Wednesday, May 15, 2024

చంద్రయాన్‌-3లో తెలంగాణ యువకుడు.. మిషన్‌ పేలోడ్స్‌లో పనిచేసిన కృష్ణ కమ్మరి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : శాస్త్ర సాంకేతిక విప్లవంలో ప్రపంచమే అబ్బురపోయేలా భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రాజెక్ట్‌ సక్సెస్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడు భాగస్వామ్యం పంచుకున్నారు. ఇది తెలుగు ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ వారికి గర్వకారణంగా భావిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లికి చెందిన కృష్ణ కుమ్మరి చంద్రయాన్‌-3 మిషన్‌లో పేలోడ్స్‌ (ఏహెచ్‌వీసీ), (ఐఎల్‌ఎస్‌ఏ)కి డేటా ప్రాసెసింగ్‌ సాప్ట్‌ వేర్‌ రాశారు. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ కొడుకుని ఉన్నత చదువులు చదివించారు.

కృష్ణ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలలోనే కొనసాగింది. అనంతరం ఈ సెట్‌ రాసి హైదరాబాదులో కంప్యూటర్‌ సైన్స్‌ చదివాడు. ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం రావడంతో అక్కడ పని చేస్తూనే ఇస్రోలో ఐసీఆర్బీ రాసి ఆలిండియా స్థాయిలో 4వ ర్యాంకు తెచ్చుకున్నారు. అనంతరం 2018 జనవరిలో సైంటిస్ట్‌ లెవల్‌ ఉద్యోగం పొందారు. గ్రూస్‌-ఏ గెజిటెడ్‌ అధికారి, యూఆర్‌ రావు ఆధీనంలోని ఇస్రో శాటిలైట్‌ సెంటర్‌లో తెలంగాణ ముద్దుబిడ్డ కృష్ణ కుమ్మరి విధులు నిర్వర్తిస్తున్నారు.

ఈ క్రమంలోనే చంద్రయాన్‌-3 సాంకేతిక విభాగంలో పనిచేసేందుకు కృష్ణకు అవకాశం అభించింది. ఈ ప్రాజెక్ట్‌లో అనేక కేంద్రాలు పనిచేశాయి. మిషన్‌ లోని 2 పేలోడ్స్‌లో ఐదుగురు సభ్యులు పని చేస్తే, కృష్ణ డేటా ప్రాసెసింగ్‌ అనాలసిస్‌ సాప్ట్‌ వేర్‌ రాసినట్లు తెలిపారు. చంద్రయాన్‌ 3 మిషన్‌కు 6 నెలల పాటు పని చేసినట్లు ఆయన వివరించారు. ఈ ప్రాజెక్ట్‌ 100 శాతం విజయవంతం అవుతుందని గట్టిగా నమ్మిన వ్యక్తుల్లో కృష్ణ ఒకరు. తనకు ఐదేళ్ల వయస్సులో పోలియో సోకి నరాలు చచ్చుబడ్డాయని ఆయన తన వ్యక్తిగంత గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు.

- Advertisement -

దీనికి ఆయుర్వేద వైద్యంలో చికిత్స తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు రామేశ్వర్‌రెడ్డి వద్ద 10 సంవత్సరాల పాటు చికిత్స చేయించుకున్నానని, ఆ తరువాతే తన పనులు తాను చేసుకునే వాడినని తెలిపారు. దాదాపు 23 ఏళ్ల పాటు ఆయుర్వేద మందులు వాడినట్లు చెప్పారు. తల్లిదండ్రులు జన్మనిస్తే, వైద్యుడు పునర్జన్మనిచ్చారని.. అనంతరం ప్రపంచం గర్వించదగిన చంద్రయాన్‌-3 సక్సెస్‌లో పనిచేసే అవకాశం లభించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement