి చికెన్ ధ‌ర‌లు ప్ర‌స్తుతం కొండెక్కి కూర్చున్నాయి. ఎంత‌లా అంటే ఉన్న‌ట్లు ఉండే రేటు డ‌బుల్ అయ్యింది. ఏకంగా కిలో ధ‌ర రూ.300 అయ్యింది.

ఎపి, తెలంగాణాల‌లో…
ఎపి తెలంగాణ రాష్ట్రాల‌లో చికెన్‌ ధరలు భారీగా పెరిగాయి. గత వారం వరకు కిలో చికెన్‌ రేటు 250-280 రూపాయల మధ్య ఉండగా.. ఇప్పుడు మరింత పెరిగి కిలో ఏకంగా 300 రూపాయలు పలుకుతుంది. పైగా మరో రెండు నెలల వరకు ఇదే పరిస్థితి ఉంటుంద‌ని వ్యాపారులు అంటున్నారు . మరి చికెన్‌ ధర ఇంతలా పెరగడానికి కారణం ఏంటి అంటే.. మండుతున్న ఎండలు. వాతావరణంలో మార్పు కారణంగా కోళ్ల ఉత్పత్తి బాగా తగ్గిపోయిందని.. మార్చి, ఏప్రిల్‌ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. కాస్త ఊరట కలిగించే అంశం ఏంటంటే.. మొన్నటి వరకు 7 రూపాయలు పలికిన గుడ్డు రేటు.. ఇప్పుడు రూ.5కు దిగి వచ్చింది. ఇక తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఫిబ్రవరి 10 వరకు స్కిన్‌లెస్ చికెన్ ధర కిలోకు రూ.180 నుంచి రూ.200, లైవ్‌ కోడి ధర రూ.120 నుంచి రూ.160 దాకా పలికింది. ఇటీవల పెరిగిన ఎండలతోపాటు మేడారం మహాజాతర నేపథ్యంలో కోళ్ల దిగుమతి భారీగా తగ్గింది. ఈనేపథ్యంలో ఒక్కసారిగా చికెన్‌కు డిమాండ్‌ పెరగడంతో ధరలు కూడా పెరిగిపోయాయి. కిలో లైవ్‌ కోడి ధర కూడా రూ.180 వరకు పలుకుతుండడంతో కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. నాటుకోడి ధర రూ.380 నుంచి రూ.450 ఉండడంతో చాలామంది దానిఊసే ఎత్తడం లేదు.

త‌గ్గిన ఉత్ప‌త్తి..
కార్తీక మాసం సమయంలో చికెన్‌ ధర భారీగానే దిగి వచ్చింది. నెల రోజుల క్రితం వరకు కూడా కిలో చికెన్‌ రేటు రూ.200 లోపే ఉంది. ఇక కార్తీకమాసం సమయంలో అయితే కిలో చికెన్‌ రూ.130-140 కే అమ్మాల్సి వచ్చింది. దాంతో చాలా మంది కోళ్ల ఫారాల యజమానులు భారీగా నష్టపోయారు. ఈ భయంతో కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. తల్లికోళ్లను కూడా గిట్టుబాటు కాక తక్కువ ధరకే అమ్మేశారు. అప్పటి ఫలితం ఇప్పుడు కనిపిస్తుంది. కోళ్ల పెంపంక తగ్గించడంతో.. ఇప్పుడు వాటి ఉత్పత్తి తగ్గి.. కొరత ఏర్పడింది. దాంతో కోడి ధర కొండెక్కి కూర్చుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కిలో చికెన్‌ రేటు రూ.300 పలుకుతుంది. బోన్ లెస్ చికెన్ ధర రికార్డు స్థాయిలో కిలోకు రూ.500కుపైనే ఉంది. ఆదివారం వస్తే ఈ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

గ‌ణ‌నీయంగా ప‌డిపోయిన అమ్మ‌కాలు
ధరలు భారీగా పెరగడంతో హైదరాబాద్‌లో చికెన్‌ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. సాధారణ రోజులతో పోలిస్తే నాలుగు రోజులుగా 40 శాతం సేల్స్ పడిపోయాయి. సాధారణంగా ఆదివారం, సెలవు రోజుల్లో సగటున 12 వేల టన్నుల వరకు చికెన్‌ విక్రయాలు జరుగుతాయి. పెరిగిన ధరల కారణంగా ఆదివారం రోజు హైదరాబాద్‌ నగరంలోని హోల్‌సేల్‌, రిటైల్‌ దుకాణాల్లో కలిపి 6వేల టన్నుల వరకే చికెన్ సేల్స్ జరిగాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోజూ సుమారు 10వేల టన్నుల చికెన్‌ను విక్రయిస్తుంటారని అంచనా. దసరా, దీపావళి, సంక్రాంతి, రంజాన్‌ పండుగల సమయంలో రోజుకు 15 వేల నుంచి 16 వేల టన్నులు అమ్ముతుంటారు. హైదరాబాద్‌లోని చాలా చికెన్‌ సెంటర్లలో ప్రస్తుతం జనవరి చివరి వారం, ఫిబ్రవరి మొదటివారంలో కొనుగోలు చేసిన కోడి పిల్లలే ఉన్నాయి. డిమాండ్‌ ఉన్నందున వాటికే రేట్లు పెంచి అమ్ముతున్నారు.

పెరిగిన ర‌వాణా, దాణా ఖ‌ర్చులు
వాతావరణంలో మార్పుల కారణంగా కోడిపిల్లలు చనిపోతాయని, చికెన్ ధరలు పెరగడానికి ఇదొక కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాక కోళ్ల దాణా, రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగాయని.. ఇవి కూడా రేట్లు పెరగడానికి కారణమంటున్నారు. ఏటా మహాశివరాత్రి పర్వదినం తర్వాత మొదలు కావాల్సిన ఎండలు.. ఈసారి ఫిబ్రవరి రెండోవారం నుంచే ప్రారంభం కావడంతో వేడికి కోళ్లు చనిపోతున్నాయి. ఏపీలో ఎండల ధాటికి కోళ్లు చనిపోతుండడంతో అక్కడి వ్యాపారులు హైదరాబాద్‌, శంషాబాద్‌, షాద్‌నగర్‌, మహబూబ్‌నగర్‌, తదితర ప్రాంతాల్లోని పౌల్ట్రీ ఫారాల నుంచి కోళ్లను ఎగుమతి చేసుకుంటున్నారు. దీంతో హైదరాబాద్‌లో కోళ్ల కొరత ఏర్పడుతోంది. అంతేకాక ప్రతి ఏటా వేసవిలో చికెన్‌, మటన్ ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం ఇదే కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక తెలంగాణలో మటన్ ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. హైదరాబాద్‌తో సహా పలు జిల్లా కేంద్రాల్లో కిలో మటన్ రూ.1000 చొప్పున అమ్ముతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement