Sunday, April 28, 2024

2 తెలుగు రాష్ట్రాలకు కేంద్రం పిలుపు విభజన సమస్యల పరిష్కారమే ఎజెండా..

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణకు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి కేంద్రం మరోసారి చొరవ తీసుకుంది. అపరిష్కృత విభజన సమస్యలు, వివాదాల పరిష్కారం కోసం జనవరి 12న ఢిల్లీకి రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ లేఖ పంపింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి హాజరు కావాలని రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను కోరింది. కేంద్ర హోంశాఖ అండర్ సెక్రటరీ లలిత పేరిట విడుదలైన ఈ లేఖలో విభజన సమస్యలనే సమావేశ ఎజెండాగా పేర్కొన్నారు. జనవరి 12న ఉదయం గం. 11.00 లకు ఇద్దరు ప్రధాన కార్యదర్శులు హాజరవ్వాలని కోరారు.

విభజన జరిగి 8 ఏళ్లు పూర్తికావొస్తున్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల పంచాయితీ ఇప్పటికీ కొలిక్కి రాలేదు. తాజాగా కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసినప్పటికీ, ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించని వాతావరణం నెలకొంది. కృష్ణా జలాల విషయంలో వాటాలు తేల్చాలని తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతోంది. కృష్ణా వాటా తేలే వరకు ఉమ్మడి వాటా నుంచి 50:50 నిష్పత్తిలో పంచుకోవాలని సూచిస్తోంది. దీంతో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకంపైనా తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే, తెలంగాణలో నిర్మిస్తున్న పలు ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతోంది. ఈ క్రమంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల వద్ద జలవిద్యుత్తు ప్లాంట్ల నిర్వహణ విషయంలోనూ రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం సాగింది. పరస్పరం ఆరోపణలు, ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్లింది. దీంతో ఈ అంశాల గురించే జనవరి 12న జరిగే సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌ సైతం ఇంకా విభజనకు నోచుకోలేదు. ప్రస్తుతం ఉమ్మడి భవన్‌లో రెండు రాష్ట్రాలు గదులను పంచుకుని తాత్కాలికంగా సర్దుబాటు చేసుకున్నాయి. అయితే ఉమ్మడి భవన్‌లో పటౌడీ హౌజ్, నర్సింగ్ హాస్టల్ ప్రాంతాలు ఖాళీ స్థలాలుగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య భవన్ విభజన జరిగితే, ఖాళీ స్థలం పొందిన రాష్ట్రం కొత్త భవన సముదాయాన్ని నిర్మించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రం వెలుపల ఆస్తులను 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని విభజన చట్టంలో పేర్కొన్న నేపథ్యంలో, ప్రస్తుత భవనాలు, ఖాళీ స్థలాలను పంచుకోడానికి 3 రకాల ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. విభజన అనంతరం పలు దఫాలుగా సమావేశాలు జరిపి ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే గత కొన్నేళ్లుగా ఈ విషయంలో ఎలాంటి కదలిక లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వంతో పనుల కోసం ఢిల్లీకి వచ్చే రాష్ట్రాల మంత్రులు, అధికారులు, ఇతర రాజకీయ నాయకులకు వసతి విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉమ్మడి నిర్వహణలో ఉన్న భవనంలో సమన్వయ లోపం కారణంగానూ సమస్యలు ఏర్పడుతున్నాయి. వీలైనంత త్వరగా భవన్ విభజన జరిగితే, స్టాఫ్ క్వార్టర్స్ సహా కొత్తగా మరో భవన్ నిర్మాణం చేపట్టవచ్చని, తద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement