Friday, May 3, 2024

దేశానికే ఆద‌ర్శం మ‌న ఊరు-మ‌న‌బ‌డి- మంత్రి కొప్పుల‌

మ‌న ఊరు- మ‌న బ‌డి కార్య‌క్ర‌మం దేశానికే ఆద‌ర్శ‌మ‌ని సంక్షేమ‌శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ తెలిపారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం కిషన్‌రావ్‌పేట, కొత్తపేట, ముత్తునూర్‌ గ్రామాల్లో మన ఊరు..మన బడి కార్యక్రమాన్ని ఎంపీ వెంకటేశ్‌నేతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కోరంగంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తుందన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువులు పునరుద్ధరణ, రైతుబంధు, రైతుబీమా పథకాలను తీసుకువచ్చిందన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అమలుతో ఆదర్శంగా నిలిచిందన్నారు. అలాగే పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికే ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. కార్యక్రమం మొదటి దశలో 9,123 పాఠశాలల్లో రూ.3497.62కోట్లతో 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement