Tuesday, May 7, 2024

తెలంగాణ ప‌థ‌కాలు అద్భుతం అంటారు.. కానీ న‌యా పైసా ఇవ్వ‌రు : మంత్రి హ‌రీశ్ రావు

తెలంగాణ ప‌థ‌కాలు అద్భుత‌మ‌ని తియ్య‌టి మాట‌లు చెబుతారు.. అవార్డు ఇస్తారు కానీ న‌యా పైసా ఇవ్వ‌ర‌ని కేంద్ర స‌ర్కార్ పై మంత్రి హ‌రీశ్ రావు మండిప‌డ్డారు. తాగునీటి క‌ష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన మిష‌న్ భ‌గీర‌థకు ప్రోత్సాహ‌కాలు ఇవ్వ‌కుండా ప‌క్ష‌పాతం చూపుతుంద‌న్నారు. మిష‌న్ భ‌గీర‌థ‌కు రూ.13 వేల కోట్లు ఇవ్వాల‌ని నీతి ఆయోగ్ చెప్పినా 13 పైసలు కూడా ఇవ్వ‌లేద‌న్నారు. ఈ విధంగా తెలంగాణ‌కు కేంద్రం తీర‌ని అన్యాయం చేస్తున్న‌ది వాస్త‌వం కాదా? అని మంత్రి హ‌రీశ్ రావు నిల‌దీశారు. ఆరు జిల్లాల్లో మిషన్‌ భగీరథ నీళ్ల పంపిణీకి స్థిరీకరించేందుకు ఉపయోగపడే భారీ ప్రాజెక్టుకు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్ రావు మాట్లాడుతూ.. మిష‌న్ భ‌గీర‌థ స్కీంను మోదీ గ‌జ్వేల్‌లో ప్రారంభించి, అభినందించ‌లేదా? అని ప్ర‌శ్నించారు. మిష‌న్ భ‌గీర‌థ‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ నిధుల‌తోనే చేప‌ట్టిన‌ట్లు మంత్రి స్ప‌ష్టం చేశారు. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ నుంచి ఆరు జిల్లాల్లోని 10 నియోజ‌క‌వ‌ర్గాల్లోని 1922 గ్రామాల‌కు తాగునీరు అందిస్తామ‌న్నారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి కూడా మేలు జ‌ర‌గ‌బోతుంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 300 మిలియ‌న్ లీట‌ర్ల నీరు స‌ర‌ఫ‌రా అవుతుండ‌గా, ఇప్పుడు మ‌రో 300 మిలియ‌న్ లీట‌ర్ల నీటి స‌ర‌ఫరాకు అవ‌కాశం ఏర్ప‌డింది. భవిష్యత్‌లో పెరిగే హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల‌కు గ్రావిటీ ద్వారా నీటి స‌ర‌ఫ‌రా అవుతుంద‌న్నారు. భ‌విష్య‌త్ 50 ఏండ్ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఈ ప‌థ‌కాన్ని రూపొందించిన‌ట్లు మంత్రి హ‌రీశ్ రావు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement