Tuesday, May 14, 2024

నీటి వివాదాల్లో రాష్ట్రాలు, నదుల అనుసంధానానికి అవరోధాలు.. గోదావరి-కావేరిపై కుదరని ఏకాభిప్రాయం

అమరావతి, ఆంధ్రప్రభ : ఒక వైపు మహానది-గోదావరి, మరో వైపు గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి..నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం ఎంత తొందరగా ఉన్నా భాగస్వామ్య రాష్ట్రాల మధ్య విభేదాలు అవరోధంగా మారుతున్నాయి. మహానది-గోదావరి, గోదావరి-కావేరిల నదుల అనుసంధాన ప్రక్రియలను సమాంతరంగా పూర్తి చేయాల్సిన నేపథ్యంలో ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల మధ్య తలెత్తిన వివాదం కేంద్ర జల వనరుల శాఖ పరిధిని దాటి ట్రైబ్యునల్‌ దాకా వెళ్లింది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలపై మహానది ట్రైబ్యునల్‌ తుది తీర్పు వెలువరించే దాకా నదుల అనుసంధాన ప్రక్రియను సాంకేతికంగా పూర్తి చేయటం సాధ్యం కాదని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) అభిప్రాయపడుతోంది. ఈ మేరకు న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నట్టు సమాచారం. నదుల అనుసంధాన ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ఏర్పాటయిన టాస్క్‌ ఫోర్స్‌ కూడా ఒడిశా-చత్తీస్‌గఢ్‌ల మధ్య తలెత్తిన వివాదాలపై కేంద్రానికి జలవనరుల శాఖకు నివేదిక అందించింది. ఈ నేపథ్యంలో ట్రైబ్యునల్‌ తుది తీర్పుకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉన్నందున అప్పటిదాకా అనుసంధాన ప్రక్రియకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు అవి అమలుకు నోచుకోవటంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి అనుసంధానంపై కూడా ఇంతవరకు భాగస్వామ్య రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. గోదావరిలో మిగులు నీటి లభ్యతపై స్పష్టత ఇచ్చాకే అనుసంధాన ప్రక్రియను ముందుకు నడిపించాలని తమిళనాడు మినహా మిగతా భాగస్వామ్య రాష్ట్రాలన్నీ కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో మహానది-గోదావరి అనుసంధానంపై ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల తీవ్ర వివాదాలు తలెత్తటంతో గోదావరి-కావేరి యాక్షన్‌ ప్లాన్‌ కు సైతం తాత్కాలికంగా బ్రేకులు పడ్డట్టేనని నిపుణుల అభిప్రాయం. మహానది జలాల్లో వాటాపై ఒడిశా, చత్తీస్‌ గఢ్‌ల మధ్య ఎప్పటి నుంచో వివాదాలు కొనసాగుతున్నాయి. రెండు రాష్ట్రాల్ర మధ్య వివాదాల పరిష్కారానికి 2018లో ప్రత్యేకంగా -టైబ్యునల్‌ ఏర్పాటయినా ఇంతవరకు తుది తీర్పు వెలువరించలేదు. తుది తీర్పును మూడేళ్ల లోపు వెలువరించాల్సి ఉన్నా ఆలస్యం కావటంతో కాలపరిమితిని 2023 మార్చి వరకు పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అనుసంధానం..ఇలా..!

ఈ నేపథ్యంలో ఒడిశాలోని బర్మూర్‌ పరిధిలోని మహానది నుంచి 408 టీ-ఎంసీల నీటిని గోదావరిలోకి మళ్లించటం..ఆ నీటిలో 178 టీఎంసీలను ఒడిశా పరిధిలో నిర్మించిన అయిదు సాగు నీటి ప్రాజెక్టులకు కేటాయించటం..మిగతా 230 టీఎంసీలను ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన గోదావరిలోకి తరలించటం ద్వారా మహానది-గోదావరి తో పాటు గోదావరి-కావేరి అనుసంధానానికి కూడా ఉపయోగపడేలా జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదనలు సిద్దం చేసింది. మహానదిలో రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలను తేల్చకుండా అనుసంధానానికి అంగీకరించేది లేదని ఒడిశా, చత్తీస్‌గడ్‌లు చెబుతున్నాయి. ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన తమ రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలను దెబ్బతీసేది ఉందని చత్తీస్‌ ఘడ్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. అనుసంధానం కోసం బర్మూర్‌ నుంచి 408 టీఎంసీలను తరలిస్తే మహానది ట్రైబ్యునల్‌ తీర్పు బిన్నంగా వస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తక తప్పదని నిపుణులు అభిప్రాయడుతున్నారు.

కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక సలహాదారు వెదిరె శ్రీరాం ఆధ్వర్యంలో ఏర్పడిని టాస్క్‌ ఫోర్స్‌ కూడా ట్రైబ్యునల్‌ తీర్పు వచ్చే దాకా వేచి ఉండటమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరో వైపు మహానది నుంచి తరలించే 230 టీఎంసీలతో పాటు ప్రతి ఏడాది వరదలు వచ్చే జూన్‌-అక్టోబరు మధ్య 247 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా(నాగార్జునసాగర్‌), పెన్నా (సోమశి) ద్వారా కావేరి (గ్రాండ్‌ ఆనక)కు తరలించటం ద్వారా గోదావరి-కావేరి అనుసంధానం చేపట్టాలన్న ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనపై కూడా ఏపీతో సహా మిగతా భాగస్వామ్య రాష్ట్రాల్ర మధ్య ఇంతవరకు ఏకాభిప్రాయం కుదరలేదు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement