Friday, April 26, 2024

ఇటు టీమిండియా, అటు సఫారీలు.. సిరీస్‌పైనే గురి..

ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌పైనే ఆతిథ్య భారత్‌, పర్యాటక దక్షిణాఫ్రికా జట్టు కన్నేశాయి. తొలి రెండు ఢిల్లి, కటక్‌ మ్యాచ్‌ల్లో సఫారీలు గెలుపొందగా, విశాఖ, రాజ్‌కోట్‌ల్లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఘన విజయం సాధించి సిరీస్‌ను 2-2తో సమమైంది. దీంతో ఆదివారంనాడు బెంగళూరులో జరుగనున్న ఐదో టీ20 మ్యాచ్‌పైనే అందరి దృష్టి. విశాఖ, రాజ్‌కోట్‌ మ్యాచ్‌ల్లో ఘనవిజయంతో దూకుడు మీదున్న రిషబ్‌ పంత్‌ సేన, ఐదో టీ20లోనే అదే ప్రదర్శన కొనసాగించి, సిరీస్‌ను కైవసం చేసుకోవాలని వ్యూహరచనలు చేస్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయినప్పటికీ, ఆఖరి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో బవుమా సేన బరిలోకి దిగనుంది. భారత జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. ప్రస్తుతం టీమిండియాలో రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా, దినేష్‌ కార్తీక్‌, అక్షర్‌పటేల్‌, హర్షల్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, యుజ్వేందర్‌ చాహల్‌, అవేష్‌ ఖాన్‌లు కొనసాగుతున్నారు. ఇదే జట్టు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఐదో టీ20 మ్యాచ్‌లోనూ ఆడనుంది. బ్యాటింగ్‌ పరంగా చూస్తే ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌ అద్భుతంగా రాణిస్తున్నారు. కెప్టెన్‌ రిషబ్‌పంత్‌ మినహా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్లు శ్రేయాస్‌ అయ్యర్‌, హార్డిక్‌ పాండ్యా, దినేష్‌ కార్తీక్‌ బ్యాటింగ్‌ తీరు మెరుగుపడింది. నాల్గో టీ20లో అయ్యర్‌, హార్దిక్‌, దినేష్‌ల రాణింపుతోనే మ్యాచ్‌ సునాయాసంగా నెగ్గగలిగింది. అలాగే బౌలర్లు ప్రధానంగా అవేష్‌ ఖాన్‌ విజృంభణ(4/18)తో టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో ఇదే జట్టుతో రిషబ్‌సేన బరిలోకి దిగనుంది. ఇక దక్షిణాఫ్రికా జట్టు విషయానికొస్తే… కెప్టెన్‌ తెంబా బవుమా, క్వింటాన్‌ డికాక్‌, ప్రిటోరియస్‌, వాన్‌ డెర్‌ డస్సెన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, పార్నెల్‌, రబడ, కేశవ్‌ మహరాజ్‌, ఎన్రిచ్‌ నోర్ట్‌జీ, లుంగి ఎంగడితోనే బరిలోకి దిగనుంది. ఓపెనర్లు శుభారంభాన్ని అందించడంలో విఫలమైనప్పటికీ మిడిలార్డర్‌లో డస్సెన్‌, క్లాసెన్‌, మిల్లర్‌ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక బౌలర్లలో రబడ, మహరాజ్‌, నోర్ట్‌జీ పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. దీంతో ఎలాంటి మార్పుల్లేకుండా బవుమా సేన బరిలోకి దిగనుంది.

వర్షం అడ్డంకి?

ఆదివారంనాడు బెంగళూరు చిన్నసామి స్టేడియంలో జరుగనున్న ఐదో టీ20 మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశాలున్నాయి. గత మూడు రోజులుగా బెంగళూరు నగరంలో మోస్తరు వర్షం కురుస్తోంది. ఆదివారం కూడా ఇదే పునరావృతమయ్యే అవకాశాలున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు చిన్నసామి స్టేడియంలో భారీ స్కోరు చేయడం కష్టమేనని, పిచ్‌ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తొలి సెషన్‌లో మంచి స్కోరు చేసినప్పటికీ రెండో సెషన్‌లో బ్యాటింగ్‌ చేయడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీ20 సిరీస్‌లో ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా టాస్‌ గెలుస్తూ, ఫీల్డింగ్‌ ఎంచుకుంటోంది. ఐదో టీ20లో టాస్‌ చాలా కీలకం. బంగళూరు స్టేడియంలో 8 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో అదీ ఛేజింగ్‌ చేసి విజయం సాధించిన రికార్డు దక్షిణాఫ్రికాకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement