Saturday, May 11, 2024

తూచ్ తూచ్‌, రాజీనామా చేయ‌ట్లేదన్న దివ్య‌వాణి.. అర్జంటుగా ట్వీట్ డిలీట్‌

తెలుగుదేశం పార్టీకి దివ్యవాణి రాజీనామా వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. మహానాడు తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దివ్యవాణి.. తనకు అవమానం జరిగిందని ఆరోపించారు. పార్టీ తీరుపై సంచలన కామెంట్ చేశారు. తాజాగా నేడు ఆమె ట్విట్టర్ అకౌంట్‌లో రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో పార్టీపై అసంతృప్తితో ఉన్న దివ్యవాణి.. రాజీనామా చేసినట్టుగా చాలా మంది భావించారు. అయితే కొద్దిసేపటికే దివ్యవాణి ఆ ట్వీట్ డిలీట్ చేశారు. దీంతో ఆమె రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పార్టీకి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారా..?, లేక పార్టీలోనే కొనసాగుతున్నారా..? అనేది టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలోనే దివ్యవాణి టీడీపీని వీడటం లేదని కొన్ని మీడియా సంస్థలకు తెలియజేసినట్టుగా సమాచారం. పార్టీలో ఎదురవుతున్న ఇబ్బందులను అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నట్టుగా చెప్పారు. కాసేపట్లోనే దివ్యవాణి మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ సమావేశంలో గత కొద్ది గంటలుగా చోటుచేసుకున్న పరిణామాలపై ఆమె క్లారిటే ఇచ్చే అవకాశం ఉంది.

రాజీనామా ప్రకటన వెనక అదే కారణమా..?
దివ్యవాణి ట్విట్టర్‌లో రాజీనామా చేస్తున్నట్టుగా పోస్టు చేయడానికి ఓ ఫేక్ మెసేజ్ కారణంగా తెలుస్తోంది. టీడీపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేరుతో దివ్యవాణిని సస్పెండ్ చేసినట్టుగా ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చక్కర్లు కొట్టింది. ఆ పోస్టు చూసి.. దాని ఆధారంగానే రాజీనామా చేస్తున్నట్టుగా పోస్టు చేశానని దివ్యవాణి చెబుతున్నట్టుగా తెలుస్తోంది.

అయితే టీడీపీ వర్గాలు మాత్రం తాము దివ్యవాణిని సస్పెడ్ చేయలేదని చెబుతున్నాయి. గతంలో కూడా కొందరు పార్టీ పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు పెట్టారని గుర్తుచేసింది. పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని పార్టీ సస్పెండ్ చేసినట్టుగా కూడా గతంలో తప్పుడు పోస్టులు చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

దివ్యవాణి ట్విట్టర్ పోస్టులో ఏం చెప్పారంటే..
టీడీపీలో కొన్ని దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్టుగా దివ్యవాణి చెప్పారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా చెప్పారు. ఇక, దివ్యవాణి 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు టీడీపీలో చేరారు. టీడీపీ‌లో యాక్టివ్‌గా ఉంటున్న దివ్యవాణి.. ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడుతుంటారు. టీడీపీపై వైసీపీ మహిళా నేతలు చేసే వ్యాఖ్యలపై ఆమె ఎదురుదాడి చేస్తుంటారు. టీడీపీ కార్యక్రమాల్లో కూడా ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఇటీవల ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కూడా ఆమె నివాళులర్పించారు. ఆ సమయంలో కూడా టీడీపీ గురించి ఆమె గొప్పగా మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement