Wednesday, May 1, 2024

పోలీసులవ‌న్నీ కట్టుకథలే, ఆ ఎన్‌కౌంటర్ బూటకమే.. తేల్చి చెప్పిన సిర్పూర్కర్ కమిషన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్ వ్యవహారంలో తెలంగాణ పోలీసులకు గట్టి ఎదురుదెబ్బ తలిగింది. ఈ ఎన్‌కౌంటర్ బూటకమని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలో బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖా బల్డోతా, సీబీఐ మాజీ డైరక్టర్ కార్తికేయన్‌తో కూడిన కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఎన్‌కౌంటర్లో పాల్గొన్న పోలీసు అధికారులపై భారత శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 302, 201తో పాటు సెక్షన్ 34 ప్రకారం కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని కమిషన్ సూచించింది. శుక్రవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయవద్దని సుప్రీంకోర్టును కోరారు. నివేదిక బహిర్గతం చేస్తే పరిపాలనాపరమైన అంశాలతో పాటు దేశవ్యాప్తంగా దీని ప్రభావం, పర్యవసానాలు ఉంటాయని వాదించారు. అయితే ఈ వాదనతో విబేధించిన ధర్మాసనం సిర్పూర్కర్ కమిషన్ విచారణ బహిరంగంగా జరిగిందని, అలాంటప్పుడు నివేదికను బహిర్గతం చేయడంలో అర్థం లేదని వ్యాఖ్యానించింది. ఒకసారి నివేదిక రూపొందాక, అందులోని అంశాలు బహిర్గతం చేయాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. జాతీయభద్రతకు సంబంధించిన అంశాలు ముడినప్పుడు మాత్రమే నివేదికలు బహిర్గతం చేయకుండా సీల్డ్ కవర్లలో ఉంచుతామని చెప్పారు.

కేసులో పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది వృందా గోవర్ మాట్లాడుతూ సాయుధ బలగాలతో ముడిపడ్డ మణిపూర్ హత్యల నివేదికనే బహిర్గతం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో కమిషన్ నివేదికను సుప్రీంకోర్టులో సమర్పించిందని, ఆ నివేదిక కాపీలను వాదప్రతివాదులందరికీ అందజేయాల్సిందిగా ఆదేశిస్తున్నామని ధర్మాసనం తెలియజేసింది. మొత్తం కేసును రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేస్తున్నామని, ఇరుపక్షాలు తమ వాదనలు అక్కడ చెప్పుకోవచ్చని స్పష్టం చేస్తూ కేసును ముగించింది.

కల్పితాలు.. కట్టుకథలు

‘దిశ’ నిందితులపై జరిపిన కాల్పుల వ్యవహారంలో తెలంగాణ (సైబరాబాద్) పోలీసులు చెప్పినవన్నీ కట్టుకథలేనని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక స్పష్టం చేసింది. అనుమానిత నిందితులను అత్యాచారం జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లినప్పుడు పోలీసుల దగ్గర నుంచి ఆయుధాలు లాక్కున్నారని పోలీసులు చెప్పారని, కానీ తమ విచారణలో అలా ఆయుధాలు లాక్కోవడం సాధ్యమే కాదని తేలిందని కమిషన్ నివేదిక పేర్కొంది. పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు వారి దృష్టి పారిపోయే మార్గం వైపు ఉంటుంది తప్ప నిలబడి పోలీసుల తుపాకులు లాక్కుని వారిపై కాల్పులు జరిపే పరిస్థితి ఉత్పన్నం కాదని వ్యాఖ్యానించింది. పైగా నిందితులకు తుపాకులను ఉపయోగించినట్టు చెబుతున్న పోలీసుల కథనం కూడా నిజం కాదని నివేదిక పేర్కొంది.

పోలీసులు ఆత్మ రక్షణ కోసమో లేక మళ్లీ అరెస్ట్ చేయడం కోసమో కాల్పులు జరపలేదని, తమ కాల్పులతో అవతలి వ్యక్తులు చనిపోతారని తెలిసే కాల్పులు జరిపారని స్పష్టం చేసింది. సేఫ్ హౌజ్ నుంచి చటాన్‌పల్లికి తీసుకెళ్లే వరకు పోలీసులు చూపించిన రికార్డులన్నీ కూడా కల్పితాలు, కట్టుకథలేనని కమిషన్ కొట్టిపడేసింది. పోలీసుల కథనం ఏమాత్రం నమ్మశక్యంగా లేదని పేర్కొంది. అనుమానిత నిందితులు పోలీసులపై దాడి చేస్తే, పోలీసులు గాయపడ్డారనడం, వారికి ఆస్పత్రిలో చికిత్స అందించారనడం కూడా పూర్తిగా అవాస్తవమేనని విశదీకరించింది.

- Advertisement -

నిజానికి నిందితులను సురక్షితంగా కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందని, కానీ అది జరగలేదంటే నిందితులను హతమార్చాలన్న పోలీసుల ఉద్దేశం బయటపడినట్టేనని కమిషన్ వ్యాఖ్యానించింది. మరోవైపు నిందితుల్లో జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు మైనర్లుగా కమిషన్ తేల్చింది. మొత్తంగా ఎన్‌కౌంటర్లో పాల్గొన్న పోలీసు అధికారులు సురేందర్, నరసింహారెడ్డి, షేక్ లాల్ మదార్, సిరాజుద్దీన్, రవి, వెంకటేశ్వర్లు, అరవింద్ గౌడ్, జానకీ రామ్, బాలు రాథోడ్, శ్రీకాంత్ పై ఐపీసీ 302 (హత్యా నేరం)తో పాటు ఐపీసీ 201 ప్రకారం కేసులు నమోదు చేయాల్సిందిగా కమిషన్ సిఫార్సు చేసింది. ఒకే ఉద్దేశంతో ఉమ్మడిగా పది మంది కలిసి చేసినందున ఈ సెక్షన్లకు అదనంగా ఐపీసీ సెక్షన్ 34ను కూడా ప్రయోగించాల్సిందిగా సూచించింది.

దృష్టి మళ్లించడం కోసమే కాల్చి చంపారు – న్యాయవాది పీవీ కృష్ణమాచార్యులు

వెటర్నరీ మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని దిశపై జరిగిన పాశవిక అత్యాచారం అనంతరం ప్రజాగ్రహం పెల్లుబకడంతో రాజకీయంగా తమపై వస్తున్న విమర్శల నుంచి దృష్టి మళ్లించడం కోసమే ఈ ఎన్‌కౌంటర్ చేశారని న్యాయవాది పీవీ కృష్ణమాచార్యులు అన్నారు. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు విచారణకు హాజరైన ఆయన, అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్‌కౌంటర్ వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. ఏదైనా నేరం జరిగినప్పుడు ప్రజలు సత్వర న్యాయం కోరుకుంటున్నారని, కానీ న్యాయవ్యవస్థలో తగినన్ని కోర్టులు, జడ్జిలు, ప్రాసిక్యూటర్లు లేక పనిభారంతో కేసుల విచారణ ఆలస్యమవుతోందని, పోలీసులు సైతం చార్జిషీట్లు దాఖలు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆయన తెలిపారు. న్యాయస్థానాల్లో జరుగుతున్న జాప్యం ప్రజల్లో ఆగ్రహానికి కారణమవుతుందని, అంతమాత్రాన చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదని అన్నారు. వందల మందిని కాల్చి చంపిన పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ విషయంలోనే చట్టప్రకారం ప్రాసిక్యూట్ చేసి శిక్ష విధించి అమలు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. నిందితులను రక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందని, అలాంటి పోలీసులే హత్యలు చేస్తే ఎలా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులు ఎంతటి ఘోరానికి పాల్పడినా సరే, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప ఇలా హద్దులు మీరితే కష్టాలు కొనితెచ్చుకోవాల్సి వస్తుందని హితవు పలికారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement