Friday, April 26, 2024

ఢిల్లీలో తెలంగాణ తరహా ఆపరేషన్, ఆప్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. అమిత్‌ షాను అరెస్ట్ చేయాలన్న సిసోడియా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆపరేషన్ లోటస్ పేరుతో ఏకంగా కేంద్ర హోంమంత్రే ఎమ్మెల్యేల కొనుగోళ్లకు యత్నిస్తే దేశానికి ఇంతకు మించిన ప్రమాదం మరేదీ లేదని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ధ్వజమెత్తారు. శనివారం ఆయన ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ ఆపరేషన్ లోటస్ పేరుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రజల మద్దతుతో గెలిచిన ప్రభుత్వాలను ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా బీజేపీ కూల్చే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో చోటు చేసుకున్న ఇలాంటి ఓ ఘటనకు సంబంధించిన మూలాలు ఢిల్లీలో బయటపడ్డాయని చెప్పుకొచ్చారు.

27వ తేదీన సైబరాబాద్‌ ప్రాంతంలో పోలీసులు దాడులు జరపగా బీజేపీకి చెందిన ముగ్గురు దళారులు డబ్బుతో పట్టుబడ్డారని మనీష్ సిసోడియా అన్నారు. ఆ బ్రోకర్లను మీకు చూపిస్తానంటూ ఆయన రామచంద్ర భారతి( సతీష్ శర్మ), నందుకుమార్, సింహయాజుల ఫొటోలను మీడియాకు ప్రదర్శించారు. వారు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలతో దిగిన ఫొటోలను చూపించారు. ఓ ఫామ్‌హౌజ్‌లో వంద కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వెళ్లి ఈ ముగ్గురు పట్టుబడ్డారని మనీష్ సిసోడియా వివరించారు. ఈ ఫొటోలను చూస్తే బీజేపీలో వారికి ఏ స్థాయిలో పరిచయాలున్నాయో అర్థమవుతుందన్నారు. ఈ ఘటన జరిగిన మర్నాడు 28వ తారీకున వీరి ఆడియో టేపులు బయటపడ్డాయని, రామచంద్ర భారతి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో సాగించిన కొనుగోళ్ల వ్యవహారం బయటపడిందని వివరించారు.

ఇంకా కొందరు ఎమ్మల్యేలను తీసుకొస్తాం, డబ్బులిస్తాం, పదవులిస్తాం, భద్రత కల్పిస్తామంటూ బీజేపీ బ్రోకర్లు హామీలు ఇచ్చిన విషయం కూడా ఆడియో టేపుల ద్వారా తెలిసిపోయిందన్నారు. బీజేపీలో నంబర్ 2 బీఎల్ సంతోష్ అనే విషయాన్ని బ్రోకర్లు ప్రస్తావించారని, సీబీఐ, ఈడీల గురించి ఆలోచించవద్దు. అంతా మేం చూసుకుంటామని భరోసానిచ్చిన విషయం కూడా బట్టబయలైందని సిసోడియా చెప్పారు. శనివారం బయటికొచ్చిన ఆడియో టేప్ ద్వారా… ఆప్‌కు చెందిన 43 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కూడా బీజేపీ ప్రయత్నిస్తోందనే విషయం తెలిసిందని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. దీనికి కావలసిన డబ్బు కూడా వారు సేకరించి పెట్టుకున్నట్టు అర్థమవుతోందన్నారు.

43 మంది ఆప్ ఎమ్మెల్యేలు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారని, ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేద్దామంటూ మాట్లాడిన ఆడియోను మనీష్ సిసోడియా మీడియా ముందు ప్రదర్శించారు. గంటసేపు షా, బీఎల్ సంతోష్‌లతో ఈ విషయంపై చర్చించినట్టు బ్రోకర్లు ఫోన్‌లో ఎమ్మెల్యేకు చెప్పారని మనీష్ సిసోడియా వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం తమ పార్టీకి చెందిన నేతలను కొనుగోలు చేసేందుకు బీజేపీ చేసిన యత్నాన్ని తాము బయటపెట్టామని ఆయన గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేతో మాట్లాడినట్టే ఆప్‌‌ను వదిలేయాలని తనతో కూడా బేరసారాలు నడిపారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో ఒకొక్కరికి పాతిక కోట్ల చొప్పున నలుగురికి వంద కోట్లు అయితే ఢిల్లీలో తమ ఎమ్మెల్యేల కొనుగోలుకు వెయ్యి 75 కోట్లు రెడీ చేశారంటే ఆ డబ్బు ఎక్కణ్నుంచి వచ్చింది? వారికి ఎవరిచ్చారు? ఆ సొమ్ము ఎక్కడుంది? తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలుకు పంపిన డబ్బు ఎవరిదని మనీష్ సిసోడియా ప్రశ్నించారు.

- Advertisement -

వీటన్నిటిపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. సంతోష్, షా అనే పేర్లు ఆడియో టేపుల్లో ప్రస్తావనకు వచ్చాయన్న ఆయన, వారు బీజేపీకి చెందిన వారేనా? షా అంటే అమిత్ షాయేనా? ఒకవేళ హోంమంత్రి అమిత్ షాయే అయితే ఇది ఈ దేశానికి అతి పెద్ద ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా ప్రస్తుతం దొరికిన ఆధారాలతో ఈడీ దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వేల కోట్ల రూపాయలను పోగేసి ఢిల్లీ, పంజాబ్‌లో ఎమ్మెల్యేలను కొనుగోలుకు విఫలయత్నం చేశారని, మరో 8 రాష్ట్రాల్లో ఆపరేషన్ లోటస్‌ను విజయవంతం చేశారని సిసోడియా తేల్చి చెప్పారు.

మరోవైపు తెలంగాణలో కొనుగోలు యత్నం తేటతెల్లమైందన్నారు. ఒకవేళ ఈ వ్యవహారంలో అమిత్ షా హస్తముంటే వెంటనే ఆయనను విచారణ జరిపి అరెస్ట్ చేయాలని మనీష్ సిసోడియా డిమాండ్ చేశారు. బ్రోకర్ల ఆడియో టేపుల్లో కేంద్ర హోంమంత్రి పేరు ప్రస్తావనకు రావడం దేశానికి ప్రమాదకరమని, దేశ భద్రతకు కూడా ముప్పని అభిప్రాయపడ్డారు. వెంటనే హోంమంత్రి ఆమిత్ షాను పదవి నుంచి కూడా తొలగించాలని సిసోడియా డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement