Tuesday, April 30, 2024

ఎల్‌ఐసీ ఐపీఓ వచ్చేసిందోచ్‌.. మే 4న ప్రారంభం, 9న ముగింపు

ఇన్వెస్టర్లు ఎంతో ఎదురుచూస్తున్న ఎల్‌ఐసీ ఐపీఓ రానే వచ్చింది. వచ్చే వారం ఎల్‌ఐసీ ఐపీఓ ప్రారంభం కానుంది. షేర్ల సబ్‌ స్క్రిప్షన్‌ ప్రక్రియ మే 4న ప్రారంభమై.. మే 9వ తేదీన ముగుస్తుంది. మే 17న ఎల్‌ఐసీ షేర్లు స్టాక్‌ మార్కెట్‌లో నమోదు అవుతాయి. బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు పెట్టుబడులు-ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత్‌ పాండే వెల్లడించారు. ఈ ఐపీఓ ద్వారా రూ.21వేల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పరిమాణంలో ఎల్‌ఐసీ ఐపీఓ దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా అవతరించనుంది. ధరల శ్రేణిని ఒక్కో షేర్‌కు రూ.902-రూ.949గా నిర్ణయించారు. కనీసం 15 బిడ్లు వేయాల్సి ఉంటుంది. అంటే గరిష్ట ధర వద్ద మదుపర్లు కనీసం రూ.14,235 పెట్టుబడి పెట్టాలి. విజయవంతమైన బిడ్డర్ల డీమ్యాట్‌ అకౌంట్స్‌లో షేర్లు మే 16న జమ అవుతాయి. మే 17న స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఎల్‌ఐసీ లిస్టు కానుంది.


క్యూఐబీకి 50శాతం షేర్లు
50శాతం షేర్లు క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లకు (క్యూఐబీ) కేటాయించారు. దీంట్లో 60 శాతం వాటాను యాంకర్‌ ఇన్వెస్టర్లకు రిజర్వ్‌ చేశారు. నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు 15 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్లకు 15 శాతం వాటాలను కేటాయించారు. ఎల్‌ఐసీ విలువ (ఎల్‌ఐసీ ఐపీఓ) రూ.6లక్షల కోట్లుగా లెక్కగట్టారు. ఏకీకృత వాటాదారుల విలువగా పరిగణించే సంస్థ ఎంబెడెడ్‌ విలువను సెప్టెంబర్‌ 30, 2021 నాటికి రూ.5.4లక్షల కోట్లుగా అంచనా వేశారు. తొలుత ఫిబ్రవరిఅలో వేసిన ప్రణాళిక మేరకు ఎల్‌ఐసీలో 5శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను ఐపీఓలో విక్రయించి రూ.63,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ మార్కెట్‌లో పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో పరిమాణాన్ని రూ.21,000 కోట్లకు తగ్గించారు. రూ.లక్ష కోట్లకు పైగా విలువ చేసే కంపెనీలు ఐపీఓకు వస్తే.. కనీసం 5 శాతం వాటాలను విక్రయించాలని సెబీ నిబంధనలు తెలియజేస్తున్నాయి. దీని నుంచి మినహాయింపు కోరుతూ సెబీకి ప్రభుత్వం గత వారం దరఖాస్తు చేసుకుంది.
రిటైల్‌ విభాగంలో 2.21 కోట్ల షేర్లు
రిటైల్‌ విభాగంలో తన పాలసీదారులు కోసం ఎల్‌ఐసీ ప్రత్యేకంగా షేర్లను జారీ చేయనుంది. ఇందుకోసం ఇష్యూ పరిమాణంలో 2.21 కోట్ల (0.35 శాతం) షేర్లను కేటాయించింది. వీరికి ఒక్కో షేరుపై రూ.60రాయితీ కూడా ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ పాలసీ పాలసీలకు ప్రీమియం చెల్లిస్తున్న పాలసీదారులు ఎల్‌ఐసీ వాటాదారులుగా మారేందుకు అవకాశం లభించింది. తమ ఉద్యోగుల కోసం కూడా ఎల్‌ఐస ప్రత్యేకంగా 15.81 లక్షల (0.025 శాతం) షేర్లను కేటాయించింది. వీరికి ఒక్కో షేరుపై రూ.45 రాయితీ దక్కనుంది. రిటైల్‌ మదుపర్లకు కూడా ఇంతే మొత్తంలో రాయితీ లభించనుంది. ఇంతకుముందు కూడా దేశంలో చాలా పెద్ద ఐపీఓలుగా జరిగాయి. కానీ అవన్నీ.. రూ.20వేల కోట్లలోపే సేకరించాయి. ఇప్పటి వరకు రూ.10వేల కోట్ల పైన 5 ఐపీఓలు వచ్చాయి.


ఫిబ్రవరిలోనే సెబీకి దరఖాస్తు
ఫిబ్రవరి 13న ఎల్‌ఐసీ ఐపీఓ కోసం సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. మార్చిలో అనుమతి లభించింది. మే 12 వరకు ఐపీఓను ప్రారంభించేందుకు ఎల్‌ఐసీకి గడువు ఉంది. ఈ ఐపీఓ ద్వారా సమకూరే నిధులన్నీ పెట్టుబడుల ఉప సంహరణలో భాగంగా ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయి. 2022-23లో మొత్తం పెట్టుబడుల ఉప సంహరణ ద్వారా రూ.65,000 కోట్లు సమీకరించాలని ప్రభుతం లక్ష్యంగా పెట్టుకుంది. ఎల్‌ఐసీకి 13 లక్షల మంది వ్యక్తిగత ఏజెంట్లు ఉన్నారు. 29 కోట్ల మంది పాలసీదారులకు సేవలు అందిస్తోంది. జనవరి 2022 నాటికి కొత్త బిజినెస్‌ ప్రీమియం వసూలులో ఈ సంస్థ మార్కెట్‌ వాటా 61.6 శాతం. 2021-22 ఆర్థిక సరే ప్రకారం… 2020లో జీవిత బీమా కొనుగోలు 3.2 శాతం పెరిగింది. ఇది ప్రపంచ సగటుకు దాదాపు సమానం. ఈ రంగంలో 2019-2023 మధ్య ఏటా 5.3 శాతం వృద్ధి నమోదు కానుందని అంచనా.

దేశంలోనే టాప్‌-5 అతిపెద్ద ఐపీఓలు
– వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ : వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ అంటే పేటీఎం ప్రస్తుతం ఇప్పటి వరకు అతిపెద్ద ఐపీఓగా ఉంది.
– కోల్‌ ఇండియా : కోల్‌ ఇండియా ఐపీఓ నవంబర్‌ 2010లో వచ్చింది. ఆ తరువాత కంపెనీ మార్కెట్‌ నుంచి రూ.15,199 కోట్లు సమీకరించింది.
– రిలయన్స్‌ పవర్‌ : ఫిబ్రవరి 2008లో వచ్చిన రిలయన్స్‌ పవర్‌ మూడో అతిపెద్ద ఐపీఓగా ఉంది.
– జనరల్‌ ఇన్సూరెన్స్‌ : జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఐపీఓ ఇప్పటి వరకు దేశంలో నాల్గో అతిపెద్ద ఐపీఓగా ఉంది.
– ఎస్‌బీఐ కార్డులు : ఎస్‌బీఐ కార్డుల ఐపీఓ మార్చి 2020లో వచ్చింది. ఇష్యూ పరిమాణం రూ.10,335 కోట్లుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement