Thursday, May 9, 2024

TS | టెట్‌ పరీక్షా కేంద్రాలు బ్లాక్‌.. గడువు పెంచాలంటున్న అభ్యర్థులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) కోసం పరీక్షా కేంద్రాల ఎంపిక అవకాశాన్ని కొన్ని జిల్లాల్లో నిలిపివేశారు. దరఖాస్తు చేసుకునేందుకు మరో రెండు రోజులు గడువు ఉండగానే పలు జిల్లాల్లోని పరీక్షా కేంద్రాలను బ్లాక్‌ చేశారు. మొత్తం 6 జిల్లాలను (మంగళవారం సాయంత్రం వరకు) బ్లాక్‌ చేశారు. సోమవారం నాడు హైదరాబాద్‌, వికారాబాద్‌, ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాలను బ్లాక్‌ చేయగా, మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను బ్లాక్‌ చేశారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

బ్లాక్‌ చేసిన జిల్లాలను పరీక్షా కేంద్రాల జాబితా నుంచి తొలగించారు. గడువు ఉండగానే ఆ ఆరు జిల్లాల్లోని పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు అవకాశం లేకుండా బ్లాక్‌ చేయడంతో అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు టెట్‌ పరీక్ష ఎంత మంది రాస్తారన్న అంశంపై సంబంధిత అధికారులు అంచనా వేయలేకపోయారు. దరఖాస్తులకు అనుగుణంగా జిల్లాల్లో తక్కువ పరీక్షా కేంద్రాల ఏర్పాటు సంఖ్య అభ్యర్థులను ఇబ్బందుల్లో పడేసింది. బుధవారం సాయంత్రంతో టెట్‌కు గడువు ముగియనుంది.

- Advertisement -

మంగళవారం మధ్యాహ్నం వరకు దాదాపు 2.45 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. గత సంవత్సరం 3,79,101 దరఖాస్తులు వచ్చాయి. గతేడాది కూడా ఈ విధంగానే పరీక్షా కేంద్రాలను బ్లాక్‌ చేశారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి దరఖాస్తులు సంఖ్య చాలా తక్కువగానే ఉంది. బుధవారం సాయంత్రం వరకు గడువు ఉండడంతో దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఎంతలేదన్నా కూడా 3 లక్షల లోపే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

గతేడాదంటే అంచనాలకు మించి దరఖాస్తులు రావడంతో పరీక్షా కేంద్రాలను బ్లాక్‌ చేశారనుకోవచ్చు. ఈసారి తక్కువగానే దరఖాస్తులు వచ్చినా ఎందుకు బ్లాక్‌ చేశారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అయితే అనుకున్నదానికంటే సెంటర్ల పరిమితి మించడంతోనే జిల్లాలను బ్లాక్‌ చేశామని అధికారుల వాదన. పరీక్షా కేంద్రాలు కేటాయించలేనంతగా సామర్థ్యానికి మించి టెట్‌ దరఖాస్తులు వచ్చినట్లుగా వారు చెబుతున్నారు.

మరోవైపు ఎడిట్‌ ఆప్షన్‌ (దరఖాస్తుల సవరణ) ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఒక్కొక్కరు రెండేసి సార్లు దరఖాస్తు చేసుకుంటున్నారు. టెట్‌ దరఖాస్తులకు ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చి గడువును మరో రెండు మూడు రోజులు పెంచాలని కోరుతున్నారు. 50 వేలు నుంచి లక్ష వరకు అభ్యర్థులు టెట్‌కు ఇంకా దరఖాస్తు చేసుకోలేదని డీఎడ్‌ బీఎడ్‌ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌ రెడ్డి తెలిపారు.

చాలా మంది అభ్యర్థులు టెట్‌ దరఖాస్తు చేసుకున్నప్పుడు కొన్ని తప్పులు దొర్లాయి. దీంతో వారికి సరిచేసుకునే అవకాశాన్ని ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. పరీక్షా కేంద్రాలను బ్లాక్‌ చేయడంతో వేలాది మంది అభ్యర్థులు తమ సొంత జిల్లాలను వదిలి పరీక్ష రాసేందుకు చాలా దూరపు జిల్లాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతారన్నారు. బ్లాక్‌ చేసిన జిల్లాలను తిరిగి కేటాయించాలని డిమాండ్‌ ఆయన చేశారు. టెట్‌ అప్లికేషన్‌ పూర్తి చేశాక దరఖాస్తు డౌన్‌లోడ్‌ కావడంలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement