Friday, March 15, 2024

రాష్ట్ర ప్రభుత్వమే సహకరించడం లేదు.. ఎంఎంటీఎస్ విస్తరణపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రైల్వే రంగంలో తెలుగు రాష్ట్రాలకు రికార్డు స్థాయి కేటాయింపులు జరిపినట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. శుక్రవారం రైల్ భవన్‌లో తెలుగు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, తెలంగాణలో ఎంఎంటీఎస్ విస్తరణ పనులకు తాము ఈ బడ్జెట్‌లో రూ. 600 కోట్లు కేటాయించామని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచే సరైన సహకారం అందడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేసినంత మాత్రాన నిజాలు మారిపోవని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ప్రాజెక్టులకు రూ. 4,418 కోట్లు కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. 2009-2014 మధ్యకాలంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన మొత్తం కేటాయింపులు కేవలం రూ.886 కోట్లు మాత్రమేనని, కానీ తాము తెలంగాణకు ఒక్క ఏడాదికే ఇంత పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిపామని వెల్లడించారు. తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు నిధులు కేటాయించిందని అన్నారు.

డబ్లింగ్, ట్రిప్లింగ్ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా ఇందులో ఉన్నాయని, అలాగే చాలా చోట్ల రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ)లు, రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)లు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, మోడల్ రైల్వే స్టేషన్లు వంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్ పేరుతో జియో ట్యాగింగ్ చేసిన వస్తువులతో పాటు రోజువారీ వస్తువులు రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014లో పొందుపర్చిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి కేంద్ర మంత్రిని ప్రశ్నించగా.. చట్టంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఉందని, ఆ మేరకు పరిశీలించి ప్రత్యామ్నాయంగా రైల్వే ఓవర్హాలింగ్ ఫ్యాక్టరీని మంజూరు చేశామని వివరించారు. త్వరలోనే టెండర్లను పిలిచి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

- Advertisement -

రానున్నది ‘వందే’ యుగం

మరోవైపు వందే భారత్ రైళ్ల తరహాలో ‘వందే మెట్రో’ రైళ్లు రాబోతున్నాయని కేంద్ర మంత్రి వివరించారు. 60-70 కి.మీ దూరం కల్గిన రెండు పట్టణాలు లేదా నగరాల మధ్య వేగవంతమైన రాకపోకలు సాగించేలా ఈ వందే మెట్రో రైళ్లు ఉంటాయని తెలిపారు. వందే భారత్‌కు భిన్నంగా వందే మెట్రో వ్యవస్థ ఉంటుందని, యూరప్ దేశాల్లో ఎక్కువ దూరం లేని రెండు నగరాల మధ్య వేగవంతమైన రాకపోకలకు ఈ తరహా వ్యవస్థ అందుబాటులో ఉందని తెలిపారు. తాను ఈ మధ్య యూరప్ దేశాల్లో పర్యటించినప్పుడు ఇలాంటి రైళ్లలో ప్రయాణించానని, వందే భారత్ రైళ్లు వాటి కంటే ఏమాత్రం తీసిపోవని, ఇంకా చెప్పాలంటే మరింత మెరుగ్గా ఉన్నాయని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్-విశాఖపట్నం నగరాల మధ్య పరుగులు తీస్తున్న వందే భారత్ రైలుకు మంచి స్పందన కనిపిస్తోందని, ప్రతిరోజూ అన్ని సీట్లూ నిండుతున్నాయని తెలిపారు.

త్వరలో మరికొన్ని వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వారం రోజులకు ఒక వందే భారత్ రైలుకు అవసరమైన భోగీల ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. వందే మెట్రో రైళ్లను తొలి దశలో విస్తృతంగా పరీక్షించి, పరిశీలించిన తర్వాతనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. వందే భారత్ రైళ్లను 2017లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారని, చాలాసార్లు పరీక్షించిన తర్వాతనే భారత్‌లో రైళ్ల తయారీ, వినియోగం ప్రారంభమైందని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement