Wednesday, May 1, 2024

ఉచిత బియ్యాన్ని అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ సర్కారుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ధ్వజం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై)’ పథకం కింద పేదలకు ఉచితంగా అందజేస్తున్న బియ్యం, ఇతర రేషన్ సరుకులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఏప్రిల్, మే నెలల్లో పంపిణీ చేయాల్సిన ఉచిత రేషన్ రాష్ట్ర ప్రభుత్వం అందించలేదని అన్నారు. సోమవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో 89 లక్షల కుటుంబాలకు, అంటే రాష్ట్ర జనాభాలో సగం మందికి కోవిడ్ లాక్‌డౌన్ సమయం నుంచి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న బియ్యాన్ని ఎందుకు నిలుపుదల చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పంపిణీ నిలిపివేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని సరఫరా చేయడం లేదంటూ అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ డీసీపీ (డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్) రాష్ట్రమైనందున రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి, ఆహార భద్రతా చట్టం కింద నమోదైన లబ్దిదారులకు అవసరమైన నిల్వలను మిగిల్చుకుని, మిగిలిన బియ్యాన్ని సెంట్రల్ పూల్ కింద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)కి అందజేయాల్సి ఉంటుందని జీవీఎల్ గుర్తుచేశారు. ఉచిత రేషన్ ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందన్న అక్కసుతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ విషయంపై కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశామని, ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఆయనన్నారు. పేదలకు పక్కా గృహాలను అందించే ‘ప్రధానమంత్రి అవాస్ యోజన’ పథకాన్ని కూడా సరిగా అమలు చేయడం లేదని, రాజకీయం చేయకుండా లబ్ధిదారులకు ఇళ్లను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఆయన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో 89 లక్షల కుటుంబాలు (2.68 కోట్ల మంది జనాభా) ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా లబ్ది పొందుతున్నారని, మొదటి 5 దశల్లో 2022 మార్చి వరకు 25 లక్షల టన్నులకు పైగా బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం పంపిణీ చేసిందని లేఖలో గుర్తుచేశారు. అలాగే ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 5,500 కోట్లు కేంద్రం విడుదల చేసిందని గణాంకాలు వెల్లడించారు. 6వ దశలో 2022 సెప్టెంబర్ వరకు ఈ పథకాన్ని పొడిగించినట్టు కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ, ఏపీలో అమలు చేయడం లేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పైగా కేంద్ర ప్రభుత్వం ఎఫీసిఐ నిల్వల నుంచి బియ్యాన్ని విడుదల చేయలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని పేర్కొన్నారు. అయితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) అధికారులను సంప్రదించి వివరాలు సేకరించగా, రాష్ట్ర ప్రభుత్వం వద్ద 14 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలున్నట్టు తేలిందని ఇందులో నెలకు కేవలం 1.2 లక్షల టన్నుల బియ్యం సరిపోతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఏపీలోని 2.68 కోట్ల మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఉచిత బియ్యం పంపిణీకి పూర్తి ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నా, ప్రజల దృష్టిలో కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు రాజకీయ కారణాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరఫరాలకు అంతరాయం కల్గిస్తోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై దృష్టిసారించి లబ్దిదారులకు ఉచిత బియ్యం అందేలా చూడాలని జీవీఎల్ విజ్ఞప్తి చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement