Tuesday, April 30, 2024

గంగిరెడ్డి బెయిల్ రద్దుపై విచారణ వాయిదా.. 21వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ట్రయల్ కోర్టులో జరుగుతున్న విచారణను మరో రాష్ట్రంలోని సీబీఐ కోర్టుకు బదిలీ చేయాల‌ని వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి నర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయం పెండింగులో ఉన్నందున ఈ కేసు విచారణ వాయిదావేస్తున్నట్టు ఇవ్వాల (సోమ‌వారం) సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం సునీత పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు ముగియగా, తీర్పు రిజర్వు చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఈ తీర్పు వెలువడుతుందని భావించగా, ధర్మాసనంలో మరో న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. తదుపరి విచారణ ఈ నెల 21న చేపట్టనున్నట్టు వెల్లడించింది.

కేసులో బెయిల్ మీద బయట ఉన్న గంగిరెడ్డి సాక్షులనే కాదు, దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులను సైతం బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ హైకోర్టును కోరగా, చెబుతున్న కారణాలకు తగిన ఆధారాలను సీబీఐ సమర్పించలేకపోయిందని పేర్కొంటూ హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, పిటిషన్ విచారణకు స్వీకరించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement