Saturday, April 27, 2024

క్రీడల హబ్‌గా తెలంగాణ, గ్రామీణ ప్రాంతాలపై ఫోకస్‌.. స్టేడియాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు

హైదరాబాద్‌: రాష్ట్రాన్ని క్రీడల హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పలు అభివద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని శాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి వెల్లడించారు. ప్రతిభ, పట్టుదల, క్రమశిక్షణ గల క్రీడాకారులకు రాష్ట్రంలో కొదవ లేదని.. పాఠశాల స్థాయిలోనే వీరిని గుర్తించి.. మెరుగైన శిక్షణ ఇప్పిస్తే అద్భుతాలు సృష్టించవచ్చునని చెప్పారు. రాష్ట్రంలో క్రీడాకారుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన తెలియజేశారు.

హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌తో పాటు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో గల వాలీబాల్‌ అకాడమీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సైక్లింగ్‌ వెలోడ్రమ్‌, గచ్చిబౌలిలోని శాట్స్‌ షూటింగ్‌ రేంజ్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌లోని స్పోర్ట్స్‌ స్కూల్స్‌ ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులైన పేద క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత శిక్షణ, వసతి సదుపాయం కల్పిస్తోందని తెలిపారు. సమీప భవిష్యత్‌లో తెలంగాణ నుంచి పీటీ ఉషా, కరణం మల్లిశ్వరీ, నీరజ్‌ చోప్రా, నిఖత్‌ జరీన్‌ వంటి క్రీడాకారులు ఉద్భవిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ క్రీడా ప్రాంగణాలు

ప్రతిభావంతులైన వర్ధమాన క్రీడాకారులను గ్రామీణ స్థాయి నుంచి వెలికి తీసేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీలోనూ తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు అంకురార్పణ జరిగిందని చెప్పారు. రాష్ట్రంలోని బాలబాలికలు, యువతకు ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచేందుకు క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.5 లక్షలు కేటాయించిందని.. ఇప్పటికే చాలా క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి వచ్చాయని వెంకటేశ్వరెడ్డి తెలిపారు.

- Advertisement -

గజ్వేల్‌ స్పోర్ట్స్‌ విలేజ్‌..

హైదరాబాద్‌ వంటి మహా నగరంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు కూడా అధునాతన క్రీడా మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గజ్వేల్‌ స్పోర్ట్స్‌ విలేజ్‌ ఆలోచనకు అంకురార్పణ పడింది. ఇందుకోసం ఇప్పటికే మంత్రి హరీశ్‌ రావు సహకారంతో 20 ఎకరాల స్థలం కూడా కేటాయించడం జరిగింది. ఈ స్పోర్ట్స్‌ విలేజ్‌ నిర్మాణం కోసం రూ.50 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఫుట్‌బాల్‌, హాకీ, రెజ్లింగ్‌, అథ్లెటిక్స్‌తో సహా 18కి పైగా క్రీడాంశాలకు తగ్గట్టుగా ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నాం’ అని వెంకటేశ్వర్‌ రెడ్డి చెప్పారు.

అల్లిపురంలో ఇండోర్‌ స్టేడియం

మ#హబూబ్‌నగర్‌ జిల్లా దేవరక్రద నియోజకవర్గం, సీసీ కుంట మండలం అల్లిపురంలో దాదాపు రూ.1.59 కోట్ల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో మినీ ఇండోర్‌ స్టేడియంను నిర్మించామని చెప్పారు. ఉడెన్‌ ఫ్లోర్లు గల నాలుగు బ్యాడ్మింటన్‌ కోర్టులు, 2 టేబుల్‌ టెన్నిస్‌ బోర్డులు, సింథటిక్‌ కబడ్డీ కోర్టు, చెస్‌, జిమ్నాస్టిక్స్‌తోపాటు బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌ కోర్టును ఏర్పాటు చేశాం. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, స్థానిక ఎంపీ ఎం.శ్రీనివాస్‌ రెడ్డి సహకారంతో త్వరలో రూ.50 లక్షల వ్యయంతో బాక్సింగ్‌, వెయిట్‌ లిప్టింగ్‌, జిమ్‌ హాల్స్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు వెంకటేశ్వర్‌ రెడ్డి తెలిపారు.

కార్పొరేట్‌ సంస్థల సహకారంతో..

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సాప్ట్‌nవేర్‌ కంపెనీలు, కార్పొరేట్‌ సంస్థలు ఒక్కో క్రీడను దత్తత తీసుకుంటే రాష్ట్రంలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. నూతన స్పోర్ట్స్‌ పాలసీ అమల్లోకి వచ్చాక హరియాణా, ఒడిశా రాష్ట్రాలను అధిగమించి తెలంగాణ దేశ క్రీడా రంగంలో అగ్రభాగాన నిలుస్తుందని వెంకటేశ్వర్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement