Tuesday, April 30, 2024

పులికాట్ సరస్సు మధ్యలో అగిన పడవ – మృత్యు అంచున 60 మంది విద్యార్థుల జీవితాలు

తడ, ఆగస్టు 10 (ప్రభన్యూస్): రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన తిరుపతి జిల్లా తడ మండలంలోని ఇరకం దీనికి చెందిన మత్య్సకార కుటుంబాలకు చెందిన స్కూలు విద్యార్థులకు గురువారం రాత్రి పెద్ద ప్రమాదం తప్పింది. తమిళనాడులోని యళావూరులో ఉన్న సున్నపుగుంట ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఇరకం దీవిలోని పాళెంతోపు కుప్పం, మొనకుప్పంకు చెందిన సుమారు 60మంది విద్యార్థులు స్కూలు ముగించుకుని పడవలో ఇంటికి వెళుతున్నారు. పులికాట్లో చేపలవేట కోసం వేసిన వల విద్యార్థులు ప్రయాణిస్తున్న పడవ ఇంజెన్కు చుట్టుకు పోవడం వల్ల పడవ ఒక్కసారిగా ఊగిసలాడింది. దీంతో పడవలో ప్రయాణిస్తున్న విద్యార్థులంతా ఆందోళనకు గురవ్వడమే కాకుండా అరుపులు.. కేకలు వేశారు.

అయితే కొద్ది సేపటికే పడవ ఆగిపోవడంతో అందరూ భయాందోళనకు గురైయ్యారు. చుట్టూ చిమ్మచీకటి అలుముకోవడం, సెల్ ఫోన్ సిగ్నెల్స్ కూడా లేకపోవడంతో పడవ నడిపే ఆపరేటర్ ఏమి చేయాలో దిక్కుతోచక ఆందోళనకు లోనైయ్యాడు. కుప్పాలకు సమాయానికి రావాల్సిన విద్యార్థులు ఇంటికి రాకపోవడంతో అటు తల్లిదండ్రులు సైతం ఆందోళనకు లోనైయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికి పడవ ఆపరేటర్ సెల్ సిగ్నెల్స్ రావడంతో ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకుని ఇరకం దీవి నుండి గ్రామస్తులు మూడు పడవలను తీసుకుని విద్యార్థుల కోసం పులికాట్లో ముందుకు సాగారు.

పులికాట్ సరస్సు మధ్యలో నిలిచిపోయి ఉన్న పడవలో నుండి విద్యార్థులను ఎక్కించుకుని తమ ఇళ్లకు తీసుకువెళ్లారు. పులికాట్ సరస్సులో చోటు చేసుకున్న ఈ సంఘటన మత్య్సకార కుటుంబాల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు ఆందోళనకు గురిచేసింది. తరచూ పులికాట్ సరస్సులో విద్యార్థులు భయానక పరిస్థితుల నడుమ ప్రయాణం చేయాల్సి వస్తుండడంతో మత్య్సకార కుటుంబాల వారు క్షణక్షణ భయంతో వణికి పోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement