Tuesday, April 30, 2024

Financial crisis | ప‌న్నుల వాటా పెంచాల్సిందే.. ఆర్థిక సంఘానికి తెలంగాణ రిక్వెస్ట్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పన్నుల వాటా ప్రాతిపదికగా నిధుల కేటాయింపులు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సంఘంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేనున్నదని తెలిసింది. ధనిక రాష్ట్రంగా తెలంగాణను చూస్తూ పన్నుల వాటాను తగ్గించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కలిసివచ్చే ఎదుగుతున్న నాన్‌ బీజేపీ పాలిత ప్రాంతాలతో సమన్వయం దిశగా ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ధిక ఆంక్షలు, సెస్ల పేరుతో మోసం, జీఎస్టీ బకాయిల వంటివాటితో ఆర్ధికంగా ఇబ్బందులు సృష్టించడంతో ఖజానాకు భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రాబడులు, కేంద్ర సాయాలు, ఇతర ఆర్ధికపరమైన అంశాలను లోతుగా అధ్యయనం చేస్తోంది.

ఈ క్రమంలో రాష్ట్ర ఆర్ధిక క్రమశిక్షణను తెలంగాణలోని అన్ని జిల్లాలకు పెద్ద ఎత్తున నిధులను కోరనుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నాయని, నీటి సంరక్షణకు కృషి చేస్తున్న ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని పేర్కొంటూ వీటికి నిధుల సిఫారసులో పక్షపాతం లేకుండా చూడాలని కోరేందుకు సిద్దమైంది. తాగునీటి, సాగునీటి సమస్యల నివారణతోపాటు, హైదరాబాద్‌ లాంటి నగరాలకు నీటి కొరత లేకుండా నిర్మించనున్న మూడు జలాశయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరనున్నారు. కొత్త రాష్ట్రం తెలంగాణలో గడచిన ఎనిమిదేళ్లుగా సాధిస్తున్న పురోగతికి అనుగుణంగా నిధుల ఆవశ్యకతను ఆర్ధిక సంఘానికి విన్నవించాలని భావిస్తోంది.

- Advertisement -

ప్రధానంగా ఇప్పటివరకు అనుసరిస్తున్న పన్నుల వాటాకు సంబంధించిన ప్రాతిపదిక అంశాలను పున:పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నది. ఇప్పటివరకు అనుసరిస్తున్న ప్రాతిపదిక అంశాలను మార్చాలని విస్పష్టంగా కోరనున్నది. ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రాలకు, లోటులో ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులనిస్తూ ఆర్ధిక క్రమశిక్షణతో మెలుగుతున్న రాష్ట్రాలకు కోత పెట్టడంపై నివేదిక రెడీ చేస్తోంది. ఆర్ధిక క్రమశిక్షణ సాధించే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇస్తేనే మరింత స్పూర్తిమంతంగా ఇతర రాష్ట్రాలు మెలుగుతాయని, లేదంటే పక్షపాతం చేసినట్లే అవుతుందని ఆర్ధిక శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర రుణపరిమితి(ఎఫ్‌ఆర్‌బిఎం) మొత్తాన్ని ఆర్ధికంగా మిగులులో ఉన్న రాష్ట్రానికి 3.5 నుంచి మరింతగా పెంచాలనే డిమాండ్‌ను కూడా నివేదికలో చేర్చారు. మిషన్‌ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులకు అమలు చేస్తున్న పథకాలకు నిధుల సాయం కోరేందుకు నివేదికలో అంశాలను చేర్చారు.

కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో రాష్ట్రంలో పట్టణీకరణ పెరగడం, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు వంటి అంశాలను ఆర్ధిక సంఘం పరిగణలోకి తీసుకునేలా కసరత్తు చేశారు. కనీస వసతులు, మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులను కోరనున్నారు. మండల, జిల్లా పరిషత్‌లకు ఆర్ధిక సంఘంనుంచి నిధులిచ్చి వెన్నుదన్నుగా నిల్చేలా మార్పులు చేయాలని అభ్యర్ధించాలని యోచిస్తోంది. గ్రామీణ ప్రాంతాల రహదారుల నిర్మాణానికి చేయూతనిచ్చేలా ఆర్ధిక సంఘం ఉదారంగా వ్యవహరించేలా ఒత్తిడి తేనున్నట్లు సమాచారం.

సమాఖ్య స్పూర్తిని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేస్తూనే కేంద్రం నుంచి అధిక నిధులు పొందేలా ఆర్ధిక సంఘంపై ఒత్తిడి తెచ్చేలా తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ నివేదికలు రూపొందిస్తోంది. 2020నుంచి 2025 వరకు వీలైనన్ని ఎక్కువ నిధులు పొందేందుకు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నించేలా కసరత్తు చేస్తోంది. 2014నుంచి 2022వరకు దక్షిణాది రాష్ట్రాలనుంచి పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్లిన ప్రతీ రూపాయిలో తిరిగి కేంద్రం 52 శాతమే తెలంగాణకు వస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలకు రూపాయికి 3.25లను ఇవ్వడం వివక్షకు కారణమవుతోంది. 14వ ఆర్ధిక సంఘం సూచించినట్లుగా కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 32నుండి 42 శాతం పెంచినట్లుగా చెప్పుకున్నప్పటికీ ఇతర పన్నుల్లో వాటా భారీగా తగ్గి ఓవరాల్‌ కేంద్ర సాయం తగ్గుతూ వస్తోంది.

గ్రాంట్‌లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్ర సాయం నానాటికీ తగ్గుతోంది. కేంద్ర సాయంలో మొత్తంగా 4 శాతం తగ్గి 48శాతానికే పరిమితం కావడం తెలంగాణ తీవ్రంగా నిరసిస్తోంది. 15వ ఆర్ధిక సంఘం కేంద్ర నిధుల కేటాయింపునకు సూచీలుగా నిర్ధేశించిన పనితీరు, ప్రోత్సాహకాలు, కేంద్ర పథకాల అమలు, జనాభా నియంత్రణ, ఇతర అంశాల్లో రాష్ట్రం పురోగతిలో ఉందని, ఈ నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో నిధులను పెంచాలని కోరేలా శాఖాల వారీగా ప్రతిపాదనలను రెడీ చేస్తున్నారు. గడచిన 14వ ఆర్ధిక సంఘం 5ఏళ్లలో లక్ష కోట్లు తెలంగాణకు ఇవ్వాలని సిఫార్సు చేసింది. పన్నుల ద్వారా రూ. 96,217కోట్లు స్థానిక గ్రాంట్‌లు రూ. 9449 కోట్లుగా అంచనా వేసింది.

14వ ఆర్ధిక సంఘం నిర్లక్ష్యంతో తెలంగాణకు అన్యాయం చేసిందని, తాజా 15వ ఆర్ధిక సంఘానికి అటువంటి అవకాశం ఇవ్వకుండా గ్రామీణ ప్రాంతాలు, సమగ్ర రాష్ట్ర వివరాలు, పరిస్థితులు, ప్రజల జీవన ప్రమాణాలు వంటి వాటి ఆధారంగా నిధుల కేటాయింపు జరిగేలా నివేదికలను రూపొందిస్తోంది. జనాకర్షక పథకాలు(పాపులిస్టిక్‌ స్కీమ్స్‌) పెంచితే కోత పెడతామని ఉన్న నిబంధనను ఎత్తివేయాలని, ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు, విభజన హామీలకు నిధులను కోరుతూ త్వరలో ప్రతిపాదనలు ఇచ్చేందుకు సిద్దమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement