Saturday, April 27, 2024

రేపటితో ముగియనున్న బదిలీలు, పదోన్నతులపై హైకోర్టు స్టే.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీచర్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బదిలీలు, పదోన్నతుల ప్రక్రియపై ఉపాధ్యాయ లోకం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియపై ఈనెల 14 (ఈరోజు) వరకు గతంలో స్టే విధించిన హైకోర్టు గడువు నేటితో ముగియనుంది. దీంతో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియపై హైకోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుందోనని ఉపాధ్యాయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీచర్ల బదిలీల నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని నాన్‌ స్పౌజ్‌ టీచర్ల అసోసియేషన్‌ గత నెలలో హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై సీజే ధర్మాసనం విచారణ జరిపి మార్చి 14 వరకు స్టే విధించిన విషయం తెలిసిందే. బదిలీలు, పదోన్నతుల విషయంలో చట్ట ప్రకారం నిబంధనలు రూపొందించే అధికారం అధికారులకు ఉండదని, కేవలం చట్టసభలకే ఉంటుందని పిటిషనర్లు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అంతేకాకుండా రూపొందించిన నిబంధనలను గవర్నర్‌ ఆమోదించాల్సి ఉంటుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

కానీ, ఈ ప్రక్రియను పాటించకుండా కేవలం అధికారులు ఒక జీవో రూపంలో నిబంధనలు రూపొందించారని వివరించారు. అధికారులు రూపొందించిన నిబంధనలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని కోర్టు దృష్టికి బాధితులు పిటీషన్‌ రూపంలో తీసుకెళ్లారు. నిబంధనలు మార్చాలంటే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సూచన మేరకు గవర్నర్‌ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని, కనీసం ఈ ఫైల్‌ను గవర్నర్‌కు పంపించకుండానే అధికారులు ఉత్తర్వులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల న్యాయవాది పీవీ కృష్ణయ్య గతంలో కోర్టు ముందు వాదించారు. అంతేకాకుండా గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల ఆఫీసు బేరర్లకు అదనపు పాయింట్లు ఇవ్వడం విరుద్ధమని కూడా న్యాయ స్థానం దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యాంగం ప్రకారం అందరికీ ఒకే విధమైన హక్కు ఉండాలి కానీ, వేర్వేరుగా చూడటం సరైంది కాదని పిటీషన్‌లో పేర్కొన్నారు. అయితే వీటిపైన వాదనలు విన్న న్యాయస్థానం నెల రోజుల్లో అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను మార్చి 14 వరకు స్టే విధిస్తూ గత నెలలో ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే.

- Advertisement -

దీంతో బదిలీలు పదోన్నతులు ప్రక్రియకు బ్రేక్‌ పడడంతో నేటితో కోర్టు విధించిన స్టే కు గడువు ముగియనుంది. ఈక్రమంలో దీనిపైన ప్రభుత్వం మరికొంత సమయం కోరుతుందా? లేక ప్రభుత్వం సమర్పించే వివరాలను బట్టి బదిలీలపై కోర్టు తీర్పు వెలువరించనుందా? ఎలాంటి ఆదేశాలిస్తుంది? అనే దానిపై ఉపాధ్యాయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే బదిలీల కోసం ఫిబ్రవరి 13 వరకు 73,803 మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 14 వరకు స్పౌజ్‌ కేటగిరికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తయింది. దరఖాస్తుల పరిశీలన, ఉపాధ్యాయుల కేటాయింపునకు అధికారులు సిద్ధమవుతున్న తరుణంలో హైకోర్టు స్టే విధించడంతో ప్రక్రియ మొత్తం నిలిచిపోయింది. నెల రోజుల తర్వాత కోర్టులో మళ్లి దీనిపై విచారణ జరగనుండడంతో ప్రభుత్వం బదిలీల ప్రక్రియను సాఫీగా జరిగేలా చర్యలు తీసుకొని సహకరించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఈక్రమంలో ఎమవుతుందో అనే చర్చ ఉపాధ్యాయ వర్గాల్లో నడుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement