Tuesday, April 30, 2024

ODI World Cup | దాయాదుల సమరానికి సై.. నేడే భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌

అహ్మదాబాద్‌: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2023లో అసలుసిసలైన సమరానికి సమయం ఆసన్నమైంది. క్రికెట్‌ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న దాయాదుల పోరు భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ నేడు (శనివారం) అహ్మదాబాద్‌లో జరగనుంది. వరల్డ్‌కప్‌ ఆరంభమై దాదాపు 10 రోజులు అవుతుంది కానీ అసలుసిసలైన హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ మాత్రం ఈరోజు నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదలు కానుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో ఇరుజట్లు శుభారంభం చేశాయి. టీమిండియా వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరును ప్రదర్శించగా.. పాక్‌ కూడా రెండు విజయాలనుందుకుని దూకుడుగా ముందుకు సాగుతోంది.

అయితే ఈసారి కూడా దాయాదుల పోరులో టీమిండియా హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. పాక్‌తో పోలిస్తే అన్ని విభాగాల్లో రోహిత్‌ సేన ముందు వరుసలోనే ఉంది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, గిల్‌, ఇషాన్‌ కిషన్‌లతో కూడిన టాప్‌ క్లాస్‌ బ్యాటర్లతో భారత్‌ పటిష్టంగా ఉంది. ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌లు కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు.

- Advertisement -

జస్ప్రీత్‌ బుమ్రా నేతృత్వంలోని మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమీలతో కూడిన పేస్‌ దళం పదునైన బంతులతో ప్రత్యర్థి జట్లను హడలెత్తించగలరు. స్పిన్‌లోనూ చైనామన్‌ కుల్దిప్‌ యాదవ్‌కి మంచి రికార్డులు ఉన్నాయి. మొత్తంగా టీమిండియా హ్యాట్రిక్‌ విజయంపై గురిపెట్టింది. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో పాక్‌పై భారత్‌కు అజేయ రికార్డు ఉంది. ప్రపంచకప్‌ సమరాల్లో భారత్‌, పాకిస్తాన్‌లు ఇప్పటివరకు మొత్తం 7 సార్లు తలపడ్డారు. ఆ 7 సార్లు కూడా టీమిండియా దాయాదిపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించి జయకేతనం ఎగరేసింది. ఈసారి ఆ ఆధిక్యాన్ని 8-0కు పెంచుకోవాలని రోహిత్‌ సేన ఆతృతగా ఉంది.

రోహిత్‌, కోహ్లీలపై భారం..

దాయాదుల పోరులో భారత సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలపై అధిక భారం ఉంటుంది. వీరిద్దరి అనుభవం టీమిండియాకు కలిసి రానుంది. వీరిద్దరూ పిచ్‌పై నిలబడితే పరుగుల వరద పారడం ఖాయం. సొంత అభిమానుల మధ్య చిరకాల ప్రత్యర్థితో తలపడటం… అందులో పాక్‌పై టీమిండియాకు ఉన్న మంచి రికార్డును కొనసాగించడం ఒత్తిడితో కూడిన పనే. కానీ ఈ ప్రపంచ అగ్రశ్రేణి క్రికెటర్లకు ఒత్తిడిని జయించడం తెలుసు. పాక్‌పై మంచి రికార్డు ఉంది. 2019 ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 113 బంతుల్లోనే 140 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ (77), అంతకుముందు 2015 వరల్డ్‌కప్‌లో (107) శతకంతో మెరిసాడు. మొత్తంగా పటిష్టమైన బౌలింగ్‌ లైనప్‌ కలిగిన పాక్‌పై వీరిద్దరూ అద్భుతంగా రాణించారు. ఈసారి కూడా వీరు బ్యాట్‌ ఝుళిపిస్తే టీమిండియా భారీ పరుగులు చేయడం ఖాయం.

యువ బ్యాటర్లకు పరీక్ష..

భారత యువ బ్యాటర్లకు ఈ మ్యాచ్‌ ఓ పరీక్షగా మారనుంది. ప్రపంచ అగ్రశ్రేణి పేసర్లతో పాక్‌ బౌలింగ్‌ విభాగం పటిష్టంగా ఉంది. భారత్‌, పాక్‌ మ్యాచ్‌ అంటే ఆరంభానికి ముందే ఆటగాళ్లలో ఒత్తిడి మొదలైపోతుంది. ఇప్పుడు ఆ ఒత్తిడిని జయించి ముందుకు వెళ్లడం యువ బ్యాటర్ల ముందున్న లక్ష్యం. అయితే శుభ్‌మాన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లకు ప్రపంచకప్‌లు ఆడిన అనుభవం పెద్దగా లేకున్నా అంతర్జాతీయ టోర్నీల్లో మాత్రం వీరు అద్భుతంగా రాణిస్తున్నారు. అవకాశం లభించిన ప్రతిసారి చెలరేగి ఆడుతూ టీమిండియా విజయాల్లో పాలుపంచుకుంటున్నారు. ఇప్పుడు పాక్‌తో హై ఓల్టేజ్‌ మ్యాచ్‌లోను వీరందరూ సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యారు.

షమీకి అవకాశం ఇవ్వాలి..

గత రెండు మ్యాచులలో బెంచ్‌కే పరిమితమైన భారత స్టార్‌, సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీని పాక్‌ మ్యాచ్‌లో తప్పనిసరిగా ఆడించాలని మాజీలు అభిప్రాయపడుతున్నారు. మెగా టోర్నీలో అనుభవం గల బౌలర్లను పక్కనపెట్టడంపై కెప్టెన్‌, మేనేజ్‌మెంట్‌పై అందరూ మండిపడుతున్నారు. ఒంటి చేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా షమీకి ఉందని, ఇప్పుడైనా కీలకమైన పాక్‌ మ్యాచ్‌లో అతన్ని ఆడించాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇక బుమ్రా విషయానికి వస్తే అఎn్గానిస్తాన్‌ మ్యాచ్‌లో 4 వికెట్లతో చెలరేగాడు.

పాక్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను తన పదునైన బంతులతో ఈజీగా పడగొట్టగలడు. మరోవైపు సిరాజ్‌ ప్రపంచకప్‌లో తన సత్తా చాటుకోలేకపోతున్నాడు. దాయాదుల పోరులోనైనా అతను మళ్లిd పుంజుకోవాలని కోరుకుందాం. స్పిన్నర్లు జడేజా, కుల్దిdప్‌ యాదవ్‌లు మంచి ఫామ్‌లో ఉండటం టీమిండియాకు శుభసూచికం. రానున్న మ్యాచ్‌లలో కూడా వీరు తమ జోరును కొనసాగించాలి. మొత్తంగా భారత జట్టు పూర్తి స్థాయి ప్రదర్శన చేస్తే ఈ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌తో పాటు ఓవరాల్‌గా పాక్‌పై 8వ విజయాన్ని అందుకోవడం ఖాయం.

ఒత్తిడి లేదు: పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌

భారత్‌తో మ్యాచ్‌కి మాకు ఎలాంటి ఒత్తిడి లేదని పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ పేర్కొన్నాడు. భారీ జనసందోహం నడుమ జరిగే అహ్మదాబాద్‌ మ్యాచ్‌కి మేము పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నాం. అత్యుత్తమ ప్రదర్శన చేయడమే మా ముందున్న పెద్ద లక్ష్యం. గతంలో ఏం జరిగింది.. దాని గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. ప్రస్తుత పరిస్థితులను ఎంజాయ్‌ చేస్తూ మ్యాచ్‌లు ఆడుకుంటూ పోతాం. చాలా కాలం తర్వాత భారత గడ్డలో అడుగుపెట్టిన మాకు ఇక్కడ మంచి ఆతిథ్యం లభించింది. ఇక్కడి ప్రజలు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు.

ఇక భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అంటే చాలు ప్రపంచ దృష్టంతా ఈ రెండు జట్లపైనే ఉంటుంది. ప్రస్తుతం భారత జట్టు పటిష్టంగా ఉంది. వారిని ఎదుర్కొనేందుకు మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. నసీం షా లేని లోటు ఈ ప్రపంచకప్‌లో కనిపిస్తోంది. కానీ షహీన్‌ షా అఫ్రిదీ ఉత్తమ బౌలర్‌. అతను టీమిండియాను కట్టడి చేయగలడన్న నమ్మకం మాకు ఉంది. మహ్మద్‌ రిజ్వాన్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అబ్దుల్లా షఫీక్‌ ప్రపంచకప్‌ అరంగేట్రం మ్యాచ్‌లోనే శతకం సాధించడం ఆనందంగా ఉంది. ఇమామ్‌తో పాటు నేను కూడా ఎక్కువ స్కోరు చేసేందుకు ప్రయత్నిస్తాం. ఈ ప్రపంచకప్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లను కూడా గెలిచాం. శ్రీలంకపై గెలవడం మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. అదే జోష్‌తో బరిలోకి దిగుతామని బాబర్‌ పేర్కొన్నాడు.

జట్ల వివరాలు:

భారత్‌ (అంచనా): రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌/శుభ్‌మాన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌/మహ్మద్‌ షమీ, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్దిdప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌.
పాకిస్తాన్‌ (అంచనా): అబ్దుల్లా షఫీక్‌, ఇమామ్‌ ఉల్‌ హక్‌, బాబర్‌ ఆజమ్‌ (కెప్టెన్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ (వికెట్‌ కీపర్‌, సౌద్‌ షకీల్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, షాదాబ్‌ ఖాన్‌, మహ్మద్‌ నవాజ్‌, షహీన్‌ షా అఫ్రిది, హసన్‌ అలీ/మహ్మద్‌ వసీం, హారిస్‌ రవూఫ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement