Wednesday, September 20, 2023

AP | కర్నూల్‌కు హైకోర్ట్‌ తరలింపు.. అక్టోబర్ లో ముహుర్తం

అమరావతి,ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తన ఎన్నికల వ్యూహాలకు పదును పెడ్తున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ఊహాగానాలు చేస్తున్న తరుణంలో సిఎం జగన్‌ తనదైన శైలిలో ఎన్నికల ఎత్తగడలు వేయబోతున్నారు. గతంలోనే తమ విధానం మూడు రాజధానులంటూ చెప్పిన వైఎస్‌ జగన్‌ ఎన్నికల ముందు ఆ నినాదాన్ని ఆచరణలో పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒక అంచనా ప్రకారం డిసెంబర్‌ మాసంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముందస్తు ఎన్నికలు వస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.

డిసెంబర్‌లో ఎన్నికలు అంటే అక్టోబర్‌ చివరి నాటికి ఎన్నికల నోటిఫికేషన్‌ రావాల్సి ఉంది. సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్‌ రావడానికి కొద్ది రోజుల ముందుగా మూడు రాజధానుల అంశాన్ని రాజకీయ తెరపైకి తీసుకురానున్నారు. ఈసారి కేవలం ప్రచారానికి పరిమితం కాకుండా ఆచరణలోనూ కొన్ని నిర్ణయాలు చేయనున్నారు. అందులో భాగంగా కర్నూల్‌కు హైకోర్ట్‌ తరలింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు.

- Advertisement -
   

ముందుగా హైకోర్టును కర్నూల్‌కు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేస్తుంది. ఆ తర్వాత హైకోర్టు ఫుల్‌ కోర్ట్‌ అభిప్రాయం కోరుతుంది. హైకోర్టు కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు ఫుల్‌ కోర్ట్‌ కూడా తీర్మానం చేస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. దీంతో హైకోర్టు తరలింపు ప్రక్రియ ప్రారంభమౌతుంది. ఇదంతా అక్టోబర్‌ మాసం మొదటి వారంలోనే పూర్తి చేయనున్నట్లు సమాచారం.

ఈ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ హైకోర్టు తరలింపు సాధ్యమా అనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. రాజధాని తరలింపుకు సంబందించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఆ తీర్పు వచ్చేంతవరకు సాధ్యం కాదు. కానీ ప్రక్రియ ప్రారంభించామని, మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతో మూడు రాజధానుల పట్ల సానుకూలంగా ఉన్నవారికి తమవైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది.

అసలు హైకోర్ట్‌ తరలించే ప్రక్రియ ఏంటి?

ఒక రాష్ట్రంలో ఏర్పాటైన హైకోర్టుకు మరో చోటకు తరలించేందుకు ప్రత్యేకమైన చట్టమేదీ లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి ఒక అభిప్రాయానికి వస్తే హైకోర్టును మార్చవచ్చు. అయితే దానికి కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు అనుమతి కూడా కావాలి. సాధారణంగా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి హైకోర్ట్‌ అనుమతికి పంపాలని, అక్కడ ఫుల్‌ కోర్ట్‌ అంటే జడ్జీలంతా సంతకాలు పెడితే ఆ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వద్దకు పంపుతారు.

కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును సంప్రదించి రాష్ట్రపతికి సిఫార్సు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి కొత్త హైకోర్టు స్థానాన్ని నోటిఫై చేస్తారు. ఇది సాధారణంగా జరగాల్సిన ప్రక్రియ అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే రాజధాని తరలింపుపై సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున దీనిపైన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం లేదు.

ఇదే విషయాన్ని కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్‌ రుజుజు కూడా పార్లమెం ట్‌లో ఒక ప్రశ్నకు బదులిస్తూ సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు పరస్పరం అంగీకారానికి వచ్చి నిర్ణయం తీసుకోవచ్చని, అయితే ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు.

విశాఖలో సిఎం క్యాంప్‌ ఆఫీసు

హైకోర్ట్‌ తరలింపు ప్రక్రియ ప్రారంభించగానే తాను వైజాగ్‌కు వెళుతున్నట్లు కూడా సిఎం జగన్‌ ప్రకటించనున్నారు. తన పూర్తిస్థాయి కార్యకలాపాలు వైజాగ్‌ నుంచే నిర్వహించుతారు. ఇప్పటికే సిఎం క్యాంప్‌ కార్యాలయం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. రుషికొండ ఆఫీసు నిర్మాణం కూడా పూర్తయింది. అధికారులకు ఆఫీసు, నివాస ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. దీంతో ఒక సిఎం జగన్‌ వైజాగ్‌ నుండి పరిపాలించడం ప్రారంభించినట్లే అవుతుంది.

ఈ రెండు నిర్ణయాల ద్వారా మూడు రాజధానుల అంశం ఒక్కసారిగా మళ్లి తెరపైకి వస్తుంది. తాము చెప్పిన ప్రకారం మూడు రాజధానుల ప్రక్రియను ప్రారంభించామని చెప్పుకునే అవకాశం ఏర్పడతుంది. ఎన్నికల్లో ఇది కూడా ప్రధాన అజెండాగా మారుతుంది. తాము తిరిగి అధికారంలోకి వస్తే మిగిలిన అడ్డంకులను కూడా తొలగించి పూర్తిస్థాయిలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement