Monday, April 29, 2024

పిల్లల సైబర్‌ కేసులు అదుపు చేయడంలో తెలంగాణనే టాప్.. ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పిల్లల్లో సైబర్‌ నేరాలను అదుపు చేయడంలో తెలంగాణ దేశంలోనే టాప్‌లో ఉంది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ ), 2021 నివేదిక ప్రకారం రాష్ట్రంలో అత్యల్పంగా సైబర్‌ కేసులు నమోదయ్యాయి. క్షణక్షణం కొత్తపుంతలు తొక్కుతున్న సైబర్‌ నేరాలు ప్రభుత్వాలను కలవరపరుస్తున్న విషయం తెలిసిందే. వాటిని అదుపు చేయడానికి ఒకవైపు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, టెక్నాలజీని ఉపయోగించి సైబర్‌ నేరస్తులు రెచ్చిపోతున్నారు. కోవిడ్‌ మహమ్మారి తర్వాత పిల్లల చేతుల్లోకి అనివార్యంగా మొబైల్‌ ఫోన్‌లు వచ్చాయి. విద్యార్థులు పాఠ్యాంశాలు, బోధనకు ఫోన్లను వినియోగించుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.

దీని వల్ల పిల్లలు కూడా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. పిల్లలకు సంబంధించి సైబర్‌ నేరాలను అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలు ఎంతో దోహదం చేస్తున్నాయి. పిల్లల్లో సైబర్‌ నేరాలను అరికట్టడంలో పోలీస్‌ శాఖ విజయవంతమైంది. ఈ శాఖాధికారులు తీసుకుంటున్న చర్యల మూలంగా నేరాల తగ్గుదల ఉంది.ఎన్‌సీ ఆర్‌బీ నివేదిక ప్రకారం దేశంలో పిల్లలపై సైబర్‌ నేరాలకు సంబంధించి దేశంలోనే అతి తక్కువ కేసులు తెలంగాణలో నమోదు కావడం విశేషం. రాష్ట్రంలో కేవలం 3 కేసులు మాత్రమే నమోదయ్యాయని ఆ నివేదిక పేర్కొంది. పిల్లల సైబర్‌ నేరాలకు సంబంధించి ఎన్‌సీఆర్‌బీ వెల్లడించిన నివేదిక ప్రకారం దేశం మొత్తం మీద 1081 కేసులు నమోదు కాగా వాటిలో కర్నాటకలో 164 కేసులు నమోదై అత్యధికంగా సైబర్‌ కేసులున్న రాష్ట్రంగా రికార్డులకెక్కింది.

- Advertisement -

అదే విధంగా కేరళ రాష్ట్రం 138 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 40, తమిళనాడులో 15, తెలంగాణలో కేవలం 3 మాత్రమే నమోదయ్యాయి. పాఠశాలల్లో పిల్లల భద్రత, సంరక్షణపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సూచించిన మార్గదర్శకాలను అమలు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మూలంగా పిల్లల నేరాలు అదుపులో ఉన్నాయని చెప్పవచ్చు. బాలల సంరక్షణకు సంబంధించి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. మానిటరింగ్‌ యాప్‌ ఫర్‌ సీమ్‌లెస్‌ ఇన్‌ఫెక్షన్‌ (ఎంఏఎస్‌ఐ) అనే పరికరాన్ని అభివృద్ధి చేసింది.

ఈ యాప్‌ ద్వారా తమ పరిధిలో ఉన్న పిల్లల పనితీరును సులువుగా తనిఖీ చేసేందుకు అవకాశం ఏర్పడింది. అంతేగాక ఆన్‌లైన్‌ డేటా అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా పిల్లలు తమ ఇళ్లు, పాఠశాలలకు రాకపోకలు చేస్తున్న సందర్భంగా వారి కదలికలను తెలుసుకునే వీలు కలుగుతోంది. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో పాఠశాలల పిల్లలకు ఆన్‌లైన్‌ తరగతులు మామూలయ్యాయి. ఈ సందర్భంగా పాఠ్యాంశాలతో పాటు వినోదం, ఇతరేత్రా కూడా పిల్లలు మొబైల్‌ ఫోన్లలో చూసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో డిజిటల్‌ రంగం ప్రభావం పిల్లలపై పడకుండా ఈ యాప్‌ కట్టడి చేస్తోంది.

అంతేగాక పిల్లలకు సంబంధించిన సమస్యలను సకాలంలో గుర్తించడం, పర్యవేక్షణ, సమాచారం పంచుకోవడం, పిల్లలకు సైబర్‌ భద్రతకు సంబంధించి అవగాహన కల్పించడంతో పాటు పోలీసులు, పిల్లల సంక్షేమం కోసం ఏర్పడిన సంస్థలు ప్రత్యేక దృష్టి సారించడంతో కేసుల నమోదు తగ్గిందని సంబంధిత పోలీస్‌ అధికారి చెప్పారు. కేవలం చట్టాల ద్వారా మాత్రమే కాకుండా పిల్లల ఆలోచన విధానంలో మార్పుకు కృషి జరగాల్సి ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా, మహిళలు , పిల్లలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాలరక్షక్‌ వాహనాలు, భరోసా సెంటర్లు, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు(ఎఫ్‌ టిఎస్‌సి) , పోక్సో కోర్టులను ఏర్పాటు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement