Thursday, May 2, 2024

అటవీ జంతువుల రక్షణపై అవగాహన కార్యక్రమాలు చేస్తున్న అట‌వీశాఖ‌..

అటవీ జంతువులు, వృక్ష జాతులను కాపాడేందుకు అటవీ శాఖ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపడుతుంది. అందులో భాగంగా అటవీ నేరాల అదుపుకు సంబంధించిన సమాచారం అందించేందుకు 18004256364 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. వివిధ రూపాల్లో జరుగుతున్న జంతువుల వేట, అక్రమ రవాణాపై అటవీ సమీప గ్రామాల ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. శాస్త్రీయత లేని నమ్మకాల వలన విచక్షణ రహితంగా జరుగుతున్న వన్యప్రాణుల వేటతో అరుదైన జంతుజాతులు అంతరించే దశకు చేరుకున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో టైగర్‌ రిజర్వులతో పాటు అటవీ ప్రాంతాల్లో నిరంతర నిఘా కోసం వాచర్ల బృందాలను, యాంటీ పోచింగ్‌, ప్లైయింగ్‌ స్క్వాడ్‌ విభాగాలను విస్తరించింది. వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి గత నెల 8న వైల్డ్‌ లైఫ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ బ్యూరో సమావేశమై జంతువుల వేట, కలప అక్రమ రవాణా వంటి అంశాలను చర్చించి అన్ని మార్గాల్లో పోచింగ్‌ను అడ్డుకోవాలని నిర్ణయించింది.

వేటగాళ్ళ ముప్పు నుంచి వన్యప్రాణులను కాపాడేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు పెడుతున్నప్పటికీ వాటికి రక్షణ కల్పించడంలో లోపాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అభయారణ్యాలలో పులులు ప్రమాదంలో పడటంతో వాటి రక్షణ పట్ల ఆందోళన వ్యక్తమవుతుంది. గత నెల 25న మహారాష్ట్ర రాష్ట్రంలోని మోసం అటవీ బీట్‌లో వేటగాళ్లు విద్యుత్‌ తీగలు అమర్చి పులిని వేటాడిన ఘటనలో ఆ రాష్టానికి చెందిన వారితో పాటు కొమరం భీం జిల్లాకు చెందిన వేటగాళ్ళ భాగసామ్యం ఉందని పోలీసులు గుర్తించారు. దీంతో మహరాష్ట్రతో పాటు మన రాష్ట్రానికి చెందిన పోలీసులు వేటగాళ్ళ కోసం గాలిస్తున్నారు. పెద్దపులి చర్మం, గోళ్ళు, వెంట్రుకలకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరగడంతో వేటగాళ్ళు పులులను హతమార్చుతున్నారని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement