Sunday, April 28, 2024

సీసీటీవీ కెమెరా నిఘాలో టెట్‌ పరీక్ష.. 2052 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈనెల 15న టెట్‌ (టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌) పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. సీసీటీవీ కెమెరాల నిఘాలో పరీక్షను నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను విద్యాశాఖ చేసింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరగనుంది. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2052 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్‌-1కు 1139 పరీక్షా కేంద్రాలు, పేపర్‌-2 నిర్వహణ కోసం 913 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

అయితే పేపర్‌-1 పరీక్షకు 2,69,557 మంది అభ్యర్థులు హాజరుకానుండగా, పేపర్‌-2 పరీక్షకు 2,08,498 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. మొత్తంగా 4,78,055 మంది అభ్యర్థులు టెట్‌ పరీక్షను రాయనున్నారు. ప్రతీ పరీక్షా కేంద్రానికి ఒకరు చొప్పున మొత్తం 2052 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌ అధికారులను నియమించారు. అలాగే 2052 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్స్‌, 22,572 మంది ఇన్విజిలేటర్లు, 10,260 మంది హాల్‌ సూపరింటెండెంట్లు పరీక్ష విధులు నిర్వహించనున్నారు.

అంతేకాకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు సీసీటీవీ కెమెరాలను చీఫ్‌ సూపరింటెండెంట్‌ గదుల్లో ఏర్పాటు చేయాలని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సజావుగా జరిగేలా, విద్యుత్‌ అంతరాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వైద్య సిబ్బంది, ఓఆర్‌ఎస్‌ పాకెట్లు, మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునేలా ఆయా రూట్లల్లో బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ సంస్థను విద్యాశాఖ అధికారులు కోరారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. పరీక్షలు సజావుగా జరిగేలా డిస్ట్రిక్ట్‌ లెవల్‌ అబ్జర్వర్లు నియమించారు.

- Advertisement -

పరీక్షా కేంద్రాలకు ముందే చేరుకోండి….

అప్పటికప్పుడు పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు చేరకుండా ఒక రోజు ముందుగానే తమ తమ పరీక్షా కేంద్రాలను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష సమయానికి కనీసం ఒక గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. అంటే 8.30లోగా చేరుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమవెంట రెండు బాల్‌పాయింట్‌ బ్లాక్‌ పెన్నులు, హాల్‌టికెట్‌ తెచ్చుకోవాలన్నారు. మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, బ్యాగులు, ఇతర వస్తువులులోనికి అనుమతించబడవని సూచించారు. హాల్‌టికెట్‌పై ఉన్న నిబంధనలను తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు.

ఓఎంఆర్‌ షీట్‌ను మలవకూడదని, ఎలాంటి పిన్నులు కొట్టకూడదని సూచించారు. ఆన్సర్‌ పెట్టేటప్పుడు ఓఎంఆర్‌ షీట్‌పైన ఉండే సర్కిల్‌ను పూర్తిగా షేడ్‌ చేస్తేనే దాన్ని పరిగణలోకి తీసుకుంటారని అధికారులు తెలిపారు. పేరులో స్వల్ప అక్షర దోషాలు, వివరాలు సరిగా లేకుంటే పరీక్ష హాలులో నామినల్‌ రోల్‌ కమ్‌ ఫోటో ఐడెంటిటీలో సవరించుకోవాలి. హాల్‌టికెట్‌పైన ఫోటో, సంతకం సరిగా లేకపోతే ఫోటోను అతికించి గెజిటెడ్‌ అధికారితో అటెస్టేషన్‌ చేయించుకొని, తమ ఆధార్‌ కార్డు, ఇతర ఐడీతో సంబంధిత జిల్లా డీఈవోలను సంప్రదించాలి. డీఈవో అనుమతితో పరీక్షకు అనుమతిస్తారు.

విద్యాసంస్థలకు సెలవులు….

ఈనెల 15న టెట్‌ పరీక్ష జరగనున్న నేపథ్యంలో పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలకు విద్యాశాఖ సెలవులను ప్రకటించింది. 14వ తేదీన హాఫ్‌ డే సెలవు ఇవ్వగా, పరీక్షా రోజైన 15న పూర్తి సెలవు ప్రకటించారు. ఈమేరకు విద్యాశాఖ బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్‌ బోర్డు సైతం సెలవులను ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే టీఎస్‌ టెట్‌-2023 నోటిఫికేషన్‌ ఈ ఏడాది ఆగస్టు 1న విడుదలవగా, ఆగస్టు 2 నుంచి 16 వరకు దరఖాస్తులను స్వీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement