Tuesday, May 7, 2024

Big Story | ధరల దడ ద‌డ‌.. అన్నింటి ధరలు రెట్టింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పేదల ఆదాయం పెరిగిన నిత్యావసరాల ధరలమంటతో ఆవిరవుతోంది. మధ్యతరగతి ప్రజల బ్రతుకు బడ్జెట్‌ గాడి తప్పుతోంది. మరోవైపు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో అన్ని వినియోగవస్తువులు, నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటగా, గడచిన మూడు నెలలుగా వంటనూనెలు, కూరగాయలు, పప్పులు, ఇతర నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. గడచిన మూడు నెలల్లోనే 200శాతంమేర పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారు. టమోటా, ఉల్లిగడ్డలు సామాన్యులకు అందనంత ధరలకు చేరగా, వీటికి ఆజ్యం పోసేలా వంటగ్యాస్‌, పెట్రో ధరలు ప్రజల నడ్డివిరుస్తున్నాయి. వంటనూనెలు, ప్పులు, బియ్యం, గోధుమలు, కందిపప్పు, ఆఖరుకి ఉప్పు ధరలు కూడా పెరగ్గా, కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి.

మే నెలలో రూ. 20కి కిలో ఉన్న టమోటా రూ. 250కి చేరింది. ఎండుమిర్చి ధర రూ. 400లకు చేరగా, పచ్చిమిర్చి కూడా విపరీతంగా పెరగడం గమనార్హం. రానున్న కాలంలో కూడా ధరలు మండే అవకాశాలున్నాయనే హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. రాష్ట్రంలో అతివృష్టితో పంటలు దెబ్బతినడంతో కొరత మరింత తీవ్రం కానున్నది. సెప్టెంబర్‌ నాటికి రిటైల్‌ ద్రవ్యోల్బణం గరిష్టస్థాయిలో 5.5 శాతంపైగా చేరవచ్చనే నిపుణుల అంచనాల నేపథ్యంలో నిత్యావసరాల ధరలు మరింత పెరగొచ్చని అంటున్నారు.

2019తోపోలిస్తే ఈ ఏడాది ఒక్కో కుటుంబంపై ఖర్చు రెండింతలకు మించింది. బియ్యం, వంటగ్యాస్‌ సిలిండర్‌, పప్పు, కూరగాయల ధరలు రెండునుంచి మూడింతలకుపైగా పెరిగాయి. గ్యాస్‌ సిలిండర్‌ ధర గతేడాది రూ. 570 ఉండగా, ఇప్పుడిది రూ. 1076కు చేరింది. బియ్యం ధరల రెట్టింపైంది. పప్పుల ధరలు 60శాతంపైగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. వంటనూనెల ధరలు ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత కాస్త అందుబాటులోకి వచ్చినా గతేడాదితో పోలిస్తే ఇంకా పెరుగుదలతోనే ఉన్నాయి. మినపప్పు ధరలు రూ. 130కిపైగా ఉందని, పాల ధర లీటర్‌కు రూ. 20కిపైగా పెరగడం పేదలకు భారంగా మారింది. కందిపప్పు కిలోకు రూ. 100 తక్కువ ఎక్కడా దొరకడంలేదు. సన్న బియ్యం కిలోకు రూ. 50కి చేరగా, కంది పప్పు రూ. 120కి, దశనగపప్పు రూ. 72కు కిలో, పెసర పప్పు రూ. 110కి కిలో, మినప పప్పు రూ. 120కి కిలో, వేరుశనగ నూనె రూ. 180కికిలో, పామోలిన్‌ రూ. 103, పంచదార రూ. 41, బెల్లం రూ. 55 కి కిలో చొప్పున ధరలున్నాయి. కాగా గతేడాది క్రితం వీటి ధరలు ఇప్పటి ధరలతోపోలిస్తే 50శాతానికి కాస్త అటుఇటూగా ఉన్నాయి.

నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఒక్కో కుటుంబంలో నెలకు సగటున వంటనూనెలకు రూ. 150, పప్పులకు రూ. 100, కూరగాయలకు రూ. 100 , పెట్రోల్‌, డీజిల్‌కు రూ. 500, ఇతర నిత్యావసరాలకు రూ. 350కిపైగా అదనపు భారం పడుతోంది. ఇప్పటికే పెరిగిన ఢీజిల్‌, పెట్రోల్‌ ధరల భారం అన్ని నిత్యావసరాలు, వంటనూనెలు, పప్పులు, కూరగాయలపై పడుతోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో అంతర్జాతీయ విపణిలో దేశీయ రూపాయి విలువ గరిష్టానికి దిగజారింది. ప్రపంచ మార్కెట్‌లో దేశ ప్రతిష్టను మోడీ సర్కార్‌ ఏటేటా దిగజార్చుతోంది. అన్ని రంగాల్లో దేశ ఖ్యాతి దిగదుడుపుగా మారుతోండగా, తాజాగా 10ఏళ్ల కనిష్టానికి రూపాయి విలువ పతనమైంది. 2014నుంచి ప్రపంచంలో పలు దేశాల కరెన్సీల విలువలను పరిశీలిస్తే ఇంత దిగజారుడు ఏ దేశంలోనూ జరగలేదు. మే 2014నుంచి 42.17శాతం విలువను రూపాయి కోల్పోయింది. డాలరుతో రూపాయి విలువ దిగజారి రూ. 81మార్కును దాటింది. రూపాయి విలువ పతనంతో ప్రపంచ మార్కెట్‌లో దొరికే వస్తువుల కొనుగోలు మరింత ప్రియం కానున్నాయి.

2014నుంచి అదే పతనమే…
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత బలహీనపడిందనే మాట 2014నుంచి కామన్‌గా వినిపిస్తున్నది. కరోనా మహమ్మారి కారణంగా ఎకానమి మందగించిన అనంతరం రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే. పశ్చిమ దేశాలు రష్యాపై ఆర్ధిక ఆంక్షలను విధించాయి. అనేక దేశాలు రష్యానుంచి క్రూడాయిల్‌ కొనుగోలును నిలిపివేశాయి. యుద్ధం కారణంగా క్రూడాయిల్‌, చమురు, గ్యాస్‌ ధరలు పెరిగాయి. ఇది ఆమెరికా, యూరప్‌లపై ప్రభావం చూపింది. దీంతో ఆహారపదార్ధాలు, వంటనూనెలకు ఆటంకాలు ఏర్పడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement