Wednesday, May 15, 2024

వ్యవసాయ బోరు మోటార్లకు సౌర విద్యుత్‌.. మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కేంద్రం సూచన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : విద్యుత్‌ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల వ్యవసాయ బోర్లకు సౌర విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసింది. వ్యవసాయ బోర్ల వద్ద ఏర్పాటు చేసే సౌర ఫలకాల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను కరెంట్‌ లైన్లకు కలపకుండానే.. ( ఆఫ్‌గ్రిడ్‌ ) అదే వ్యవసాయ బోరు నేరుగా మోటారుకు వినియోగిస్తారు. దీని వల్ల అటవీ, మారుమూల గ్రామాల్లోని పోలాల వద్దకు సాధారణ కరెంటు లైన్లు వేయడానికి ట్రాన్స్‌ఫార్మర్స్‌, స్తంభాల ఏర్పాటు, తీగలు లాగేందుకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు ( డిస్కంలు) వెచ్చిస్తున్న రూ.వందల కోట్ల సొమ్ము ఆదా అవుతుందని కేంద్ర విద్యుత్‌ శాఖ స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎనిమిదేళ్లలో విద్యుత్‌ పంపిణీ, సరఫరా లైన్ల వ్యవస్థ బలోపేతానికి రాష్ట్రంలోని రెండు డిస్కంలు రూ.37,099 కోట్లు వెచ్చించాయి. గత ఎనిమిదేళ్లలో కొత్తగా 7.93 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చాయి. ఒక్కో దానికి డిస్కంలు రూ.70 వేల వరకు భరిస్తుండగా.. రైతుల వాటా కింద మరికొంత చెల్లిస్తున్నారు. కరెంట్‌ లైన్లకు దూరంగా పోలాల్లో బోర్లుంటే అక్కడికి స్తంబాలు, తీగలు వేయడానికి చాలా ఖర్చవుతోంది. ఇలాంటి ప్రాంతాలకు కొత్తగా లైన్లు వేసి, ట్రాన్స్‌పార్మర్లు ఏర్పాటు చేయడానికి చేసే ఖర్చు చేసే సొమ్మును ‘ అఫ్‌గ్రిడ్‌ విధానంలో సౌర విద్యుత్‌ను ఏర్పాటుకు వెచ్చిస్తే డిస్కంలకు సొమ్ము ఆదా అవుతుందని కేంద్రం వివరించింది.

ఇందుకోసం ప్రయోగత్మకంగా తొలుత 400 వ్యవసాయ బోర్లకు అఫ్‌గ్రిడ్‌ సౌర విద్యుత్‌ను ఏర్పాటు చేయాలని నిధులు కూడా మంజూరు చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఉదహరణకు ఒక రైతు పొలంలో వ్యవసాయ బోరుకు 5 హెచ్‌పీ కరెంట్‌ మోటారు వాడితే దానిని నడపడానికి 7 కిలోవాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తికి చేసే ఫలకాల ఏర్పాటుకు రూ.3.50 లక్షల వరకూ ఖర్చు అవుతుంది. ఇందులో 30 శాతం రాయితీగా భరిస్తామని కేంద్రం నిధులు మంజూరు చేసింది. కానీ, ఆ నిధులు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం మరో 30 శాతం తప్పక భరించాలనే షరత్‌ విధించింది. మిగిలిన 40 శాతం ఖర్చు రైతు భరిస్తే సరి లేదంటే డిస్కంలు భరించాలని సూచించింది. సాధరణ కరెంటు వ్యవసాయ కనెక్షన్‌ ఇవ్వడానికి డిస్కం రూ.70 వేల వరకు భరిస్తున్నదని, దానికి మరికొంత సొమ్మును కలిపి ఖర్చు చేస్తే అదే బోరుకు అఫ్‌గ్రిడ్‌ సౌర విద్యుత్‌ను ఏర్పాటు చేయవచ్చని తెలిపింది. దీనివల్ల రైతులపై భారం పడకుండానే సౌర విద్యుత్‌ ఏర్పాటు సాధ్యమవుతోందని కేంద్ర విద్యుత్‌ శాఖ సూచిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్‌ కనెక్లన్లు 26.96 లక్షల వరకు ఉన్నాయి. వీటికి 24 గంటల పాటు ఉచితంగా కరెంట్‌ సరఫరా ఇస్తున్నందున.. ఏడేళ్లలో రాయితీ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 36,890 కోట్లు భరించింది.

అఫ్‌గ్రిడ్‌ సౌర విద్యుత్‌ను ఏర్పాటు చేయడం ద్వారా మారుమూల ప్రాంతాల్లో వ్యవసాయ బోర్లకు ఉచితంగా ఎలాంటి ఖర్చు లేకుండా విద్యుత్‌ సరఫరా సాధ్యమవుతుందని కేంద్రం అన్ని రాష్ట్రాలకు తెలిపింది. కాగా, రాష్ట్రంలో 400 వ్యవసాయ బోర్లకు వచ్చే మార్చిలోగా అఫ్‌గ్రిడ్‌ సౌర విద్యుత్‌ ఏర్పాటుకు కేంద్రం అనుమతించినందున.. 30 శాతం రాయితీని భరించడానికి నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు టీఎస్‌ రెడ్కో అధికారులు చెబుతున్నారు. అటవీ ప్రాంతాల్లో వ్యవసాయ బోర్లకు సాధారణ కరెంటు సరఫరాకు లైన్లు, స్తంభాల ఏర్పాటుకు అటవీశాఖ అనుమతులు లభించడం కష్టంగా ఉన్నందున.. గిరిజన రైతుల బోర్లకు వీటిని పరిశీలించాలని గిరిజన సంక్షేమ శాఖను కూడా కోరినట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement