Sunday, May 5, 2024

ది కేర‌ళ స్టోరీ చిత్ర‌బృందానికి బెదిరింపులు.. పోలీసుల‌కి ఫిర్యాదు

ది కేర‌ళ స్టోరీ సినిమాలోని నటీనటులకు, చిత్ర‌బృందానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈ మేరకు ఆ సినిమా దర్శకుడు సుదీప్తో సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీరు చేసింది ఏమంత మంచి పని కాదని, కాబట్టి ఇంటి నుంచి ఒంటరిగా బయటకు వెళ్లే సాహసం చేయొద్దని హెచ్చరికలు వస్తున్నట్టు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారికి భద్రత కల్పించారు. అయితే ఈ విషయమై లిఖితపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.
వివాహం తర్వాత ఇస్లాంలోకి మారిన ముగ్గురు యువతులు ఆ తర్వాత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) వలలో చిక్కుకుని ఎలాంటి పరిస్థితులు అనుభవించారన్నదే ఈ సినిమా క‌థ‌.

సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విముల్ అమృత్‌లాల్ షా నిర్మించారు. ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకించిన కేరళ సీఎం పినరయి విజయన్.. దీనిని ఆర్ఆర్ఎస్ ప్రచారంగా అభివర్ణించారు. అదా శర్మ, యోగితా బిహాని, సిద్ధి ఇదాని, సోనియా బలాని ముఖ్య పాత్రలు పోషించారు. కేరళకు చెందిన 32 వేల మంది మహిళలు ఐఎస్‌లో చేరినట్టు చూపిస్తూ ట్రైలర్ విడుదల చేసిన తర్వాత సినిమాపై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో వెనక్కి తగ్గిన చిత్ర బృందం 32 వేల మందిని అని కాకుండా ముగ్గురు మహిళలు అని మార్చింది. ‘ది కేరళ స్టోరీ’కి బీజేపీ పాలిత ప్రాంతమైన మధ్యప్రదేశ్‌లో టాక్స్ మినహాయింపు లభించింది.వివాదాల నడుమ దేశవ్యాప్తంగా విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ సినిమా సంచలనం సృష్టిస్తోంది. సినిమాను నిషేధించాలన్న నిరసనల మధ్యే విడుదలైన ఈ సినిమా అనూహ్య వసూళ్లు సాధిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement