Saturday, April 27, 2024

ఉద్యోగుల తొలగింపుపై హామీ ఇవ్వని గూగుల్‌.. కఠిన నిర్ణయాలు తప్పవన్న సుందర్‌ పిచాయ్‌

టెక్‌ కంపెనీలను ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్‌లు ఇంకా కొనసాగుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయాన్ని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ను ఉద్యోగులు అడిగారు. భవిష్యత్‌ ఎలా ఉంటుందో ఇప్పుడే హామీ ఇవ్వడం కుదరదని ఆయన వారికి స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో మరిన్ని లేఆఫ్‌లు ఉండవని హామీ ఇవ్వలేనని, ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గూగుల్‌ 10 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై కంపెనీ అధికారింగా ఎంతమందని తొలగించనుందో స్పష్టం చేయలేదు. లేఆఫ్‌లు ఉంటాయని మాత్రం ప్రకటించింది.

రానున్న ముప్పును ఎదుర్కొనేందుకు సరైన ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని గూగుల్‌ సీఈఓ ఉద్యోగులను కోరారు. గూగుల్‌ మాతృ సంస్థ అల్ఫాబెట్‌ మొత్తం ఉద్యోగుల్లో 6 శాతం మందిని తొలగించాలని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారిలో ఆరు శాతం తొలగింపుకు అనుగుణంగా పని తీరు ఆధారంగా తొలగించాల్సిన ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని విభాగాల అధిపతులను సంస్థ కోరిందని అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నివేదికల ఆధారంగానే 2023 జనవరి నుంచి ఉద్యోగుల తొలగింపు ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం అల్ఫాబెట్‌లో 1,87,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆర్ధిక మాంద్యం భయాలతోనే ఈ సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను నెమ్మదించినట్లు కంపెనీ ఇటీవల ప్రకటించింది.

ఉద్యోగుల తొలగింపు ప్రక్రయ కొనసాగుతున్నందునే ఉద్యోగులతో భవిష్యత్‌ గురించి ఇప్పుడే హామీ ఇవ్వలేనని చెప్పారని భావిస్తున్నారు. సోషల్‌ మీడియా దిగ్గజ సంస్థ ట్విటర్‌ను ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేసిన తరువాత సగం మంది ఉద్యోగులను తొలగించారు. మస్క్‌ అల్టిమేటం జారీ చేయడంతో మరో 1200 మంది రాజీనామా చేశారు. త్వరలోనే మరికొంత మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆయన ప్రకటించారు. అత్యుత్తమ ఉద్యోగులే ట్విటర్‌లో ఉంటారని మస్క్‌ పేర్కొన్నారు.
అమెరికాలో ఇప్పటికే చాలా కంపెనీలు పద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఇంకా తొలగిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement