Monday, September 25, 2023

Delhi | గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు.. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలో వేడుకలు : కిషన్‌రెడ్డి 

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర కీలకమని, రాష్ట్ర సాధన కోసం తమ పార్టీ పాల్గొనని ఉద్యమమే లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నొక్కి చెప్పారు. కాకినాడ తీర్మానం మొదలు రాష్ట్ర సాధన వరకు, ఆ తర్వాత రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీ సంపూర్ణ సహకారం అందిస్తోందని స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ గతేడాది కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఢిల్లీలో జరిపామని, ఈసారి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా గోల్కొండ కోటలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

2వ తేదీ ఉదయం 7 గంటలకు గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతో పాటు సాయుధ బలగాల పరేడ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో శంకర్ మహదేవన్, డాక్టర్ ఆనంద శంకర్ బృందం, మంజులా రామస్వామి బృందం ప్రదర్శనలు ఉంటాయన్నారు. సింగర్స్ మంగ్లీ, మధుప్రియలు తెలంగాణ సంప్రదాయాన్ని, ఉద్యమాన్ని ప్రతిబింబించే పాటలు పాడతారని కిషన్ రెడ్డి తెలిపారు. పాఠశాల విద్యార్థుల కోసం ‘ఖిలా ఔర్ కహానీ’ థీమ్ తో ‘పెయింటింగ్ – ఫొటో’ పోటీలు నిర్వహించామని వెల్లడించారు.

- Advertisement -
   

ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్ స్పూర్తితో అన్ని రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలను అన్నిచోట్లా జరుపుకునేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇందులో భాగంగా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను వివిధ రాష్ట్రాలలో నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ రాజ్‌భవన్‌లకు ఆయా రాష్ట్రాల్లో నివసించే తెలంగాణ ప్రజలను ఆహ్వానించి, గవర్నర్ల ఆధ్వర్యంలో వేడుకలు జరిపేలా ఏర్పాట్లు చేశామని వివరించారు. ఢిల్లీలోనూ లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలో ఉత్సవాలు జరుగుతాయన్నారు.

1200 మంది అమరుల త్యాగఫలితమే తెలంగాణ అని ఆయన గుర్తు చేశారు. పార్లమెంటులోనూ సుష్మాస్వరాజ్ నేతృత్వంలోని బీజేపీ నాటి అధికార కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ బిల్లు పెట్టే పరిస్థితి తీసుకొచ్చిందని కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర సాధన కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఆంధ్రప్రదేశ్ భవన్‌లో తాను నిరవధిక దీక్ష చేసిన విషయాన్నీ ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రస్తావించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ 9 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం అందించిన సహకారాన్ని వివరిస్తూ త్వరలోనే తెలంగాణ ప్రజల ముందు పూర్తి వివరాలతో ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. విభజన అంశాల పరిష్కారానికి కేంద్రం అన్నిరకాలుగా ప్రయత్నిస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. రాజ్యాంగబద్ధంగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న ఆయన, ఈ విషయంలో విభేదాలకు తావిచ్చేలా, ప్రజలను రెచ్చగొట్టేలా ఎవరూ వ్యాఖ్యానించకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు.

దక్షిణ భారతం-ఉత్తర భారతం అంటూ విభేదాలను ప్రోత్సహించేందుకు పనిచేస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం ‘ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్’ పేరుతో చేపడుతున్న కార్యక్రమాలు కనిపించడం లేదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తమిళనాడుకు చెందిన ‘సెంగోల్‌’ను పార్లమెంటులో ప్రతిష్టించడం, కాశీ-తమిళ్ సంగమం, తమిళ్-సౌరాష్ట్ర సంగమం, కాశీ-తెలుగు సంగమం, కశ్మీర్-తమిళ సంప్రదాయాలను కలిపిన ‘వితస్తా’ కార్యక్రమం వంటివెన్నో కేంద్ర ప్రభుత్వం చేపడుతోందని ఆయన వివరించారు. తెలంగాణలో బీజేపీ నేతల మధ్య విభేదాలే లేవని, కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ వివాదాలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. నాయకులు పార్టీకి ఎంత ముఖ్యమో, ప్రజల్లోనూ పార్టీని గెలిపించాలనే ఆలోచన అంతే ముఖ్యమని కిషన్ రెడ్డి అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement