Saturday, April 27, 2024

Telangana | రెన్యూయెెబుల్‌ ఎనర్జీ ఉత్పత్తిలో తెలంగాణ గ్రేట్​.. బీజేపీ రాష్ట్రాల కంటే ముందు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రెన్యూయెబుల్‌ ఎనర్జీ(పునరుత్పాధక విద్యుత్‌) ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం మరో గొప్ప ఘనత సాధించిందని టీఎస్‌ రెడ్కో చైర్మన్‌ వై.సతీష్‌ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2వేల మెగావాట్ల టార్గెట్‌ ఇవ్వగా, ఈ ఏడాది వరకు తెలంగాణ 5078.73 మెగావాట్ల పునరుత్పాధక విద్యుత్‌ ను ఉత్పత్తి చేస్తోందని ఆయన చెప్పారు. కేంద్రం నిర్దేశించిన లక్ష్యానికన్నా 254 శాతం అదనంగా పునరుత్పాధక విద్యుత్‌ ఉత్పత్తిని సాధించడం గర్వకారణంగా ఉందని బుధవారం ఆయన తెలిపారు. కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు ఇచ్చిన రెన్యూయెబుల్‌ ఎనర్జీ లక్ష్యాన్ని చేరుకోవడంలో బీజేపీ పాలిత రాష్ట్రాలే చతికిలబడ్డాయని ఆయన విమర్శించారు.

గుజరాత్‌ 108 శాతం, కర్నాటక 110 శాతం మాత్రమే అదనంగా ఉత్పత్తి చేయగా.. తెలంగాణ మాత్రం అద్భుతంగా పనిచేసి 254 శాతం అదనంగా ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర మాత్రం రెన్యూయెబుల్‌ ఎనర్జీ ఉత్పత్తిలో పూర్తిగా వెనకబడి ఉండిపోయాయన్నారు. ఫలితంగా దేశం.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేక పోయిందన్నారు.

తెలంగాణ మాత్రం దేశంలో కర్బన ఉద్గారాలు తగ్గించే లక్ష్యంతో.. ముందుకెళ్లుతోందని సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. ఎలాంటి భేషజాలు లేకుండా తెలంగాణ ప్రభుత్వం దేశం కోసం పనిచేస్తోందన్నారు. సీఎం కేసీఆర్‌ మార్గదర్శనంలోనే రాష్ట్రం ఈ ఘనత సాధించిందన్నారు. కేసీఆర్‌ విజన్‌తో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్‌ వన్‌ గా నిలుస్తోందని, తెలంగాణ ఒక స్టార్టప్‌ స్టేట్‌ గా మారిందన్నారు. పునరుత్ఫాదక విద్యుత్‌లో మన రాష్ట్రం ఘనత సాధించడానికి మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డిల కృషి ఉందని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement