Thursday, May 9, 2024

Big story : గ్రూప్‌-4 నోటిఫికేషన్లపై సాంకేతిక సమస్యలు.. మరోసారి తెరపైకి జాబ్‌ క్యాలెండర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గ్రూప్‌ -4 ఉద్యోగాల భర్తీ ప్రకటించినట్లుగా నియామకాలు చేపట్టేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 80039 ఖాళీల భర్తీలో 9168 గ్రూప్‌ -4 ఖాళీలనూ పూరించేందుకు ఆమోదం తెలిపింది. అయితే రెవెన్యూ శాఖలోని వీఆర్వోలను రెవెన్యూలో రద్దు చేసిన ప్రభుత్వం వారిని అర్హత ఆధారంగా వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. అయితే 9168 గ్రూప్‌-4 ఖాళీల భర్తీకి ఇప్పుడు ఇది కొంత అడ్డంకిగా మారిందని తెలుస్తోంది. గతంలో శాఖల వారీగా గుర్తించిన గ్రూప్‌-4 పోస్టులలో కొన్ని వీఆర్వోల సర్దుబాటుతో ఫిల్‌ అయ్యాయి. కొన్ని చోట్ల గ్రూప్‌-2 పోస్టులు కూడా ఇలా భర్తీ అయినట్లు సమాచారం. గ్రూప్‌-4, గ్రూప్‌-2, 3 పోస్టుల్లో అర్హతల ఆధారంగా పలు శాఖల్లో వీఆర్వోలను సర్దుబాటు చేశారు. ఇప్పటివరకు ఒక పోస్టుల ఖాళీగా చూపిస్తే ఒకటి డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కింద ఖాళీగా చూపించేవారు. అయితే ఇప్పుడా ఖాళీ వీఆర్వో సర్దుబాటుతో భర్తీ కావడంతో ఖాళీ పోస్టుతోపాటు శాఖాపరంగా రావాల్సిన పదోన్నతి పోస్టు కూడా ఖాళీల్లో లేకుండా పోయింది. దీంతో పలు శాఖల్లో ఖాళీలు పూర్తయినట్లు సాంకేతికంగా తెలుస్తోంది.

కాగా ఇటీవలే ప్రభుత్వం వీఆర్వోలను ఇతర శాఖల్లోకి సర్దుబాట్లు చేసింది. దీంతో రెవెన్యూ శాఖలో 6874 పోస్టులు తగ్గిపోయాయి. ఇతర శాఖల్లో ఈ పోస్టులను సర్దుబాటు చేయడంతో అంత మేర ఖాళీలు భర్తీ అయినట్లుగా స్పష్టమవుతోంది. ఇవే కాకుండా ఇతర కారణాలతో గ్రూప్‌-4లో 13వేలకుపైగా పోస్టులు తగ్గిపోతున్నట్లుగా సమాచారం. రెవెన్యూ శాఖలో కూడా గ్రూప్‌-2, గ్రూప్‌ 4 ఖాళీలు మొదట్లో 6వేలకుపైగా ఖాళీలున్నాయని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఈ ఖాళీలు, 6వేల వీరాఓల సరర్దుబాటుతో ఇతర శాఖల్లోనూ అంతమేర ఖాళీలు భర్తీ ఆకవడంతో పోస్టుల ఖాళీ అనే అంశం స్పష్టత లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలో త్వరగా గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేయాలనే ప్రభుత్వ సంకల్పానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. గత మూడు నెలలుగా ప్రభుత్వం చేస్తున్న కసరత్తుకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. గత నెల 29నాటికి ఖాళీల సంఖ్యతో కూడిన జాబితాను సీఎస్‌ కోరారు. కానీ వీఆర్వోల సర్దుబాటు తర్వాత తలెత్తిన సమస్యల కారణంగా ఈ అంశంలో జాప్యం తప్పలేదు. పలు శాఖలు, విభాగాలు, జిల్లాల వారీగా సీఎస్‌కు చేరిన జాబితాల్లో తమ శాఖలో ఖాళీలు లేవని పేర్కొంటూ సమాచారమిచ్చారు. ఇదే తుది జాబితాలో చేర్చుతూ నివేదిక అందించడంతో కొంత అయోమయం నెలకొంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సర్దుబాట్లను కొత్త జోనల్‌ విధానంలో పూర్తి చేసిన ప్రభుత్వం ఎక్కడా సమస్యలు లేకుండా పకడ్బంధీగా వ్యవహరించింది. సర్దుబాట్లలో భాగంగా కొత్త పోస్టుల క్రియేషన్‌ జరగలేదు. కొత్తగా పోస్టుల అవసరం, ఏ ఖాఖకు ఎంతమంది అవసరం అనే విషయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఈ కసరత్తును నియామకాల భర్తీ తర్వాత చేయనున్నట్లు ప్రకటించింది. ఆర్డర్‌ టూ సర్వ్‌ ఉద్యోగులను వారి సొంత జిల్లాలకు స్థానికత ఆధారంగా బదలీ చేశారు.

ఉద్యోగ నియామకాలకు ఇకపై నెలవారీ క్యాలెండర్‌ దిశగా ప్రభుత్వం సిద్దమవుతోంది. గతంలో ఉద్యోగ నియామకాలకు రాష్ట్రంలో ఎటువంటి కాలపరిమితి లేదు. దీంతో అనేక ఖాళీలు ఎక్కువ కాలం కనిపిస్తూ పాలనలో జాప్యం తలెత్తుతోంది. నోటిఫికేషన్ల జారీ వరకు ఖాళీలు అలాగే కొనసాగుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ఈ క్రమంలో నోటిఫికేషన్లు, దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, రిక్రూట్‌మెంట్‌ ఆర్డర్ల జారీ వంటి వాటికి తీవ్ర జాప్యం ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామకాలకు టైం షెడ్యూల్‌ దిశగా సర్కార్‌ కృషి చేస్తోంది. ఖాళీలు ఏర్పడ్డ ఆరు నెలల్లోగా నియామకాలు పూర్తయ్యేలా నిర్ధిష్ట కార్యాచరణ చేస్తోంది. ఈ మేరకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌ నేతృత్వంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో టీఎస్‌పీఎస్సీ సహా ఇతర నియామక సంస్థలు, బోర్డులకు భాగస్వామ్యం కల్పించాలని యోచిస్తోంది. ఇందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. ఈ దిశలో టీఎస్‌పీఎస్సీ, పోలీస్‌ నియామక సంస్థ, వైద్య ఆరోగ్య నియామక సంస్థ, గురుకుల విద్యాలయాల సంస్థలను ఇందులో భాగస్వామ్యం కల్పించాలని యోచిస్తోంది. ఆ తర్వాత నెలవారీ క్యాలెండర్‌ను రూపొందించి ఎప్పటికప్పుడే ఖాళీలను భర్తీ చేసేలా ఉద్యోగ క్యాలెండర్‌ను రూపొందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నియామకాలకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తరహాలో ఎప్పటికప్పుడు ఖాళీలను గుర్తించి వాటిని భర్తీ చేస్తారు. ఇకపై రాష్ట్రంలో ఇదే విధానాన్ని తీసుకొచ్చి నియామకాలను ఏనెలాకానెల పూర్తి చేస్తారు.

కేంద్ర ప్రభుత్వం రైల్వే, బ్యాంకులు, ఇతర సంస్థలకు ఒకే పరీక్ష విధానాన్ని అమలు చేస్తున్న తీరును పరిశీలిస్తున్నారు. ఒకే పోటీ పరిక్షతో ఆయా సంస్థల పరిధిలోని ఉద్యోగులకు అభ్యర్ధులను గుర్తించి అర్హత వారీగా తీసుకుంటారు. మొదట ఈ విధానం ఇంజనీరింగ్‌ విభాగంలో వర్తింపజేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

- Advertisement -

ఏడేండ్ల భర్తీ వివరాలు….

డిపార్ట్‌మెంట్‌ సంఖ్య
టీఎస్‌పీఎస్సీ 30594
టీఎస్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు 31972
రెసిడెన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బోర్డు 3623
అగ్రికల్చర్‌ యూనివర్సిటీ 179
హార్టీకల్చర్‌ యూనివర్సిటీ 80
మైనార్టీ సంక్షేమ శాఖ 66
జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు 9355
ఆయూష్‌ 171
జెన్‌కో 856
టీఎస్‌ఎస్పీడిసిఎల్‌ 164
టీఎస్‌ఎస్పీడిసిఎల్‌ 201
ట్రాన్స్‌కో 206
టీఎస్‌ఆర్టీసీ 4768
సింగరేణి 12500
జెన్కో, ట్రాన్స్‌కో, టీఎస్‌డీపిసిఎల్‌ 6648
విద్యుత్‌ శాఖలో ఉద్యోగుల క్రమబద్దీకరణ 22637
జలమండలి 807
స్టేట్‌ కో ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌ 243
సహకార కేంద్ర బ్యాంకులు 1571
భర్తీ తుది దశలో ఉన్నవి 6258

Advertisement

తాజా వార్తలు

Advertisement