Thursday, May 2, 2024

నాడు రెండొచ్చేవి, నేడు ఒక్కటే వస్తోంది.. గ్యాస్‌ ధరల పెంపుపై రాహుల్‌ సెటైర్..

ప్ర‌భ‌న్యూస్ : వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరల పెంపుపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోమారు ప్రధాని మోడీ సర్కార్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్‌ హయాంతో పోలిస్తే… ప్రస్తుతం వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలు రెండింతలయ్యాయని విమర్శించారు. ఈ మేరకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలను, ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వ పాలనలో ధరలతో పోల్చి చూపిస్తూ రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు. 2014లో 14.2 కేజీల ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.410 ఉండేది. ప్రస్తుతం రూ.999కి చేరింది… అంటే సుమారు రూ.585 పెరిగిందని రాహుల్‌గాంధీ వివరించారు. ఇప్పుడున్న ధరతో తమ హయాంలో గ్యాస్‌ సిలిండర్లు రెండు వచ్చేవని, ఇప్పుడు మాత్రం ఒక్కటే వస్తున్నదని పేర్కొన్నారు.

నాడు యూపీఏ ప్రభుత్వం ఒక్కొక్క సిలిండర్‌పై రూ.827 రాయితీ ఇచ్చిందని రాహుల్‌గాంధీ గుర్తుచేశారు. ప్రస్తుతం నరేంద్రమోడీ ప్రభుత్వం గ్యాస్‌ రాయితీ ఇవ్వడం లేదన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలించే సత్తా కేవలం కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement