Friday, November 8, 2024

ఒకే అమ్మాయిని నాలుగుసార్లు పెళ్లాడిన వ్యక్తి.. ఎందుకో తెలుసా?

తైవాన్ దేశంలో ఓ వ్యక్తి ఒకే అమ్మాయిని నాలుగుసార్లు పెళ్లాడాడు. ఎందుకో తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం. తైవాన్ దేశ లేబర్ చట్టాల ప్రకారం ఎవరైనా ఉద్యోగి పెళ్లి చేసుకుంటే 8 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి. ఈ అంశాన్ని తైపై నగరంలో బ్యాంకు క్లర్క్‌గా పనిచేసే వ్యక్తి తనకు అనుకూలంగా వాడుకున్నాడు. గత ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్న అతడు నిబంధనల ప్రకారం.. 8 రోజుల సెలవుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 8 రోజులు పూర్తి కాగానే భార్యకు విడాకులు ఇచ్చాడు.

వెంటనే విడాకులు ఇచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుని మళ్లీ బ్యాంకులో 8 రోజుల సెలవులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇలా సదరు వ్యక్తి నాలుగుసార్లు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో సదరు బ్యాంకు విషయాన్ని గ్రహించి సెలవులను ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. అయితే సదరు వ్యక్తి లేబర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా అతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అంతేకాకుండా సెలవులు ఇవ్వని బ్యాంకు అధికారులకు లేబర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరిమానా కూడా విధించింది. ఏదేమైనా క్లర్క్ చేసిన ఘనకార్యానికి అనుకూలంగా తీర్పు రావడం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement