Wednesday, December 6, 2023

Delhi | విపక్ష కూటమిలో ఆధిపత్య పోరు.. చాలా రాష్ట్రాల్లో లుకలుకలు!

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విపక్ష కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్‌(ఇండియా)లో ఆధిపత్యం కోసం భాగస్వామ్య పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌కు సీట్ల సర్దుబాటు, పంపకం విషయంలో పెత్తనం ఇచ్చేందుకు ప్రాంతీయ పార్టీలు సుముఖంగా లేవు. ఢిల్లీని గెలవాలంటే యూపీని గెలవాలన్నది రాజకీయాల్లో ఉన్న నానుడి. అలాంటి ఉత్తర్ ప్రదేశ్‌లోనే ఈ పరిస్థితి తలెత్తింది. ఆ రాష్ట్రంలో సీట్ల పంపంకంపై నిర్ణయం తనదేనని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆదివారం ప్రకటించారు. “సీట్లు కోరడం లేదు.. ఇస్తున్నాను” అంటూ వ్యాఖ్యానించడం ద్వారా తన ఉద్దేశమేంటో తేల్చి చెప్పారు. ఏ రాష్ట్రం సంగతెలా ఉన్నా.. యూపీలో మాత్రం సీట్ల పంపకంలో నిర్ణయాధికారం తనదేనని పరోక్షంగా వెల్లడించారు.

- Advertisement -
   

లోక్‌సభలో పార్టీల సంఖ్యాబలం ప్రకారం చూస్తే విపక్ష కూటమిలో కాంగ్రెస్‌ పెద్ద పార్టీ. ఆ తర్వాతి స్థానాల్లో డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, జేడీ(యూ) తదితర పార్టీలున్నాయి. సమాజ్‌వాదీ గెలుచుకున్న స్థానాలు 3 మాత్రమే. ఈ లెక్కన చూస్తే జాతీయస్థాయిలో సమాజ్‌వాదీ చాలా చిన్న పార్టీ. కానీ ఉత్తర్‌ప్రదేశ్ లో ఎవరి బలం ఎంత అన్నది లెక్కిస్తే.. విపక్ష కూటమిలో సమాజ్‌వాదీ పార్టీదే పెదన్న పాత్ర. మొత్తం 403 స్థానాలున్న అసెంబ్లీలో అధికార కూటమి 280 స్థానాల్లో గెలుపొందగా.. 108 స్థానాలతో సమాజ్‌వాదీ పార్టీయే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఈ రాష్ట్రం నుంచి విపక్ష కూటమిలో ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) 9 స్థానాల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. గత కొన్ని దశాబ్దాలుగా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభావం నామమాత్రంగా కూడా లేదు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పోటీ చేసే నియోజకవర్గాలైన రాయ్ బరేలీ, అమేథీలో తప్ప కాంగ్రెస్ ప్రభావం మిగతా ప్రాంతాల్లో పెద్దగా ఎక్కడా కనిపించదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అమేథీ స్థానాన్ని కూడా కోల్పోయింది. జాతీయపార్టీగా ఉండడం, లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీల్లో పెద్దది కావడం ఒక్కటే కూటమిలో పెద్దన్న పాత్ర పోషించడానికి దోహదపడుతున్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ సారథ్యాన్ని ఇష్టపడని రాజకీయ పార్టీలు ఆ కూటమిలో ఉన్నాయి. అలాంటి పార్టీ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏమాత్రం బలం లేకపోయినా సీట్ల పంపకంలో నిర్ణయాధికారాన్ని తీసుకుంటానంటే ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్‌వాదీ ఎలా ఒప్పుకుంటుంది? అందుకే అఖిలేష్ యాదవ్ ఆరకమైన ప్రకటన చేశారు.

యూపీలో బలాబలాలు
ఉత్తర్‌ప్రదేశ్ ప్రతిపక్షంలో సమాజ్‌వాదీ తర్వాత ప్రాంతీయ పార్టీల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి ఓటుబ్యాంకు ఎక్కువగా ఉంది. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే.. అధికార భారతీయ జనతా పార్టీకి 41.29 శాతం సాధించగా.. 32.06 శాతం ఓట్లతో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేతృత్వంలోని కూటమి రెండో స్థానంలో నిలిచింది. 12.88 శాతం ఓట్లతో బహుజన్ సమాజ్ పార్టీ మూడో స్థానంలో నిలవగా.. కాంగ్రెస్ కేవలం 2.33 శాతం ఓట్లు సాధించింది. సమాజ్‌వాదీతో జట్టకట్టిన పార్టీల్లో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) ప్రభావం పశ్చిమ యూపీ జాట్ జనాభా ఎక్కువగా ప్రాంతాల్లో ఉంది. తాజాగా ఏర్పడ్డ విపక్ష కూటమిలో ఎస్పీ, ఆర్ఎల్డీ, కాంగ్రెస్‌తో పాటు అప్నాదళ్ (కృష్ణపటేల్ వర్గం), దళిత ఉద్యమనేత చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఉన్నారు. వీటిలో కాంగ్రెస్ బలం ఆర్ఎల్డీ కంటే కూడా తక్కువ అని చెప్పొచ్చు.

అందుకే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ యూపీలో మాత్రం తనదే పైచేయిగా ఉండాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌కు ఏ కాస్త అవకాశం ఇచ్చినా ఆ పార్టీ తిరిగి బలం పుంజుకుంటుందని ఆయన భయపడుతున్నారు. ఇందుక్కారణం లేకపోలేదు. రాష్ట్రంలో ముస్లిం ఓటర్లు గతంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా, బలమైన ఓటుబ్యాంకుగా ఉండేవారు. 90వ దశకం తర్వాత ఆ ఓటుబ్యాంక్ సమాజ్‌వాదీ పార్టీకి తరలివచ్చింది. జాతీయస్థాయిలో బీజేపీపై వ్యతిరేకతతో ముస్లిం ఓటర్లు కాంగ్రెస్‌వైపు తరలిపోయే ప్రమాదం ఎలాగూ పొంచి ఉంది. ఈ స్థితిలో ఆ పార్టీకి పెత్తనం అప్పగిస్తే ఇక తమ ఓటుబ్యాంకు గల్లంతైపోతుందని అఖిలేష్ ఆందోళన చెందుతున్నారు.

ప్రాంతీయ పార్టీల ప్రతిఘటన

యూపీలోని మొత్తం 80 లోక్‌సభ నియోజకవర్గాల్లో 12 సీట్లలో పోటీ చేసేందుకు ఆర్‌ఎల్‌డీ సిద్ధమవుతుండగా, కాంగ్రెస్ ఓ 25 స్థానాలను గుర్తించింది. ఆర్ఎల్డీ, కాంగ్రెస్ కలిసి దాదాపు సగం స్థానాలు పంచుకుంటే సమాజ్‌వాదీకి మిగిలేవి మిగతా సగం సీట్లు మాత్రమే. అందుకే సీట్ల పంపకాల ఫార్ములాను తన చేతుల్లోనే ఉంచుకోవాలని అఖిలేష్ యాదవ్ భావిస్తున్నారు. కనీసం 50 నుంచి 55 స్థానాల్లో పోటీ చేయాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. కాంగ్రెస్‌కు పెత్తనం ఇస్తే 40 సీట్లకు మించి దక్కే పరిస్థితి కనిపించడం లేదు. జాతీయస్థాయిలో కూటమిలో సీట్ల పంపకం ఫార్ములా ఇంకా ఖరారు కానప్పటికీ, 2024 ఎన్నికల్లో పోటీ కోసం టికెట్లు ఆశిస్తున్న పార్టీ నేతలకు అఖిలేష్ యాదవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌లుగా ఆశావహులను నియమించడం ద్వారా పరోక్షంగా వారిని అభ్యర్థులుగా ప్రకటించారు.

ఆ ఇంచార్జులు ఏకంగా ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా నియోజకవర్గాల్లో నిత్యం రాజకీయ కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు. ఇదంతా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే సంకేతంగానే రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. జాతీయస్థాయిలో ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి బీజేపీని గద్దె దించడం కోసం చేతులు కలపడం వరకు సరే, కానీ సొంత గడ్డపై పట్టు కోల్పోడానికి మాత్రం ససేమిరా అన్నట్టుగా సమాజ్‌వాదీ వ్యవహరిస్తోంది. పెద్ద రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే.. విపక్ష కూటమిలో బలమైన ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న బిహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇక ఎలాంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించుకోవచ్చు. బిహార్ సీఎం – జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్, బెంగాల్ సీఎం – తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఏకంగా తాము ప్రధాని రేసులో ఉన్నామని పరోక్ష సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. స్టాలిన్ ఆ రాష్ట్రంలో బలమైన నేతగా ఉన్నారు. ఈ ముగ్గురూ తమ తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పెత్తనాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునే అవకాశం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement