Monday, October 14, 2024

నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం.. ఉత్తరకొరియాకు ఎదురుదెబ్బ

ఉత్తర కొరియా తొలిసారి చేపట్టిన నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. మిలిటరీ ఉపగ్రహం మార్గమధ్యంలో పేలినట్లు ఉత్తర కొరియా ధ్రువీకరించింది. చియోల్లిమా-1 రాకెట్‌ ద్వారా ఆ శాటిలైట్‌ను ప్రయోగించారు. ఫియాన్‌గాన్‌ ప్రావిన్సులో ఉన్న సోమే శాటిలైట్‌ లాంచింగ్‌ గ్రౌండ్‌ నుంచి మల్లిగ్యాంగ్‌-1 శాటిలైట్‌ను ప్రయోగించారు. అమెరికా మిలిటరీ కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు జూన్‌ 11వ తేదీ లోగా ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ఇటీవల ఉత్తర కొరియా ప్రకటించింది.

అయితే ఆ ప్రయోగం విఫలం కావడంతో.. త్వరలోనే రెండో లాంచ్‌ చేపట్టనున్నట్లు ఆ దేశం తెలిపింది. ఉత్తరకొరియా అధికారిక న్యూస్‌ఏజెన్సీ ఈ ప్రయోగం విఫలమైన విషయాన్ని బుధవారం వెల్లడించింది. ఉపగ్రహాన్ని తీసుకెళుతున్న రాకెట్‌ తొలి, రెండో దశల సమయంలో ప్రజ్వలనను కోల్పోయినట్లు పేర్కొంది. తమ శాస్త్రజ్ఞులు ఈ వైఫల్యానికి గల కారణాలను అధ్యయనం చేస్తున్నారని తెలిపింది.

- Advertisement -

కాగా కిమ్‌ సైనిక విస్తరణ చర్యలకు ఇది పెద్ద ఎదురుదెబ్బని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బుధవారం ఉదయం 6.29 సమయంలో ఉ.కొరియాలోని ఈశాన్య ప్రాంతంలోని తాంగ్‌ఛాంగ్‌-రీ లోని ప్రధాన అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం చేపట్టిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రాకెట్‌ కూలిపోయే సమయంలో అసాధారణ గమనంలో ప్రయాణించిందని వెల్లడించారు. దీనిపై అమెరికాతో సమన్వయం పెంపొందించుకొన్నట్లు తెలిపారు.

కొన్ని రాకెట్‌ శకలాలను కూడా దక్షిణ కొరియా స్వాధీనం చేసుకొంది. మరోవైపు జపాన్‌ స్పందిస్తూ.. ఏ వస్తువు కూడా అంతరిక్ష కక్ష్యలోకి చేరుకోలేదని వెల్లడించింది. కాగా, ఉత్తరకొరియా రాకెట్‌ ప్రయోగించిన విషయం తెలియగానే దక్షిణ కొరియా, జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. సియోల్‌ ప్రజలకు స్పీకర్లలో, ఫోన్‌ సందేశాల ద్వారా హెచ్చరించింది. మరోవైపు జపాన్‌ ఒకినావాలో క్షిపణి హెచ్చరిక వ్యవస్థను సిద్ధం చేసింది. ఈ ప్రాంతం ఉత్తరకొరియా రాకెట్‌ గమనమార్గంలో ఉండటంతో ఈ చర్యలు తీసుకొంది. ప్రజలను భవనాలు, అండర్‌గ్రౌండ్‌ల్లోకి వెళ్లమని హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరకొరియా ప్రయోగాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇది ఐరాస ఆంక్షలకు వ్యతిరేకంగా బాలిస్టిక్‌ క్షిపణి టెక్నాలజీని ఉపయోగించడమే అని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement