Tuesday, April 30, 2024

ఆయిల్‌పామ్‌ సాగులో దూసుకుపోతున్న తెలంగాణ.. ఏటా సగటున 60వేల ఎకరాల్లో కొత్తగా సాగు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆయిల్‌పామ్‌ సాగులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధిస్తోంది. ఏటికేడు ఆయిల్‌పామ్‌ సాగును పెంచుతున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1, 30, 463 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగవుతోంది. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణాన్ని 10లక్షల ఎకరాలకు పెంచాలని వ్యవసాయశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. గడిచిన ఏడాది రాష్ట్రంలో కొత్తగా 60, 023 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగ వుతోంది. ఈ ఏడాదిలో తెలంగాణ వ్యాప్తంగా లక్షా 20వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించడంతోపాటు వారికి ప్రోత్సహకాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా విధించుకుంది. దేశంలో పామ్‌ఆయిల్‌కు భారీ డిమాండ్‌ ఉండడం, పంట సాగుతో గణనీయమైన దిగుబడి సాధించడంతోపాటు దీర్ఘకాలం ఆదాయాన్ని సమకూర్చే పంట కావడంతో రైతులు ఈ పంటసాగు వైపు మళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో ఆయిల్‌పామ్‌ సాగు ఏటికేడు గణనీయంగా పెరుగుతోంది.

- Advertisement -

ఆయిల్‌పామ్‌ సాగుకు తెలంగాణ నేలలు అనుకూలంగా ఉన్నాయని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట సాగుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సోహిస్తోంది. ప్రస్తుతం దేశంలోకి భారీ ఎత్తున పామ్‌ ఆయిల్‌ దిగుమతి అవుతోంది. పామ్‌ఆయిల్‌ నూనె వాడకానికి సరిపోయేంత స్థాయిలో దేశంలో పంట సాగు కావడం లేదు. దీంతో పెద్ద ఎత్తున విదేశాల నుంచి పామ్‌ఆయిల్‌ను భారతదేశంలో దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా విదేశీ మారకద్రవ్యం భారీ ఎత్తున విదేశాలకు తరలిపోవడంతోపాటు తెలంగాణతోపాటు దేశ వ్యాప్తంగా వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. తాజా బడ్జెట్‌లో రూ.1000 కోట్లను కూడా ప్రతిపాదించింది.

ఆయిల్‌పామ్‌ సాగులో ప్రస్తుతం రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో అగ్రస్థానంలో ఉంది. గడిచిన సంవత్సరంన్నరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆయిల్‌పామ్‌ సాగు ఊపందుకుంది. ప్రతీ జిల్లాలో కనీసం 5 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యంగా వ్యవసాయశాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఆయ్‌ిపామ్‌ పంట నాటిన నాలుగేళ్ల తర్వాత కోతకు వస్తుందని, ఆ తర్వాత రైతుకు ప్రతి ఎకరాకు ఎకరాకు రూ.2లక్షల నుచి 3 లక్షల ఆదాయం రానుందని అధికారులు చెబుతున్నారు. ఎకరా విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ సాగు చేస్తే ‘సగటున 10వేల టన్నుల గెలల ఉత్పత్తి జరగనుందని, తద్వారా రైతుకు ఏటా గణనీయమైన ఆదాయం సమకూరనుందని వ్యవసాయశాఖ చెబుతోంది. ఆయిల్‌పామ్‌ పంట సాగు మొదలుపెట్టాక 30 ఏళ్ల వరకు మళ్లి పెట్టుబడి పెట్టే అవసరం ఉండదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మొక్కలు నాటినమూడేళ్ల వరకు అంతరపంటలు కూడా సాగు చేసుకోవచ్చని చెబుతున్నారు.

80శాతం సబ్సీడీపై డ్రిప్‌…

నాలుగేళ్ల వరకు ఏటా రూ.4200 ప్రోత్సాహం ఆయిల్‌పామ్‌ సాగు చేసే రైతులకు 80శాతం సబ్సీడీపై ప్రభుత్వం డ్రిప్‌ అందజేస్తోంది. ఎస్సీ,ఎస్టీ రైతులకు 100శాతం డ్రిప్‌ను మంజూరు చేస్తున్నారు. మొక్కలను సబ్సీడీపై ఉచితంగానే అందజేయడంతోపాటు ఆచరించాల్సిన సస్యరక్షణ చర్యలపై గ్రామాల్లోని రైతు వేదికల్లో రైతులకు అవగాహన కల్పిస్తోంది. ఆయిల్‌పామ్‌ కోతకు వచ్చేతవరకు 3 నుంచి నాలుగేళ్లపాటు రూ.4200 చొప్పున ప్రతి సంవత్సరం ప్రభుత్వం అందజేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement